Punjab Exit Poll Live: పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఆమ్ఆద్మీ షాక్- మేజిక్ ఫిగర్ సామాన్యుడిదే!
Punjab Exit Poll Live: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది? కాంగ్రెస్‌కు షాకిచ్చి పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ కూర్చీ ఎక్కెస్తుందా? ABP-C voter ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే.
Punjab Exit Poll Live: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ABP-C voter సంయుక్తంగా చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐదు రాష్ట్రాల్లో కీలకమైన పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ తప్పదా? ఆమ్‌ఆద్మీ పార్టీ మరో రాష్ట్రంలో పాగా వేయనుందా? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏం చెప్పాయంటే..
ఊడ్చేస్తోన్న ఆప్
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ హవా కనిపించబోతోందని ABP-C voter సర్వేలో తేలింది. పంజాబ్‌లో 20వ తేదీన సింగిల్ ఫేజ్‌లో పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా ABP-C voter నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి మొగ్గు కనిపించింది.
మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో తాజా అంచనాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ 51 నుంచి 61 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 22 నుంచి 28 సీట్లకే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అకాలీదళ్
మరో బలమైన పార్టీ శిరోమణి అకాలీదళ్ పార్టీ 20 నుంచి 26 స్థానాలు గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీని పెట్టుకున్న కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఈ సారి అక్కడ సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం లేదు.
ఈ కూటమికి 7-13 స్థానాల మధ్యలో సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇండిపెండెంట్లు ఒకటి నుంచి 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది.
ప్రాంతాల వారీగా
పంజాబ్‌లో మొత్తం మాంజా, దవోబా, మాల్వా అనే మూడు రీజియన్లు ఉన్నాయి. వీటిలో మాల్వా అతి పెద్దది. మాల్వా ప్రాంతంలో 69 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 12 జిల్లాలు ఉన్న ఈ ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం కనిపిస్తోంది. 69 స్థానాల్లో ఆ పార్టీకి 43 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉంది.
ఇక మాంజా ప్రాంతంలో 25 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్, అకాలీదళ్ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. దవోబా ప్రాంతంలో మూడు పార్టీల మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోరు సాగుతోంది.
ఓటు శాతం
ఓవరాల్‌గా ఓట్ షేర్ ప్రకారం చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి 39.1 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఏబీపీ న్యూస్ - సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో తేలింది. కాంగ్రెస్ పార్టీ 26.7 శాతం ఓట్ల దగ్గరే ఆగిపోనుంది. అకాలీదళ్‌కు 20 శాతం.. బీజేపీ కూటమికి 9.6 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Uttarakhand Exit Poll Live: దేవభూమిలో ఢీ అంటే ఢీ- భాజపా, కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీ!