ఈటలపై పైచేయి సాధించిన బండి- తుల ఉమకు నిరాశ- పార్టీ వీడే యోచన!
Tula Uma Going To Resigning BJP : తెలంగాణ బీజేపీపై ఈటల పట్టు సాధిస్తున్నారా..? లేదంటే మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పట్టు నిలుపుకున్నారా ? ఇప్పుడిదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది
తెలంగాణ(Telangana) బీజేపీపై ఈటల(Etela Rajendar) పట్టు సాధిస్తున్నారా..? లేదంటే మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) పై సాధించారా ? ఇప్పుడిదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రెండేళ్ల క్రితం ఇటీవల చేరిన ఈటల రాజేందర్ కంటే ముందు నుంచి ఉన్న బండి సంజయ్ పైనే పార్టీ హైకమాండ్ విశ్వసనీయత కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో కమలం పార్టీ వైపు నిలబడిన అభ్యర్థులను చూస్తే, బండి సంజయ్ కే అధిష్ఠానం ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈటల మద్దతుదారులకే ఎక్కువ టికెట్లు కేటాయింకచినా, తుల ఉమకు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి లాక్కోవడం దుమారం రేపుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీట్ల వ్యవహారం చిచ్చు రాజేస్తోంది. పార్టీలోని కీలక నేతలు ఎవరికివారు తమ అనుచరులకు టికెట్ ఇప్పించుకున్నారు. కొందరు అనుకున్న ఫలితాలను సాధించగా, మరికొందరికి మొండిచేయి చూపింది బీజేపీ హైకమాండ్. పోయిన చోటే వెతుక్కొవాలని భావిస్తోన్న కమలం పార్టీ, బండి సంజయ్ ని పదవి నుంచి తప్పించిన తర్వాత ఆ పార్టీ కేడర్ డీలా పడింది. అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బండి సంజయ్ కి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించింది. కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది. తాజాగా బీసీ సీఎం నినాదంతో ముందుకు వెళ్తోంది. అయితే సీఎం అభ్యర్థి ఎవరు అనే ప్రశ్న అందరినీ వెంటాడుతోంది. బండి సంజయ్, ఈటల రాజేందర్ లో ఒకరు ఉంటారని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అనేలా వ్యవహరిస్తోంది.
భాగ్యనగరంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోడీకి ఈటలను పక్కన కూర్చోబెట్టుకోవడం, బండి సంజయ్ ని అభినందించడం వారి అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు. కథ అక్కడి వరకు బాగానే ఉన్నా, ఆ తర్వాత సీన్ మారిపోయింది. టికెట్ల కేటాయింపు వ్యవహారం ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య చిచ్చురేపింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనుచరురాలు తుల ఉమకు వేములవాడ అసెంబ్లీ టికెట్ ఇప్పించుకున్నారు. మాజీ జడ్పీ ఛైర్మన్ గా పని చేసిన తుల ఉమ, వేములవాడ స్థానానికి నామినేషన్ కూడా వేశారు. వేములవాడ నియోజకవర్గంలో ప్రచారాన్ని కూడా మొదలు పెట్టేశారు. అయితే నామినేషన్ల చివరి రోజు తుల ఉమకు బీజేపీ నాయకత్వం షాక్ ఇచ్చింది. మాజీ కేంద్ర మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావుకు టికెట్ ఇచ్చింది. బీఫాం కూడా ఇవ్వడంతో వికాస్ రావు నామినేషన్ వేశారు.
టికెట్ ఆఖరి నిమిషంలో చేజారిపోవడంతో తుల ఉమ బోరున విలపించారు. తనను నమ్మించి మోసం చేశారని వాపోయారు. అయితే టికెట్ ఇవ్వకపోవడంపై అసంతృప్తిగా ఉన్న ఆమె బీజేపీకి రాజీనామా చేసే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. బీజేపీ నుంచి కూడా బుజ్జగింపులు ప్రారంభమైనట్టు వార్తలు వస్తున్నాయి.
ఈటల రాజేందర్ అనుచరవర్గంలో కీలకంగా ఉన్న తుల ఉమకు కాకుండా వికాస్ రావును బరిలోకి దించడంపై మాజీ మంత్రి లోలోపల రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. హుస్నాబాద్ విషయంలోను ఈటల తన అనుచరుడు సురేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరడంతో పార్టీ మొండి చేయి చూపింది. ఆ స్థానాన్ని బండి సంజయ్ అనుచరుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి కేటాయించింది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, వికాస్ రావుకు టికెట్ వచ్చేలా చివరి నిమిషంలో చక్రం తిప్పినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తుల ఉమకు అన్యాయం జరగడంపై ఈటల రాజేందర్ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లు తయారైనట్లు తెలుస్తోంది. మొత్తంగా అసెంబ్లీ సీట్ల వ్యవహారంలో ఈటల రాజేందర్ పై బండి సంజయ్ పైచేయి సాధించినట్లు బీజేపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.