School timings in Telangana: తెలంగాణలో మారిన స్కూల్ టైమింగ్స్ - కొత్త వేళలు ఇవే!
Telangana News: పాఠశాలల సమయ వేళల్లో మార్పులు చేస్తూ తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి మారిన వేళలు అమలులోకి రానున్నాయి.
Telangana School Timings: వేసవి సెలవులు ముగుస్తున్నాయి. మరో వారం పది రోజుల్లో స్కూల్స్ తెర్చుకోనున్నాయి. కొద్దిరోజుల్లో బడి గంట మోగనున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ స్కూల్ పని వేళల్లో మార్పులు చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత స్కూల్స్ పని వేళలను మారుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఉదయం 9 గంటలకే స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం నుంచి తాజాగా పని వేళలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి గతంలో కూడా తొమ్మిది గంటలకే స్కూల్స్ ప్రారంభమయ్యేవి.
కానీ, అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న కూర రఘోత్తం రెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం స్కూల్స్ పని వేళలను ఉదయం 9.30 గంటలకు మార్చారు. దీనికి ఆయన ఒక కారణాన్ని అప్పట్లో ప్రభుత్వానికి చెప్పారు. ఒక ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే.. ఒకరిని 9 గంటలకు, మరొకరిని 9.30 గంటలకు బడికి తీసుకెళ్లాల్సి వస్తుండడంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి పని వేళల్లో మార్పులు చేయాలని ఎమ్మెల్సీ కోరగా.. దానిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విద్యాశాఖ అధికారులు భావించి నిర్ణయం తీసుకుంటున్నారు.
ఉదయం 9 గంటలకే బడులు..
విద్యాశాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటలకే మొదలు కానున్నాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంలలకు మొదలు కానున్నట్టు అధికారులు చెబుతున్నారు. సాయంత్రం 4.5 గటల వరకు స్కూల్స్ నడవనున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మాత్రమే ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలలు టైమింగ్ ఉంటాయి. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు నిర్వహించే ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలను ఉదయం 9 గంటలు నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు నిర్వహించనున్నారు. ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో మాత్రం ఉదయం 9 గంంటలు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు.
హైదరాబాద్ జంట నగరాల్లో ఈ స్కూళ్ల సమయం ఉదయం 8.45 గంటలకు మొదలై, సాయంత్రం 3.45 గంటల వరకు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. స్కూల్ ప్రాంగణంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నట్టైతే ఆయా స్కూళ్లు ఉన్నత పాఠశాలల వేళలనే పాటించాల్సి ఉంటుందని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ తరహా స్కూళ్లన్నీ ఉదయం 9.30 గంటలకు మొదలు కానున్నాయి. ఇక మధ్యాహ్న భోజనం 45 నిమిషాల విరామాన్ని ఇవ్వనున్నారు. తాజాగా మారిన స్కూల్స్ టైమింగ్స్‌కు సంబంధించిన షెడ్యూల్ వేసవి సెలవులు తరువాత నుంచి అమలు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.