Case On Perni Nani : పోలీస్ స్టేషన్‌లో విధ్వంసం - పేర్ని నానితో సహా పలువురిపై కేసు నమోదు !
Andhra Politics : పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన ఘటనలో పేర్ని నాని సహా పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. బందరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారని కేసునమోదయింది.
Cases have been registered against Perni Nani : బందరు తాలుకా పోలీస్‌స్టేషన్ ముందు వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని , ఆయన అనుచురులు అలజడి రేపిన అంశంపై పోలీసులు చర్యలకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే పేర్నినాని, అతని అనుచురులపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఐపీసీ 188, 143, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే ?
గత వారం బందరు నియోజకవర్గంలోని ఉల్లిపాలెం నూకాలమ్మ తల్లి జాతరలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనపై పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు వీరిలో వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై కేసులు ఎలా పెడతరాని ఆయన ప్రశ్నించారు. కార్యకర్తలతో సహా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. తాలూకా పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ చాణిక్యతో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలు వచ్చాయి. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారంటూ నిరసనకు దిగారు. టీడీపీకి ఎస్‌ఐ కొమ్ముకాస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆరోపించారు.
ఫర్నీచర్, సీసీ టీవీ ఫుటేజీ ధ్వంసం చేసిన కార్పొరేటర్లు
మంగళవారం వైసీపీ కార్యకర్తలతో కలిసి చేసిన ధర్నాలో కొంత మంది పోలీస్ స్టేషన్‌లో సీసీ ఫుటేజ్, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీనిపై చిలకలపూడి పీఎస్‌లో తాలుకా పోలీసులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా 144 సెక్షన్‌ను అతిక్రమించారని 188 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఉద్దేశ్వపూర్వకంగా పోలీస్ స్టేషన్ వద్ద గలాటా సృష్టించారని సెక్షన్ 143 కింద కేసు నమోదు అయ్యింది. సీసీ ఫుటేజ్, ఫర్నిచర్ ధ్వంసం చేసినందుకు సెక్షన్ 427 కింద పేర్ని నాని మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మచిలీపట్నంలో ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లపై కేసు నమోదు అయ్యింది. పోలీస్ స్టేషన్‌లో కార్పొరేటర్లు మేకల సుబ్బన్న, మీర్ అస్ఘర్ అలీ, జవ్వాది రాంబాబు సీసీ ఫుటేజ్, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ముగ్గురు కార్పొరేటర్లపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో తాలుకా పోలీస్ స్టేషన్ సెంట్రీ కానిస్టేబుల్ హరికృష్ణ ఫిర్యాదు చేశారు.
సీరియస్ గా తీసుకున్న పోలీసులు
నేరుగా పోలీస్ స్టేషన్ పైనే దాడి చేసిన ఘటన కావడంతో .. పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఇలా చేయండ పోలీసు విధులకు ఆటంకం కలిగించడమేనని భావిస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసినందున.. తదుపరి చర్యలు తీసుకునేదిశగా ఆలోచిస్తున్నారు.