SSC Exams: ‘టెన్త్’ సైన్స్ పరీక్ష రెండు రోజులు, ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన
SSC Exams: తెలంగాణలో మార్చి నెలలో జరగనున్న పదోతరగతి పరీక్షల్లో ఈసారి సైన్స్ సబ్జెక్టు పరీక్ష రెండు రోజులపాటు నిర్వహించే అవకాశం ఉంది. త్వరలో ప్రభుత్వం నుంచి దీనికి ఆమోదం లభించవచ్చు.
SSC Exams: తెలంగాణలో మార్చి నెలలో జరగనున్న పదోతరగతి పరీక్షల్లో ఈసారి సైన్స్ సబ్జెక్టు పరీక్ష రెండు రోజులపాటు నిర్వహించే అవకాశం ఉంది. సైన్స్‌లో ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ రెండు పేపర్లు ఉండటంవల్ల పరీక్ష రెండు రోజులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించారు. త్వరలో ప్రభుత్వం నుంచి దీనికి ఆమోదం లభించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
పదోతరగతిలో ఆరు సబ్జెక్టులు ఉండగా... అందులో అయిదు సబ్జెక్టులకు ఒక్కో పేపర్ (ప్రశ్నపత్రం) ఉంటుంది. సైన్స్‌లో రెండు పేపర్లు ఉన్నా ఒకే రోజు 15 నిమిషాల వ్యవధి ఇచ్చి ఒకదాని తర్వాత మరొకటి నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని ఉపాధ్యాయులు గతంలో సర్కారుకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఒక రోజు అదనంగా పరీక్ష ఉంటే ఆరోజు విధుల్లో పాల్గొన్న సిబ్బందికి భత్యాలు చెల్లించాల్సి వస్తుందని.. విద్యాశాఖ భావించినట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ విధానంపై పునరాలోచన చేసిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంది.
పరీక్ష ఫీజు గడువు జనవరి 3 వరకు..
పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబరు 21తో ముగిసింది. ఇక రూ.500 ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించడానికి జనవరి 3 వరకు అవకాశం కల్పించారు.
ఫీజు చెల్లింపు వివరాలు..
➥ 6 సబ్జెక్టులకు రాయాలనుకునే రెగ్యులర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.125
➥ 3 సబ్జెక్టుల వరకు రాయాలనుకునే విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.110
➥ 3 సబ్జెక్టులకు మించి పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.125.
➥ ఒకేషనల్ విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.60.
వీరికి ఫీజు నుంచి మినహాయింపు..
* కుంటంబ వార్షిక ఆదాయం ఏడాదికి పట్టణాల్లో రూ.24 వేలకు మించకూడదు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.20 వేలకు మించకూడదు (లేదా) 2.5 ఎకరాల సాగు భూమి, 5 ఎకరాల బంజరు భూమి ఉన్నవారికి ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
తెలంగాణలో పదోతరగతి వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వొకేషనల్ ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు కూడా అదే నెలలో ఉంటాయని తెలిపారు. గతేడాది నుంచి 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకే 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పరీక్షల పూర్తి షెడ్యూల్ ను త్వరలోనే రిలీజ్ చేస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కాగా పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నామినల్ రోల్స్‌ను ఇక మీద నుంచి ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుందని విద్యాశాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో పాఠశాల విద్యార్థుల సమగ్ర సమాచారాన్ని పొందుపరిచే 'యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్(యూడైస్)'లో పేరు ఉంటేనే పదోతరగతి పరీక్షలకు అనుమతించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అక్టోబరు 16న కీలక నిర్ణయం తీసుకుంది. పది పరీక్షలకు ఫీజు చెల్లించిన తర్వాత ఆయా పాఠశాలలు ప్రభుత్వ పరీక్షల విభాగానికి విద్యార్థుల పేర్లు, ఇతర సమగ్ర వివరాలతో కూడిన నామినల్‌రోల్స్‌ను పంపిస్తాయి. అనుమతి లేని పాఠశాలల్లో చదివే పిల్లలను మరో బడి నుంచి పరీక్షలు రాయిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకే ఇప్పటి నుంచి యూడైస్‌లో పేరు ఉంటేనే పదోతరగతి పరీక్షలకు అనుమతి ఇస్తారు.