TG Academic Calendar: తెలంగాణలో పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ విడుదల - దసరా, సంక్రాంతి సెలవుల వివరాలు ఇలా
Telangana Schools: తెలంగాణలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు పాఠశాలలు పని చేయనున్నాయి.
Telangana School Academic Calendar 2024-25: తెలంగాణలోని పాఠశాలలకు సంబంధించిన 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను ప్రభుత్వం మే 25న విడుదల చేసింది. దీని ప్రకారం కొత్త విద్యాసంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభంకానుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతులకు కొత్త అకడమిక్ క్యాలెండర్ వర్తించనుంది. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు కొనసాగనున్నాయి.
ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూళ్లు పని చేయనున్నాయి. స్కూళ్లు జూన్ 12న ప్రారంభమై.. ఏప్రిల్ 24న ముగియనున్నాయి. ఈ మేరకు పరీక్షల క్యాలెండర్‌కు సంబంధించి ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌కు, మోడల్ స్కూళ్ల డైరెక్టర్‌కు, ప్రభుత్వ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్‌కు, ఎస్‌ఐఈటీ డైరెక్టర్‌కు, గురుకుల విద్యాలయాల డైరెక్టర్‌కు, హైదరాబాద్, వరంగల్ రీజినల్ జాయింట్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అధికారులకు.. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీచేశారు.
ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. 2025 ఫిబ్రవరి 28 లోపు పదోతరగతి ప్రి-ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. 2025 మార్చిలో పదోతరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు, జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు.
2024-25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం...
➥ ఈ ఏడాది జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. 2025 ఏప్రిల్ 23తో విద్యాసంవత్సరం ముగియనుంది.
➥ ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి.
➥ 2025 ఏప్రిల్ 24 నుంచి 2025 జూన్ 11 వరకు 49 రోజులపాటు వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
➥ 2025 జనవరి 10న పదో తరగతి సిలబస్ పూర్తిచేసి, పబ్లిక్ పరీక్షలలోపు రివిజన్ క్లాసులు, ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తిచేయనున్నారు.
➥ ఇక 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సిలబస్‌ను 2025 ఫిబ్రవరి 28 లోపు పూర్తిచేసి, 2025 ఏప్రిల్‌లో నిర్వహించే ఎస్‌ఏ-2 పరీక్ష కోసం రివిజన్, రెమెడియల్ టీచింగ్, ప్రిపరేషన్ నిర్వహించనున్నారు.
➥ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రార్థన అనంతరం అన్ని తరగతుల్లో 5 నిమిషాలపాటు యోగా, ధ్యానం తరగతులు ఉండనున్నాయి.
➥ ఈ ఏడాది దసరా సెలవులు అక్టోబర్ 2 నుంచి 14 వరకు 13 రోజుల పాటు ఉండనున్నాయి. ఇక సంక్రాంతి సెలవులు 2025 జనవరి 13 నుంచి 17 వరకు మొత్తం 5 రోజులు ఉంటాయని వెల్లడించింది. ఇక డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు ఇవ్వనున్నారు.
పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ ఫార్మాటివ్ అసెస్‌మెంట్ (FA)-1 పరీక్షలను ఈ ఏడాది జులై 31 నాటికి నిర్వహించనున్నారు.
➥ ఫార్మాటివ్ అసెస్‌మెంట్ (FA)-2 పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి నిర్వహించనున్నారు.
➥ సమ్మేటివ్ అసెస్‌మెంట్ (SA)-1 పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 28 వరకు, ఫార్మాటివ్ అసెస్‌మెంట్ (FA)-3 పరీక్షలను ఏడాది డిసెంబర్ 12 లోపు, ఫార్మాటివ్ అసెస్‌మెంట్ (FA)-4 పరీక్షలను 2025 జనవరి 29 లోపు పూర్తిచేయనున్నారు.
➥ సమ్మేటివ్ అసెస్‌మెంట్ (SA)-2 పరీక్షలను 2024 ఏప్రిల్ 9 నుంచి 2024 ఏప్రిల్ 29 వరకు (1 నుంచి 9 తరగతులకు), ప్రీ ఫైనల్ (10వ తరగతి) పరీక్షలను 2024 ఫిబ్రవరి 28లోపు నిర్వహించనున్నారు.
➥ ఇక పదోతరగతి వార్షిక పరీక్షలను 2025 మార్చి నెలలో నిర్వహించనున్నట్లు పరీక్షల షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
2024 ఏడాదిలో తెలంగాణలో సాధారణ సెలవులు ఇలా..
➥ 2024కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సెలవుల లిస్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024 ఏడాదిలో సాధారణ సెలవులు 27 కాగా, ఆప్షనల్ హాలిడేస్ 25 ఉన్నాయి.
➥ జనవరి 15న సంక్రాంతి సెలవు, మార్చి 8న మహాశివరాత్రి, మార్చి 25న హోలీ, ఏప్రిల్ 9న ఉగాది, ఏప్రిల్ 17న శ్రీరామనవమి, జూన్ 17న బక్రీద్, సెప్టెంబర్ 7న వినాయక చవితి, అక్టోబర్ 10న దసరా, అక్టోబర్ 31న దీపావళికి సెలవులు ప్రకటించారు.