ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై వైసీపీ ఫోకస్-ఒక్క ఓటు కూడా పోకుండా ప్లాన్!
ఎమ్మెల్యే కోటాలో ఏడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కో అభ్యర్థికి 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. అధికార పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ ఏడుగురిని బరిలోకి దించింది.
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఏడు స్థానాలు గెలుచుకోగా... మూడింటిని తెలుగుదేశం గెలుచుకుంది. వైసీపీ ఏడు స్థానాలు గెలుచుకున్నప్పటికీ మూడు పట్టభద్రుల ఎన్నికల్లో ఓడిపోవడం ఆపార్టీని కలవర పెడుతోంది. తప్పు ఎక్కడ జరిగిందా అని వైసీపీ అధినాయకత్వంలో అంతర్మథనం మొదలైంది. మరోసారి తప్పు జరగకుండా వ్యూహాన్ని రచిస్తోంది. మార్చి 23 జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులంతా గెలిచేలా కసరత్తు ప్రారంభించింది.
మ్యాజిక్ జరగుతుందా?
ఎమ్మెల్యే కోటాలో ఏడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కో అభ్యర్థికి 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. అధికార పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ ఏడుగురిని బరిలోకి దించింది. టీడీపీ ఒకరిని బరిలో నిలిపించింది. తమ అభ్యర్థులంతా గెలుస్తారన్న ధీమాతో వైసీపీ ఉన్నప్పటికీ పట్టభద్రుల ఎన్నికల ఫలితం, కొంత మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుతో మరింత జాగ్రత్తలు తీసుకుంటుంది. 154 ఓట్లు పడితేనే వైసీపీ అభ్యర్థులంతా గెలుస్తారు. కానీ వైసీపీకి ఉన్న బలం 151 మంది సభ్యులు. టీడీపీ తరఫున గెలిచిన వారిలో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. వారితోపాటు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా అధికార పార్టీకి మద్దతుగా నిలవనున్నారు. దీంతో తమ పార్టీకి తిరుగులేదని వైసీపీ భావిస్తోంది.
ఆ ఇద్దరు మినహా!
అయితే వైసీపీలో ఈ మధ్య ఏర్పడిన మార్పులు కారణంగా కొందరు ధిక్కార స్వరం వినిపించి బయటకు వచ్చేశారు. వాళ్లు కచ్చితంగా తమ అభ్యర్థికి వేయబోరని నమ్ముతోందా పార్టీ. అయితే వారితోపాటు ఇంకా ఎవరైనా అటు మొగ్గుతారేమో అన్న అనుమానం పార్టీలో ఉంది. అందుకే అనుమానితులపై ఓ కన్నేసి ఉంచారని టాక్ నడుస్తోంది. టీడీపీ అభ్యర్థిని నిలబెట్టిందంటే ఏదో ధైర్యం ఉండే ఉంటుందన్న కోణంలో ఆరా తీస్తున్నట్టు సమాచారం. అసలు టీడీపీ అంత ధీమా ఇచ్చిన నాయకులు ఎవరు... వాళ్లకున్న ధైర్యం ఏంటని నిఘా పెట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఒక్క ఓటు కోసం టీడీపీ ప్రయత్నం
పార్టీపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఎలాగూ తమ అభ్యర్థికి ఓటు వేయరని అధికార పక్షం విశ్వాసం. తమ అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తామని కూడా ఈ ఇద్దరు చెప్పేశారు. ఆ ఇద్దరు టీడీపీకి ఓటు వేస్తే ప్రతిపక్షం బలం 21కు చేరుకుంది. దీంతో గెలవడానికి మరో ఓటు అవసరం. అధిష్ఠానంపై అసంతృప్తితో ఉంటున్న వాళ్లు ఒక్కరైనా తమకు ఓటు వేయకపోతారా అని టీడీపీ అనుకుంటోంది.
స్పెషల్ కాన్సెంట్రేషన్
ఒకవేళ అధికార పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే అయినా తన ఓటును టీడీపీకి వేస్తే మాత్రం మరో సంచలనం నమోదు కాబోతోంది. అందుకే అలాంటి పరిస్థితి రాకుండా వైసీపీ జాగ్రత్త పడుతుంది. ఎమ్మెల్యేలను గ్రూప్‌లుగా విభజించి ఓట్లు వేసేలా ప్లాన్ చేస్తోంది. వారికి ఓటు వేసే విధానంపై ట్రైనింగ్ ఇవ్వబోతోంది. దీని కోసం మాక్ పోలింగ్ నిర్వహించిందిం. మరోసారి కూడా నిర్వహించనుంది.ఇప్పటికే 23న జరిగే ఓటింగ్‌కు అందరూ హాజరుకావాలని విప్ జారీ చేసింది వైసీపీ.