YSRCP Election Campaign: భీమిలి నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం.. అదిరిపోయేలా తొలి సభకు ఏర్పాట్లు
Jagan Will Start Election Campaign: వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వైసీపీ భీమిలి నుంచి ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమైంది.
YSRCP Election Campaign Starts On 27th This Month : మరో రెండు మాసాల్లోనే ఏపీ( Andhra Pradesh)లో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరగనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఒకవైపు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఓటర్ల తుదిజాబితా(Final Voters List)ను కూడా విడుదల చేసింది. అదే సమయంలో పోలింగ్‌బూత్‌లు, భద్రత, అధికారుల బదిలీలు..తదితర కీలక అంశాలపైనా దృష్టి పెట్టింది. ఈ పరిణామాలతో వచ్చే ఫిబ్రవరి(February)లో ఏ రోజైనా.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న రాజకీయ పార్టీలు ప్రచారం దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఇతర పార్టీలకన్నా..
ఈ క్రమంలో ఇతర పార్టీలకన్నా.. అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్(YSRCP) ఒక అడుగు ముందే ఉంది. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించిన కసరత్తును ముమ్మరం చేసింది. దాదాపు 60 నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లను కూడా నియమించింది. మిగిలిన నియోజకవర్గాలపైనాదృష్టి పెట్టింది. ఈ కసరత్తు ఇలా కొనసాగుతుండగానే.. కీలకమైన ఎన్నికల(Elections) ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని దుమ్మురేపేలా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది.
లక్ష్యం ఇదే..
వచ్చే ఎన్నికలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్(YSRCP) పార్టీ కీలకంగా భవిస్తున్న విషయం తెలిసిందే. రెండోసారి వరుసగా విజయం దక్కించుకుని అధికారంలోకి రావడం ద్వారా రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో ముందు కు సాగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎదురయ్యే భారీ పోటీని ముందుగానే అంచనా వేసిన.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. దానిని దీటుగా ఎదుర్కొనేందుకు అస్త్ర శస్త్రాలతో ఇప్పటికే సిద్ధమైం ది. ప్రధానంగా ఈ 56 మాసాల తమ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమం, ఇతర పథకాలు, నాడు నేడు, జగనన్న ఇళ్లు.. ఇలా ఇతర కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లనుంది.
ప్రచార పర్వానికి నాంది
అదేసమయంలో గత ప్రభుత్వానికి.. తమ ప్రభుత్వానికి మధ్య తేడా చూడాలంటూ.. ప్రజలకు ఆయా విషయాలపైనా పోలికలు చూపించే ప్రయత్నం కూడా చేయనుంది. మొత్తంగా.. అధికారవైఎస్సార్ సీపీ.. ఎన్నికల సంగ్రామం(Election Campaign)లోకి దాదాపు దిగిపోయినట్టే కనిపిస్తోంది. ఇక, ఈ క్రమంలోనే ఈ నెల 27 శని వారం(Saturday) నుంచి ప్రచార పర్వానికి నాందిపలకనున్నారు. తూర్పున ఉన్న విశాఖపట్నంలోని భీమిలి నియోకవర్గం నుంచి ఎన్నికల ప్రచార శంఖం పూరించనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు సైతం ముమ్మరంగా సాగుతున్నాయి.
34 నియోజకవర్గాలపై..
మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాల్లో(North Andhra Districts) 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో గత 2019లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే.. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మరిన్ని స్థానాల్లోనూ విజయం దక్కించుకునేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. ఉద్దానంలో ఏర్పాటు చేసిన కిడ్నీ(Kidney) పరిశోధన కేంద్రం సహా.. కిడ్నీ రోగులకు అందిస్తున్న పింఛన్లు, వెనుక బడిన జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో చేపట్టిన అభివృద్ధి, మత్స్యకారుల కుటుంబాలకు చేస్తున్న మేళ్లు.. ఇతర ప్రాజెక్టుల నిర్మాణం.. పోర్టుల ఏర్పాటు వంటి అంశాలను ప్రచార వస్తువులుగా మార్చుకోనుంది.
పార్టీ నేతలకు దిశానిర్దేశం..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర రీజియన్(North Andhra) పరిధిలోని నాయకులు, ప్రజాప్రతినిధులను రానున్న ఎన్నికలకు సమాయత్తం చేసేలా ఈ నెల 27న భీమిలిలో నిర్వహిస్తున్న సభకు పార్టీ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. భీమిలి(Bhimili) నియోజకవర్గంలోని సంగివలసలో ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాలనే అంశంపై ప్రజాప్రతినిధులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. తద్వారా.. ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టనున్నారు.