Polytechnic Couses: జులై 19 నుంచి 'పాలిసెట్ స్లైడింగ్' ప్రక్రియ, నచ్చిన బ్రాంచ్‌కు మారవచ్చు!
పాలిసెట్ రెండు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు వారి కళాశాలల్లో మరో బ్రాంచికి మారేందుకు జులై 19 నుంచి స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.
పాలిసెట్ రెండు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు వారి కళాశాలల్లో మరో బ్రాంచికి మారేందుకు జులై 19 నుంచి స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. కన్వీనర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతున్నందున బ్రాంచి మారినా ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా వర్తిస్తుందని ప్రవేశాల కమిటీ కన్వీనర్ వాకాటి కరుణ తెలిపారు. విద్యార్థులు జులై 19, 20 తేదీల్లో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. వీరికి జులై 23న సీట్లు కేటాయిస్తారు.
తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇక నుంచి ఒక బ్రాంచిలో చేరిన విద్యార్థులు మరో బ్రాంచికి మారే స్లైడింగ్ ప్రక్రియను ప్రవేశపెట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. పాలిసెట్ కన్వీనర్ ఆధ్వర్యంలోనే ఈ నూతన ప్రక్రియను నిర్వహించనున్నారు. ఇప్పటివరకు పాలిసెట్లో రెండు విడతల కౌన్సెలింగ్ నిర్వహించి, ఆ తర్వాత మిగిలిపోయిన సీట్లకు స్పాట్ కౌన్సెలింగ్ జరుపుతున్నారు. ఈసారి రెండు విడతల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత అప్పటికే కళాశాలల్లో వివిధ కోర్సుల్లో చేరిన వారికి స్లైడింగ్ నిర్వహిస్తారు. ఈ విధానం ద్వారా ఓ కళాశాలలో ఖాళీగా ఉన్న బ్రాంచీల్లో ఆ కళాశాలకే చెందిన మరో బ్రాంచి విద్యార్థులు చేరవచ్చు.
ఈ ప్రక్రియను కన్వీనర్ ఆధ్వర్యంలో జరపడం వల్ల విద్యార్థులు మరో బ్రాంచికి మారినా బోధనా రుసుములు(ఫీజు రీయింబర్స్‌మెంట్) పొందేందుకు అర్హులవుతారు. ఇప్పటివరకు స్లైడింగ్ లేకపోవడం, రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత స్పాట్ ప్రవేశాలు జరుపుతుండటం వల్ల పాలిసెట్లో కనీస అర్హత పొందని వారు కూడా డిమాండ్ ఉన్న సీట్లలో చేరుతున్నారు. మెరిట్‌తో ఇతర బ్రాంచీల్లో చేరిన వారికి అవి దక్కడం లేదు. ఈ విషయాన్ని పాలిసెట్ ప్రవేశాల అధికారులు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఇన్ఛార్జి కమిషనర్, పాలిసెట్ ప్రవేశాల కన్వీనర్ వాకాటి కరుణ దృష్టికి తీసుకెళ్లగా.. స్లైడింగ్‌కు ఆమె అంగీకారం తెలిపారు. స్లైడింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
స్పాట్ ప్రవేశాల బాధ్యత యాజమాన్యాలదే!
రాష్ట్రంలో ఇప్పటివరకు పాలిసెట్లో స్పాట్ ప్రవేశాలను కన్వీనర్ ఆధ్వర్యంలో జరుపుతుండగా, ఇక నుంచి వాటిని కళాశాలల యాజమాన్యాలకే అప్పగించనున్నారు. స్పాట్ను వారికి ఇచ్చినా పాలిటెక్నిక్ కోర్సులకు డొనేషన్లు ఇచ్చే పరిస్థితి లేనందున అక్రమాలకు ఆస్కారం ఉండదని అధికార వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో 56 ప్రభుత్వ, 60 ప్రైవేట్ కళాశాలలున్నాయి. మొత్తం 29,396 సీట్లున్నాయి. పాలిసెట్ తొలి విడత కౌన్సెలింగ్ ముగియగా, చివరి విడత సీట్లను గురు లేదా శుక్రవారాల్లో కేటాయించనున్నారు.
ALSO READ:
టీఎస్ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, జులై 29 నుంచి రిజిస్ట్రేషన్!
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన 'టీఎస్ ఈసెట్-2023' కౌన్సెలింగ్ షెడ్యూలును అధికారులు ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం జులై 29 నుంచి రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రారంభంకానుంది. ఆగస్టు 1 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన అభ్యర్థులకు జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఇక ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినవారు జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈసెట్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు జులై 13న విడుదలైంది. ఆగస్టు 14 నుంచి 18 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. ఆగస్టు 16 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 16 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 25న తొలి విడత సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి తుది విడత ఐసెట్ కౌన్సెలింగ్ ఉంటుంది. సెప్టెంబరు 1 నుంచి 3 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదు, 7న తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 8న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial