(Source: ECI/ABP News/ABP Majha)
Telangana Congress : ఆ మూడు స్థానాల్లో అభ్యర్థులు ఎవరు ? ఇంకా తేల్చుకోని కాంగ్రెస్
Telangana Politics : నామినేషన్లు ప్రారంభమైనా మూడు స్థానాలకు అభ్యర్థులను తేల్చలేదు కాంగ్రెస్ హైకమాండ్. అభ్యర్థులుగా ఖరారైనా పార్టీ నేతల స్పందన ఎలా ఉంటుందోనన్న ఉద్దేశంతో ఆపారని అంటున్నారు.
Congress has not decided candidates for three seats : తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. బీఆర్ఎస్ పార్టీ చీఫ్ తమ పార్టీ అభ్యర్థులకు బీఫామ్స్ పంపించారు. బీజేపీ కూడా అన్ని సీట్లకూ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. అయితే అధికార కాంగ్రెస్ మాత్రం మూడు స్థానాల విషయంలో ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఖమ్మంకు పొంగులేటి ప్రసాదరెడ్డి, కరీంనగర్‌కు వెల్చాల రాజేందర్‌రావు, హైదరాబాద్‌కు సమీర్ వలీవుల్లా లను అభ్యర్థులుగా నిర్ణయించారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం రావడ లేదు.
కరీంనగర్ టికెట్ ఎవరికన్న విషయంలో పార్టీ హైకమాండ్ ఆది నుంచి సామాజిక కోణంలోనే ఆలోచిస్తోంది. ఇక్కడ మొదటి నుంచీ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డితోపాటు వెలమ సామాజిక వర్గానికి చెందిన వెల్చాల రాజేందర్‌రావు పేరు మాత్రమే పరిశీలించారు. రాష్ట్రంలోని ఒక స్థానాన్ని వెలమలకు కేటాయించాలన్న యోచనతో రాజేందర్‌రావు వైపు మొగ్గు చూపినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో కేవలం రాజకీయ కారణాలతోనే అభ్యర్థిత్వం ఆలస్యమైంది. ఎంఐఎం విషయంలో అనుసరించాల్సిన ధోరణి, బీజేపీని నిలువరించే ప్రయత్నాల్లో భాగంగా చివరివరకు హైదరాబాద్ అభ్యర్థిని ఖరారు చేయలేదని తెలుస్తోంది.
హైదరాబాద్‌లో నుంచి పోటీ చేయడానికి ఫిరోజ్‌ఖాన్, అజారుద్దీన్, సమీర్ వలీవుల్లా, అలీ మస్కతి లాంటి నాయకులు ముందుకు వచ్చారు. అయితే వీరు పోటీ చేస్తే.. తీవ్రంగా ప్రయత్నించే అవకాశం ఉంది. అది మజ్లిస్ కు నష్టం చేస్తుంది. అందుకే హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సమీర్ వలీవుల్లాను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అలీ మస్కతి పేరును చివరి వరకు పరిశీలనలోకి తీసుకున్నా మజ్లిస్ పెద్దల అభ్యంతరంతో ఖరారు చేయలేదని చెబుతున్నారు.
మరో వైపు ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి అంశం పీట ముడిపడిపోయింది. అక్కడ కూడా రెడ్డి సామాజికవర్గ అభ్యర్థికి ఖరారు చేస్తే.. ఇతర వర్గాల మద్దతు లభించడం కష్టమన్న వాదన వినిపిస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడి కోంస తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీలో చేరినప్పుడు ఆయనకు ఇచ్చిన హామీ మేరకు.. ఆయన సోదరుడికే టిక్కెట్ ఇస్తున్నారని చెబుతున్నారు. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన ప్రధాన వర్గం... ఈ సారి కాంగ్రెస్ కు మద్దతు పలికే అవకాశాలు ఉండవని అంచనా వేస్తున్నారు. ఇరప్పటికే మాదిగ వర్గం కాంగ్రెస్ కు దూరమయింది. అన్నీ రెడ్డి వర్గానికే కేటాయించడం వల్ల మిగతా అన్ని వర్గాలు దూరమవుతాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో మూడు టిక్కెట్ల ఖరారు తర్వాత కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.