Telangana Congress CM Candidate LIVE: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి - ఏఐసీసీ అధికారిక ప్రకటన
Telangana New CM: తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డిని ఏఐసీసీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.

Background
Telangana Congress CM Candidate Announcement Live Updates: తెలంగాణ సీఎం అభ్యర్థి కోసం ఢిల్లీలో కసరత్తు కొనసాగుతోంది. ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క అధిష్ఠానం పెద్దలతో చర్చలు కొనసాగిస్తున్నారు. గంటల తరబడి ఈ అంశంపై చర్చిస్తున్నారు. ఎలాగైనా సాయంత్రానికి సీఎం అభ్యర్థి ఎవరనేది క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తోంది. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తోపాటు ఏఐసీసీ పరిశీలకులు ఖర్గేతో సమావేశమై చర్చించిన తర్వాత... సోనియా అనుమతితో తెలంగాణ సీఎం అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. డీకే శివకుమార్‌తో చర్చిస్తున్న ఉత్తమ్ కుమార్ భట్టి విక్రమార్క మధ్యాహ్నం తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge)తో సమావేశం కానున్నారు. చర్చలు పూర్తైన తర్వాత సీల్డ్ కవర్‌తో డీకే శివకుమార్ (DK Sivakumar), మాణిక్‌రావు థాక్రే (Manik Rao Thackeray) హైదరాబాద్ చేరుకుంటారని తెలుస్తోంది. ఈ తర్వాత సీఎం అభ్యర్థి ఎవరనేది తేలిపోనుంది.
నిన్న ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో సీఎల్పీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేల మనోగతం, పార్టీ సీనియర్ నేతల అభ్యంతరాలను తెలుసుకున్నారు ఏఐసీసీ పరిశీలకులు. ఏఐసీసీ పరిశీలకుల బృందంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సీఎల్పీ సమావేశాని ముందు... పార్క్ హయత్ హోటల్లో డీకే శివకుమార్‌తో భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ఆ తర్వాత వీరంతా కలిసి సీఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. సీఎం అభ్యర్థి ఎంపికను అధిష్టానానికి అప్పగిస్తూ సీఎల్పీ సమావేశంలో ఏకవాక్య తీర్మానం చేశారు ఎమ్మెల్యేలు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకున్నారు ఏఐసీసీ పరిశీలకులు. ఆ తర్వాత ఒక నివేదికతో ఢిల్లీ వెళ్లారు. రాత్రి ఢిల్లీ చేరుకున్న ఏఐసీసీ పరిశీలకులు... తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను అధిష్టానానికి అందిచనున్నారు. ఇక... నిన్న రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నేత కేసీ వేణగోపాల్‌తో సోనియా గాంధీ (Sonia Gandhi) సమావేశమయ్యారు. తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై చర్చించినట్టు సమాచారం.
ఏఐసీసీ పరిశీలకులు తెలంగాణ ఎమ్మెల్యేల అభిప్రాయాలు అధిష్టానికి సమర్పించనున్నారు. దీనిపై చర్చించన తర్వాత తెలంగాణ సీఎం అభ్యర్థి ఎవరన్నది అధిష్టానం ఖరారు చేయనుంది. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్ రానున్నారు ఏఐసీసీ పరిశీలకులు. హైదరాబాద్ చేరుకుని సీనియర్లతో మంతనాలు, బుజ్జగింపులు చేసే అవకాశం కనిపిస్తోంది. అందరితో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రిపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది సాయంత్రంలోగా క్లారిటీ రానుంది.
మొదటి నుంచి రేవంత్‌రెడ్డే సీఎం అని ప్రచారం జరిగింది. నిన్న రాత్రి 8గంటలకు రాజ్‌భవన్ (Raj Bhavan)లో ప్రమాణస్వీకారానికి కూడా ఏర్పాట్లు జరిగాయి. కొత్త కాన్వాయ్‌ని కూడా సిద్ధం చేశారు. అయితే... ముఖ్యమంత్రి పదవి కోసం రేవంత్‌రెడ్డితోపాటు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ పడుతుండటంతో... అధిష్టానం సీఎం క్యాండిడేట్‌పై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో నిన్న జరగాల్సిన ప్రమాణస్వీకారం వాయిదా పడింది. అధిష్టానం సీఎం అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత... ఈనెల 6 లేదా 7వ తేదీన ప్రమాణస్వీకారం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి - ఏఐసీసీ అధికారిక ప్రకటన
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డిని ఖరారు చేస్తూ ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ నెల 7న ఆయన సీఎంగా ప్రమాణం చేస్తారని తెలిపారు.
2 రోజుల నుంచి హోటల్ లోనే రేవంత్.. అక్కడి నుంచే నేతలతో మంతనాలు
కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లినా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హోటల్ పల్లా నుంచి బయటకు రాలేదు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. ఖర్గే నేతృత్వంలో కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, డీకే శివకుమార్ తదితర అగ్రనేతలు ఢిల్లీలో సమావేశమై సీఎం ఎంపికపై చర్చించారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం రెండు రోజులనుంచి హోటల్లోనే ఉండి పార్టీ నేతలతో మంతనాలు జరుగుతున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై డిస్కస్ చేశారని సమాచారం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలు అమలుపై సమావేశం జరిగింది.





















