SSC Supplementary Exams: 'టెన్త్' సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం, హాజరుకానున్న 51,237 మంది విద్యార్థులు
TS SSC Exams: పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 51,237 మంది హాజరుకానున్నారు. ఇందులో 31,625 మంది బాలురు ఉండగా.. 19,612 మంది బాలికలు ఉన్నారన్నారు. జూన్ 3 నుంచి 13 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
Telangana SSC Supplementary Exams: తెలంగాణలో జూన్ 3 నుంచి ప్రారంభంకానున్న పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు మే 27న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 51,237 మంది హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో 31,625 మంది బాలురు ఉండగా.. 19,612 మంది బాలికలు ఉన్నారన్నారు. పరీక్షల కోసం రాష్ట్రావ్యాప్తంగా 170 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే ఆయా పాఠశాలలకు పంపామని, వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కృష్ణారావు తెలిపారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 3 నుంచి 13 వరకు పదోతరగతి అడ్వాన్స్‌డ్ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. సైన్స్ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, ప్రథమ భాషలో కాంపోజిట్ కోర్సుల పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.50 గంటల వరకు నిర్వహిస్తారు. ఇక మిగిలిన అన్ని పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించనున్నారు.
పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
పరీక్షల ప్రారంభానికి రెండు రోజుల ముందు వరకు రూ.50 ఆలస్య రుసుం చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చు. సప్లిమెంటరీ పరీక్షకు సంబంధించి ఒకటి నుంచి మూడు సబ్జెక్టుల వరకు దరఖాస్తు చేసుకునేవారు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 ఫీజుగా చెల్లించాలి.
పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ జూన్ 3న: తెలుగు, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు-1, కాంపోజిట్ కోర్సు-2 పరీక్షలు
➥ జూన్ 5న: సెకండ్ లాంగ్వేజ్
➥ జూన్ 6న: ఇంగ్లిష్
➥ జూన్ 7న: మ్యాథమెటిక్స్
➥ జూన్ 8న: భౌతికశాస్త్రం (ఫిజికల్ సైన్స్)
➥ జూన్ 10న: జీవశాస్త్రం (బయాలజీ)
➥ జూన్ 11న: సాంఘికశాస్త్రం (సోషల్ స్టడీస్)
➥ జూన్ 12న: ఓఎస్‌ఎస్‌సీ (ఓరియంటెల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్) ప్రధాన భాష (సంస్కృతం, అరబిక్) పేపర్-1,
➥ జూన్ 13న: ఓఎస్‌ఎస్‌సీ ప్రధాన భాష (సంస్కృతం, అరబిక్) పేపర్-2 పరీక్షలు జరుగుతాయి.
ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలకు మొత్తం 5,05,813 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష రాసినవారిలో 4,91,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో మొత్తం 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణులు కాగా, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో 99.09 శాతంతో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 98.65 శాతం ఉత్తీర్ణతతో సిద్ధిపేట జిల్లా రెండోస్థానంలో, 98.27 శాతం ఉత్తీర్ణతతో సిరిసిల్ల జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఇక 65.10 ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
ALSO READ:
తెలంగాణలో పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
తెలంగాణలోని పాఠశాలలకు సంబంధించిన 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను ప్రభుత్వం మే 25న విడుదల చేసింది. దీని ప్రకారం కొత్త విద్యాసంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభంకానుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతులకు కొత్త అకడమిక్ క్యాలెండర్ వర్తించనుంది. ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూళ్లు పని చేయనున్నాయి. స్కూళ్లు జూన్ 12న ప్రారంభమై.. ఏప్రిల్ 24న ముగియనున్నాయి.
అకడమిక్ క్యాలెండర్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..