Telangana Elections: ఆ స్కూళ్లకు 'ఎన్నికల' సెలవులు, మరో రోజు పొడిగించాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు
Telangana School Holidays: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో.. పోలింగ్ తేదీ(నవంబర్ 30)తోపాటు, ముందురోజు (నవంబరు 29) కూడా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇవ్వనున్నారు.
Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో.. పోలింగ్ తేదీ(నవంబర్ 30)తోపాటు, ముందురోజు (నవంబరు 29) కూడా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు చెందిన మొత్తం 1.06 లక్షల మంది ఉపాధ్యాయుల్లో.. 80 శాతం మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. అయితే పోలింగ్ కేంద్రాలుగా ఉండే ప్రభుత్వ పాఠశాలలకు సిబ్బంది ఒకరోజు ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 29న ఉదయం 7 గంటలలోపే ఈవీఎంలను తీసుకునేందుకు ఉపాధ్యాయులు నిర్ణీత కేంద్రంలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల నవంబర్ 29, 30 తేదీల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇవ్వాల్సిందే. పోలింగ్ జరిగే ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇచ్చే విషయాన్ని ఎన్నికల కమిషన్ సూచన మేరకు అధికారంగా ప్రకటించనున్నారు.
డిసెంబరు 1న కూడా సెలవు ఇవ్వాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు..
నవంబరు 29 నుంచి ఎన్నికల విధుల్లో ఉండే ఉపాధ్యాయులు.. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను తీసుకొని ఆయా కేంద్రాలకు వెళ్లి సమర్పించి వచ్చే సరికి అర్ధరాత్రి దాటుతుందని, అందువల్ల విధుల్లో పాల్గొన్న వారికి డిసెంబరు 1న కూడా సెలవు ఇవ్వాలని రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్‌టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు ఎన్నికల సంఘాన్ని కోరారు.
ఎన్నికల వేళ మరింత కఠినంగా ఈసీ, వాటిపైనా ఫోకస్..
తెలంగాణలో ఎన్నికలు ఇంకొద్ది రోజులే ఉన్నందున ముఖ్యమైన తాయిలాల్లో ఒకటైన మద్యం పంపకాలపై ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది. తాజాగా ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ ప్రకారం తెలంగాణలోని 18 మద్యం డిస్టిలరీలపై నిఘా పెట్టినట్లుగా ఎక్సైజ్ శాఖ జాయింట్ కమిషనర్ సురేశ్ తెలిపారు. ఇందుకోసం మొత్తం 10 టీమ్ లను ఏర్పాటు చేసి.. ఒక్కో టీమ్ కి ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ను ఇన్‌ఛార్జిగా నియమించినట్లు సురేశ్ తెలిపారు. రాష్ట్రంలోని 18 డిస్టిలరీలను అధికారుల టీమ్స్ ఆకస్మికంగా తనిఖీ చేశాయని, లిక్కర్ ఉత్పత్తి, సప్లై, సంబంధింత రిజిస్టర్లను పరిశీలించినట్లు చెప్పారు. రికార్డులన్నీ సక్రమంగాగానే ఉన్నాయని, అధికారుల పరిశీలనలో తేలిందని సురేశ్ వెల్లడించారు. మద్యం డిస్టిలరీల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని ఎక్సైజ్ శాఖ హెడ్ ఆఫీస్ కు కనెక్ట్ చేసినట్లుగా ఆయన వెల్లడించారు. నిరంతరం సీసీటీవీ కెమెరాలను పరిశీలించడం సహా.. మద్యం అక్రమ రవాణా జరగకుండా నిఘా పెట్టినట్లుగా జాయింట్ కమిషనర్ సురేశ్ వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్ లో తుది ఓటర్ల జాబితా విడుదల..
తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తుది ఓటర్ల జాబితా (GHMC Voters List) విడుదలైంది. గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉండగా.. ఇక్కడ మొత్తం 45,36,852 మంది (43 లక్షల 36 వేల 8 వందల 52 మంది) ఓటర్లు ఉన్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. తాజా ఓటర్ల జాబితాలో 77,522 మంది (77 వేల 5 వందల 22 మంది) కొత్త ఓటర్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఎన్నికల అధికారులు వెల్లడించిన తుది జాబితా ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఓటర్లలో పురుష ఓటర్లు 23,22,623 మంది ఉండగా, మహిళా ఓటర్లు 22,13,902 మంది ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు 20,207 మంది, ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 883 మంది, సర్వీస్ ఓటర్లు 404, ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 327 మంది, 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 80,037 మంది ఉన్నారు.