Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో షాకింగ్ సీన్, అర్ధనగ్నంగా వెళ్లి నామినేషన్ వేసిన అభ్యర్థి
Telangana Elections: తెలంగాణ ఎన్నికల నామినేషన్లలో షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అర్థనగ్నంగా వెళ్లి నామినేషన్ వేశారు.
Telangana Elections: తెలంగాణలో ఎన్నికల సమరం తారాస్థాయికి చేరుకుంది. పార్టీలన్నీ విమర్శలు, ప్రతి విమర్శలతో ఎన్నికల ప్రచారంలో మాటల దాడి చేసుకుంటున్నాయి. దీంతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలన్నీ సోషల్ మీడియాతో పాటు గ్రౌండ్‌లోనూ ప్రచార జోరును పెంచాయి. నవంబర్ 3 నుంచి ఎన్నికల నామినేషన్లు మొదలు కావడంతో పార్టీలన్నీ మరింత స్పీడ్ పెంచాయి. పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ఇప్పటికే సీటు ఖరారు అయిన నేతలు మంచి ముహూర్తం చేసుకుని నామినేషన్ వేస్తోన్నారు.
ఈ క్రమంలో ఒక అభ్యర్థి వినూత్నంగా నామినేషన్ దాఖలు చేశారు. అర్థనగ్నంగా రిక్షాపై వచ్చి తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. పూస శ్రీనివాస్ అనే వ్యక్తి శివసేన పార్టీ సపోర్ట్‌తో భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీలోకి దిగుతున్నాడు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా షర్ట్ లేకుండా అర్ధనగ్నంగా రిక్షాపై రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు వేశారు. ఇది చూసి అధికారులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ అభ్యర్థికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. తన వినూత్న నిరసనతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన పాపులర్ అయ్యారు. ఇలా అర్ధనగ్నంగా నామినేషన్ వేయడం ద్వారా ఆయనపై అందరి దృష్టి పడింది.
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పూస శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. బడుగు, బలహీనవర్గాలకు అన్యాయం చేసిన పార్టీలను ఓడిస్తానని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వాలకు తెలియజేసేందుకు ఇలా వినూత్నంగా నిరసన తెలిపినట్లు చెప్పారు. పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ఇలా చేసినట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై తాను చేపట్టే నిరసనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే అర్ధనగ్న ప్రదర్శన చేపట్టినట్లు చెప్పారు. అయితే పూస శ్రీనివాస్ భువనగిరి నియోజకవర్గంలో ప్రజల సమస్యలపై గత కొన్నేళ్లుగా ప్రశ్నిస్తోన్నారు. ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడుతూ ప్రజలకు దగ్గర అవుతున్నాడు. ప్రతీ ఎన్నికల్లోనూ భువనగిరి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. గత నాలుగు ఎన్నికల్లో ఇక్కడ నుంచే నామినేషన్ వేయగా.. ఇప్పుడు ఐదోసారి నామినేషన్ వేశారు. ఎన్నికల్లో ఓడినా సరే.. ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతీ ఎన్నికల్లోనూ నామినేషన్ వేస్తున్నారు. గతంలో కూడా నామినేషన్ వేసే సమయంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. ఇప్పుడు కూడా పట్టు వీడని విక్రమార్కుడిలా అదే ఫాలో అవుతున్నారు శ్రీనివాస్.
కాగా తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అభ్యర్థులందరూ నామినేషన్లు వేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఈ నెల 9న కామారెడ్డి, గజ్వేల్ నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక రేవంత్ రెడ్డి కూడా త్వరలోనే కొడగంల్ నుంచి నామినేషన్ వేయనున్నారు. అయితే కామారెడ్డిలో కేసీఆర్‌పై కూడా రేవంత్ రెడ్డి పోటీ చేస్తారనే వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్ మూడో జాబితా సోమవారం విడుదలయ్యే అవకాశముంది. ఇందులో కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పేరు ఉంటుందనే ప్రచారం సాగుతోంది.