TS Schools: సర్కారు బడిలో 'సారు' లేడు, 21 శాతం స్కూళ్లలో 'ఒకే' ఒక్కడు!
రాష్ట్రంలో సాధారణ ప్రభుత్వ పాఠశాలలు, ఇతర సంక్షేమశాఖల పరిధిలోని గురుకులాలు, కేంద్ర ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు కలిపి 30,723 ఉండగా వాటిలో 6,392 చోట్ల ఒక్కరే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఎంత చేస్తున్నా.. సర్కారు బడుల స్థితిగతులు మారడంలేదు. ఉపాధ్యాయుల కొరతతో అల్లాడుతున్నాయి. రాష్ట్రంలో 21 శాతం ప్రభుత్వ పాఠశాలలు ఏకోపాధ్యాయుడితో నడుస్తున్నాయంటేనే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయవచ్చు. వాటిలో 95 శాతం ప్రాథమిక పాఠశాలలే. రాష్ట్రంలో సాధారణ ప్రభుత్వ పాఠశాలలు, ఇతర సంక్షేమశాఖల పరిధిలోని గురుకులాలు, కేంద్ర ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు కలిపి 30,723 ఉండగా వాటిలో 6,392 చోట్ల ఒక్కరే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. అది 20.82 శాతంతో సమానం.
దేశవ్యాప్తంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. 2017లో సింగిల్ టీచర్ స్కూల్స్ సంఖ్య 92 వేలు ఉండగా, 2021-22 విద్యా సంవత్సరం నాటికి 1.17 లక్షలకు చేరాయి. అంటే నాలుగేళ్లలో దాదాపు 25 వేలు పెరిగాయన్నమాట.
జాతీయ సగటు కంటే రెట్టింపు
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు 11.04 లక్షలున్నాయి. వాటిలో 1,17,285 పాఠశాలల్లో ఏకోపాధ్యాయుడే చదువు చెప్పేది. అంటే అది 10.61 శాతంతో సమానం. రాష్ట్రంలో 20.82 శాతమంటే జాతీయ సగటుతో పోల్చుకుంటే దాదాపు రెట్టింపున్నట్లు స్పష్టమవుతోంది. అత్యధిక ఏకోపాధ్యాయ పాఠశాలలున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. 2017లో దేశంలో మొత్తం 92,275 సింగిల్ టీచర్ బడులుండగా.. అందులో తెలంగాణలో 4578 ఉన్నాయి.
నాలుగేళ్లలో దేశంలోనే కాదు... రాష్ట్రంలోనూ ఏకోపాధ్యాయ పాఠశాలలు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఒక్క ఉపాధ్యాయుడితో పనిచేసే బడులున్నాయి. అవి పాఠశాల విద్యాశాఖ పరిధిలోనివే కాదు...గిరిజన సంక్షేమశాఖ కింద పనిచేస్తున్నవీ ఉన్నాయి అని పాఠశాల విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా లేని బడులు 1200 వరకు ఉన్నాయి. వాటికీ ఒక ఉపాధ్యాయుడిని కేటాస్తున్నారు. తర్వాత ఇతర పాఠశాలలకు తాత్కాలిక డిప్యుటేషన్‌పై సర్దుబాటు చేస్తున్నారు. అందులో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. తాజా ఉపాధ్యాయ బదిలీల్లో సున్నా పాఠశాలలకు టీచర్లను ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇక అవి మూతబడినట్లే లెక్క.
తక్షణ మార్పు అవసరమే...
ప్రతి ఆవాస ప్రాంతంలో పాఠశాల ఉండాలన్న లక్ష్యంగా వాటిని ఏర్పాటుచేశారు. విద్యా హక్కు చట్టం 2009 ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు 20 మంది విద్యార్థుల వరకు ఉంటే ఒక ఉపాధ్యాయుడినే నియమిస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ స్కూళ్లు పల్లెలకు సైతం వాహనాలను సమకూర్చి తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. ప్రతి తరగతికీ టీచర్‌ను నియమిస్తున్నాయి. ఫలితంగా సర్కారు బడుల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. కరోనా కారణంగా సుమారు 2.80 లక్షల మంది గత ఏడాది ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడుల్లో చేరినా వారిలో మళ్లీ 1.80 లక్షల మంది తిరిగి వెళ్లారు. సకాలంలో పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు ఇవ్వకపోవడం, ఒక్కరే ఉపాధ్యాయుడు ఉండటం తదితర కారణాలే ఇందుకు నేపథ్యం.
ఒక్క ఉపాధ్యాయుడు 18 పీరియడ్లు..
విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా కనీసం ఇద్దరు టీచర్లను నియమించాలన్న డిమాండ్ ఉపాధ్యాయ వర్గాల నుంచి పెరుగుతోంది. లేనిపక్షంలో తొలిమెట్టు లాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా ప్రమాణాలు పెంచలేమని ఎస్‌జీటీ ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక ఉపాధ్యాయుడు అయిదు తరగతులకు రోజుకు 18 పీరియడ్లు ఎలా బోధిస్తారని ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read:
తెలంగాణలో 10 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేది అప్పుడే?
తెలంగాణలో త్వరలో మరో భారీ ఉద్యోగ ప్రకటన వెలువడనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుల స్వీకరణ, సీనియారిటీ లిస్టు తదితర ప్రక్రియ నడుస్తోంది. 317 జీవో ద్వారా బదిలీ అయిన టీచర్లకు కూడా సాధారణ బదిలీల్లో అవకాశమివ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు ఇవ్వడంతో వారి నుంచి కూడా ఫిబ్రవరి 14 వరకు దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు. ఈ మొత్తం బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మార్చి వరకు కొనసాగనుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలోని కేంద్రీయ మైనార్టీ పాఠశాలల్లో 1308 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే?
కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలోని సీబీఎస్‌ఈ మైనార్టీ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి 'మహర్షి వేదవ్యాస్ ఔట్‌సోర్సింగ్ టీచర్స్ రిక్రూట్‌మెంట్' నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా తెలంగాణలోని 109 పాఠశాలల్లో 1308 టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..