Andhra Pradesh Assembly Elections 2024: ప్రచారం ముగియక ముందే ప్రలోభాలు- అంతా ఆన్‌లైన్‌లోనే...
Telugu News: గత నాలుగు రోజుల నుంచి గ్రామాల్లో నోట్ల కట్టలు తెగడం మొదలైంది. ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడా లేదు. అన్ని పార్టీల శ్రేణులు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి సిద్ధపడుతున్నాయి.
Andhra Pradesh News: ప్రచారం ముగియనుంది ప్రలోభాలకు తెరలేవంనుంది. ఇప్పటికే భారీగా నగదు తనిఖీల్లో చిక్కుతోంది. ఓటర్ల పంచేందుకు పార్టీలు పెద్ద ఎత్తున నగదు రవాణా చేస్తున్నారు. మూడో కంటికి తెలియకుండా తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా ప్రాంతాల్లో డబ్బు, ఇతర పంపిణీ సామాగ్రి చిక్కుతోంది. మరి కొన్ని పార్టీలు ఆన్‌లైన్‌లో డబ్బులు చేరవేస్తోందని ఇంకొన్ని ప్రాంతాల్లో కోడ్ రూపంలో చూపిస్తే కావాల్సిన ఇంటి సరకులు పంపిణీ చేస్తోందనే ప్రచారం ఉంది.
టెన్షన్ టెన్షన్
మొత్తానికి నగదు, వస్తు రూపంలో ఓటర్ల ప్రలోభ పెట్టేందుకు ఎన్నికల సంఘం కళ్లకు గంతలు కట్టేందుకు అన్ని పార్టీల శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా నోట్ల కట్టలను తరలించి నియోజకవర్గాల్లో సర్దే ప్రయత్నాల్లో అన్ని పార్టీల శ్రేణులు బిజీగా ఉన్నాయి. అయినా సరే ఎన్నికల సంఘం డేగ కళ్లతో పహారా కాస్తు పార్టీల ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది.
ప్రలోభాల పర్వం
అభ్యర్థుల్లో మాత్రం టెన్షన్ పెరిగిపోతోంది. ప్రచారంతో హోరెత్తించి హామీలతో ముంచెత్తిన ఓట్లు పడతాయోలేదో అన్న భయం వారిని వెంటాడుతోంది. అందుకే డబ్బు, ఇతర ప్రలోభాలతో ఓట్ల వేటకు సిద్ధమయ్యారు.
ముందే మొదలైన పంపిణీ
గత నాలుగు రోజుల నుంచి గ్రామాల్లో అన్ని పార్టీల శ్రేణులు చక్కర్లు కొడుతున్నారు. సమయం చిక్కినప్పుడల్లా డబ్బులు పంపిణఈ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో ఓటుకు 1500 నుంచి రెండు వేల వరకు ఇస్తున్నారు. వలస వెళ్లే వాళ్లను రప్పించేందుకు వారికి ఛార్జీల డబ్బులు, దారి ఖర్చులు కూడా ఇస్తున్నారు. మరికొందరు లీడర్లు ప్రత్యేక వాహనాలు పెడుతున్నారు.
ఎవరెటు వేస్తారో?
గత ఎన్నికలతో పోల్చుకుంటే ప్రజల నాడి ఏంటో అన్నది పూర్తిగా తెలియడం లేదు. అందుకే పార్టీల్లో టెన్షన్ ఎక్కువ అవుతోంది. ఆఖరి నిమిషం వరకు ఖర్చుకు వెనకాడకూడదని భావిస్తున్నారు. పథకాలు మెచ్చిన వాళ్లు, డబ్బులు తీసుకున్న వారిలో ఎంతమంది ఓటు వేస్తారో తెలియని పరిస్థితుల్లో అన్ని పార్టీల అభ్యర్థులు పదే పదే బీపీ చెక్ చేయించుకున్నారు.
అర్థరాత్రి గాల్లోకి నోట్లు
హిందూపురంలో రాత్రి ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. నోట్లు పంచేందుకు వచ్చిన ఓ పార్టీ నాయకులు పోలీసులకు చిక్కారు. 2 కోట్లు తరలిస్తున్న టైంలో పోలీసులు రావడంతో వాటిని పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి విసిరేసి పారిపోయారు.
