(Source: ECI/ABP News/ABP Majha)
Manipur Exit Poll Live: మణిపుర్‌లో భాజపాకే ఛాన్స్, ఏబీపీ సీ-ఓటర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలివే
Manipur Exit Poll Live: మణిపుర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది? భాజపా మళ్లీ అధికారంలోకి వస్తుందా? ఏబీపీ- సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఏం తేలింది?
Manipur Exit Poll Live: మణిపుర్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఫిబ్రవరి 28, మార్చి 5న రెండు దశల్లో అక్కడ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మణిపుర్‌లో విజయం సాధించేది ఎవరు? మణిపుర్ మణిపూసగా నిలిచేదెవరు అనే అంశంపై ఏబీపీ సీ ఓటర్ తో కలిసి ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించింది.
ఎగ్జిట్ పోల్ ఫలితాల కంటే ముందు అక్కడ ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ఏబీపీ సీఓటర్ సంయుక్తంగా సర్వే చేసింది. ఏ పార్టీకి ప్రజలు పట్టకట్టాలనే ఆలోచనలో ఉన్నారో అభిప్రాయసేకరణ చేపట్టింది. ఆ వివరాలును ఇంకోసారి పరిశీలిద్దాం.
ఒపీనియన్ పోల్స్
ఏబీపీ సీ-ఓటర్ ఒపినీయన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఈసారి 17 నుంచి 21 స్థానాలు గెలుచుకుంటుందని సర్వేలో తేలింది. అధికారంలో ఉన్న భాజపాకి ఈసారి 21 నుంచి 25 స్థానాలు వచ్చే అవకాశం ఉందని అప్పటి ఒపినీయన్ పోల్ చెప్పింది.
ఇటీవలి కాలంలో బాగా బలపడిన నాగా పీపుల్స్ ఫ్రంట్ కి ఈ ఎన్నికల్లో 6 నుంచి 10 అసెంబ్లీ స్థానాలు దక్కే అవకాశం ఉందని కూడా ఏబీపీ సీ-ఓటర్ ఒపినీయర్ పోల్ సర్వేలో స్పష్టమైంది. ఇతరులకు అంటే స్వతంత్రులకు 8 నుంచి 12 అసెంబ్లీ స్థానాలు దక్కే అవకాశం ఉందని అక్కడి ఓటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సో ఇది మణిపుర్ లో ఏబీపీ సీఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్.
చివరిసారి ఇక్కడ అసెంబ్లీకి 2017లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు చాలా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 60 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది. ఆ పార్టీకి 28 సీట్లు వచ్చాయి. భారతీయ జనతాపార్టీకి 21 సీట్లు గెలుచుకుంది. ఇంక అక్కడ చిన్నపార్టీలైన నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీలు చెరో నాలుగు స్థానాలను గెలుచుకున్నాయి. ఇంక లోక్ జన్ శక్తి పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ చెరో సీట్ గెలుచుకుంటే....ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు.
అయితే ఇక్కడే భాజపా తన రాజకీయ చతురతను వినియోగించుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా చిన్నపార్టీలను చేరదీసుకుని కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు చూపిస్తూ అధికారంలోకి వచ్చింది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
అయితే ఇప్పుడు ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూద్దాం. ఇన్న రోజుల పార్టీల ప్రచారం తర్వాత ఓటు వేసిన తర్వాత ఓటర్ బయటకు వెళ్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ 12 నుంచి 16 స్థానాలు గెలుచుకోవచ్చని తేలింది. భాజపాకి 23 నుంచి 27 స్థానాలు ప్రజలు కట్టబెట్టి ఎక్కువ సీట్లు సాధించే పార్టీగా ప్రజలు నిలబెట్టే ఛాన్స్ ఎక్కువ ఉంది. నేషనల్ పీపుల్స్ పార్టీ 10 నుంచి 14 స్థానాలు, ఎన్ పీఎఫ్ 3 నుంచి 7 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇతరులు 2-6 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది.
ఓట్ షేరింగ్ చూస్తే భాజపా 37.8 శాతంతో టాప్ ప్లేస్‌లో ఉంది. తర్వాత స్థానం కాంగ్రెస్‌ది. ఆ పార్టీ 28.7శాతం అవకాశం ఉంది. నేషనల్ పీపుల్స్ పార్టీ 11.2 శాతం, ఎన్ పీఎఫ్ 9.2 శాతం, ఇతరులు 13.1 ఓట్ షేరింగ్ రావచ్చు.
మణిపుర్ లో ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తుంటే భాజపా కి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అప్పుడు దొంగదారిలో అధికారం సంపాదించందన్న విమర్శలకు చెక్ చెబుతూ ఈసారీ దర్జాగా అధికార పీఠాన్ని భాజపా కైవసం చేసుకునే ఛాన్స్ బాగా ఉంది.
Also Read: Uttarakhand Exit Poll Live: దేవభూమిలో ఢీ అంటే ఢీ- భాజపా, కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీ!
Also Read: Punjab Exit Poll Live: పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఆమ్ఆద్మీ షాక్- మేజిక్ ఫిగర్ సామాన్యుడిదే!