TS EAMCET Toppers: టీఎస్ ఎంసెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థుల హవా.. టాప్ 10 ర్యాంకర్ల వివరాలు
తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో మొదటి రెండు ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఇందులో టాప్ 10 ర్యాంకుల్లో ఆరుగురు ఏపీ విద్యార్థులే ఉన్నారు.
తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో మొదటి రెండు ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఇందులో టాప్ 10 ర్యాంకుల్లో ఏకంగా ఆరుగురు ఏపీకి చెందిన విద్యార్థులే ఉన్నారు. అగ్రికల్చర్ విభాగంలో చూసుకుంటే టాప్ 10లో నలుగురు ఏపీ విద్యార్థులు ఉన్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో టాప్ 3 ర్యాంకులలో ఐదుగురు అబ్బాయిలు ఉండగా.. ఒక అమ్మాయి ఉంది.
ఇంజనీరింగ్ టాప్ 10 ర్యాంకులు..
ఇంజనీరింగ్ విభాగంలో టాప్ 10 ర్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సత్తి కార్తికేయ అత్యధిక మార్కులతో టాప్ స్థానంలో నిలిచాడు. కడప జిల్లా రాజంపేటకు చెందిన దుగ్గినేని వెంకట పణీశ్ కు రెండో ర్యాంకు, హైదరాబాద్ టోలిచౌకీకి చెందిన మహ్మద్ అబ్దుల్ ముకీత్ అనే విద్యార్థికి మూడో ర్యాంకు దక్కించుకున్నారు. నల్లగొండ జిల్లా పోచంపల్లికి చెందిన రామస్వామి సంతోష్ రెడ్డికి నాలుగో ర్యాంకు వచ్చింది.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన జోష్యుల వెంకట ఆదిత్యకి ఐదో ర్యాంకు, ఏపీలోని చిత్తూరుకు చెందిన పోతంశెట్టి చేతన్ మనోజ్ఞకు ఆరో ర్యాంకు దక్కింది. ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన మిదటాన ప్రణయ్ ఏడో ర్యాంకు, నెల్లూరుకు చెందిన దేశాయ్ సాయి ప్రణయ్ 8వ ర్యాంకు, విజయనగరం జిల్లాకు చెందిన సవరం దివాకర్ సాయి 9వ ర్యాంకు దక్కించుకున్నారు. తెలంగాణలోని నల్లగొండకు చెందిన సోమిడి సాత్వికా రెడ్డికి పదో స్థానంలో నిలిచింది.
అగ్రికల్చర్ టాప్ 10 వీరే..
ఇక అగ్రికల్చర్ విభాగాన్ని పరిశీలిస్తే హైదరాబాద్ బాలానగర్‌కు చెందిన మండవ కార్తికేయ మొదటి ర్యాంకు దక్కించుకున్నాడు. పెద్దఅంబర్‌పేటకు చెందిన శ్రీనిజ రెండో ర్యాంకు, కూకట్‌పల్లికి చెందిన తేరుపల్లి సాయి కౌశల్‌రెడ్డి మూడో ర్యాంకు సాధించారు. ఏపీలోని అనంతపురానికి చెందిన రంగు శ్రీనివాస కార్తికేయ నాలుగో ర్యాంకు, రాజమహేంద్రవరానికి చెందిన చందం విష్ణు వివేక్ ఐదో ర్యాంకును కైవసం చేసుకున్నారు.
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన కోలా పవన్ రాజు 6వ ర్యాంకు, తెలంగాణలోని ఖమ్మంకు చెందిన కన్నెకంటి లాస్య చౌదరి 7వ ర్యాంకు సాధించారు. విజయవాడకు చెందిన పల్లి వెంకట కౌశిక్ రెడ్డి 8వ ర్యాంకు, తెలంగాణలోని లింగంపల్లికి చెందిన రవి అభిరామ్ 9వ ర్యాంకు, నల్గొండకు చెందిన రామకృష్ణ 10వ ర్యాంకు దక్కించుకున్నారు.
Also Read: TS EAMCET Results: టీఎస్ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ఇంజనీరింగ్‌లో 82.08 శాతం మంది క్వాలిఫై
Also Read: TS Eamcet counselling: మరో 5 రోజుల్లో టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్.. ముఖ్యమైన తేదీలివే..