అంతా గప్‌చుప్
సత్యసాయి జిల్లా హిందూపురంలో గురవారం రాత్రి అలజడి రేగింది. వేకువ జామున కొందరు వ్యక్తులు వచ్చి డబ్బులు పంపిణీకి యత్నించారు. ఇంతలో పోలీస్ సైరన్ మోగడంతో వారు తెచ్చిన డబ్బును అక్కడే విడిచి పెట్టి పారిపోయారు. రెండు మూడు గంటల తర్వాత వచ్చి చూస్తే అక్కడ డబ్బు కొంత లేనట్టు గుర్తించారు. రెండు కోట్లు తీసుకొస్తే అందులో 40 లక్షలు పోయినట్టు తేల్చారు. దీంతో చుట్టుపక్కల వారిని అడిగారు. డబ్బుల సంగతి తమకు తెలియదని స్థానికులు చెప్పడంతో దొరికిన డబ్బుతోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
సరకుల పంపిణీ
రాష్ట్రంలో ఆసక్తికలిగిన నియోజకవర్గాల్లో ఒకటైన ఒంగోలులో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. పది రూపాయలకే రెండు క్వార్టర్ బాటిళ్లు, యాభై రూపాయలకే బియ్యం బస్తా ఇస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నియోజకవరంలో హేమాహేమీలు పోటీ పడుతుండటంతో ఇక్కడ ఓటు ఖరీదు 3వేలు దాటిపోయిందని టాక్ నడుస్తోంది. అంతే కాకుండా మగవారికి తాగేవాళ్లకు మద్యం తాగని వాళ్లకు ఇంటి సరకులు ఇస్తున్నారట. గురువారం రాత్రి మంత్రి మేరుగ నాగార్జున కుమారుడి కారులో నగదును పోలీసులు సీజ్ చేశారు. ఒంగోలు చెక్ పోస్టులో తనిఖీలు చేయగా మంత్రి కుమారుడి కారు, ఉన్న రెండు లక్షలను స్వాదీనం చేసుకున్నారు.
ఐటీ తనిఖీల కలకలం
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ముగ్గురు వస్త్రవ్యాపారుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. ఇది స్థానికంగా కలకలం రేగింది. ఈ తనిఖీల్లో 25 కట్లకు సంబంధించిన నగదు, అండర్ గ్రౌండ్‌లో దాచిన లాకర్, వెండి, బంగారు వస్తువులు, చెక్కులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఎన్నికలకు సంబంధం లేదని ఇది కేవంలో తోటి వ్యాపారులు ఫిర్యాదు చేయడంతోనే తనిఖీలు చేసినట్టు తేలింది.
టీడీపీపై ఫిర్యాదు
ఉయ్ అనే ప్రత్యేక యాప్‌ను రూపొందించి టీడీపీ డబ్బులు పంచుతోందని ఆరోపిస్తోంది వైసీపీ. ఓటర్ స్లిప్‌లతోపాటు ప్రత్యేక బార్ కోడ్ ఉన్న పేపర్లు ఇస్తున్నారని దీని ద్వారా డబ్బులు బదిలీ చేసుకునే వీలు కలుగుతోందని ఆరోపిస్తోంది. దీని వల్ల వ్యక్తిగత సమాచారాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారి విమర్శిస్తోంది. ముందు ఓ టీం వెళ్లి స్లిప్‌ల పేరుతో క్యూఆర్ కోడ్ ఉన్న పేపర్లు ఇస్తారని... తర్వాత మరో జట్టు వెళ్లి వాటిని స్కాన్ చేస్తారని వారి వివరాలు తీసుకొని డబ్బులు వేస్తారని అంటున్నారు. దీనిపై వైసీపీ లీడర్లు ఎన్నికల సంఘానికి, రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ నుంచి వచ్చిన పేపర్లు, బార్‌కోడ్‌లు చూపించారు. ఇలా ఎవరికి వారు పోటాపోటీగా డబ్బులు పంచుతూనే మరోవైపు ప్రత్యర్థులపై బురదజల్లుతున్నారు.