BRS And BSP Alliance: బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు ఖరారు- పంచుకున్న సీట్లు ఇవే!
Telangana News: లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న బీఆర్‌ఎస్, బీఎస్పీ మధ్య సీట్ల పంపకాలు పూర్తి అయ్యాయి
KCR And Praveen Kumar: ఈ ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భారత్ రాష్ట్ర సమితి, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ నిర్ణయించాయి. ఈ మేరకు సీట్ల పంపకాలు కూడా పూర్తి చేసుకున్నాయి. ఇప్పటికే గులాబీ పార్టీ 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పుడు రెండుస్థానాలను బీఎస్పీకి ఇచ్చింది. అంటే ఇంకా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
బీఎస్పీ పోటీ చేసే సీట్లు ఇవే
హైదరాబాద్
నాగర్‌కర్నూల్ - ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
ఈ రెండు స్థానాల నుంచి బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్ నేతలు బీఎస్పీకి సహకరిస్తారు. మిగతా 15 స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు పోటీ చేస్తారు.
ఇప్పటి వరకు ప్రకటించిన బీఆర్‌ఎస్ అభ్యర్థులు వీళ్లే
చేవెళ్ల- కాసాని జ్ఞానేశ్వర్
వరంగల్- కడియం కావ్య
జహీరాబాద్- గాలి అనిల్‌కుమార్
నిజామాబాద్- బాజిరెడ్డి గోరవర్ధన్ రెడ్డి
ఖమ్మం- నామా నాగేశ్వర్‌రావు
మహబూబాబాద్- మాలోత్ కవిత
కరీంనగర్- బోయినపల్లి వినోద్‌కుమార్
పెద్దపల్లి- కొప్పుల ఈశ్వర్
మహబూబ్‌నగర్- మన్నె శ్రీనివాస్ రెడ్డి
మల్కాజ్‌గిరి- రాగిడి లక్ష్మారెడ్డి
ఆదిలాబాద్- ఆత్రం సక్కు
ఈ చర్చల్లో భాగంగానే నాగర్ కర్నూలు బీఆర్ఎస్, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థిగా తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని నాగర్‌కర్నూలు బీఆర్‌ఎస్ నేతలు ప్రకటించారు. బీఎస్పీ విజయం కోసం అందరం కలిసి కృషి చేస్తామన్నారు. పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి, హక్కులు కాపాడుకోవడానికి ఈ పొత్తు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
వంద రోజుల కాంగ్రెస్ అసమర్థ పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామన్నారు బీఆర్‌ఎస్, బీఎస్పీ నేతలు.
రుణమాఫీని అటకెక్కించిందని... రుతుభరోసా ఆగిపోయిందన్నారు. మహిళలకు నెలకు రూ.2500, నిరుద్యోగులకు రూ.4000 భృతి పథకాల ఊసెత్తడం లేదని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వం భర్తీచేసిన 30 వేల ఉద్యోగాలకు నియామకపత్రాలు అందజేసి తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు బీఆర్‌ఎస్‌నేతలు. సాగునీళ్లు ఆగిపోయాయని.. తాగునీళ్లకు కరువొచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రుల మధ్య సమన్వయం లేదన్న బీఆర్‌ఎస్ నేతలు. అంతర్గత కలహాలతో కాంగ్రెస్ సతమతమవుతుందని ఆరోపించారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓ ప్రకటనలో ... మంత్రులు, ముఖ్యమంత్రి పరస్పర విరుద్ద ప్రకటనలతో ప్రజలను అయోమయంలో పడేస్తున్నారు. పదేళ్లలో పచ్చబడ్డ పాలమూరు మళ్లీ భీడు భూములతో దర్శనమిస్తుంది. కరెంటు కోతలతో రైతులు తల్లడిల్లుతున్నారు. అర్థరాత్రి కరెంటు కోసం రైతులు పాట్లు పడుతున్నారు. కాంగ్రెస్ తెచ్చిన ఈ మార్పులను గడప గడపకూ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలి అని విమర్శించారు.
"బీఆర్ఎస్‌తోనే తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోగలం. నాగర్ కర్నూలు ఎంపీ స్థానాన్ని గెలిపించి కేసీఆర్‌కి బహుమతిగా ఇద్దాం." - బీఆర్ఎస్ సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి