TS CETs: తెలంగాణ ఉమ్మడి పరీక్షల తేదీలు వెల్లడి, 'EAPCET'గా మారిన ఎంసెట్
ఎంసెట్‌తోపాటు ఈసెట్, లాసెట్, పీజీసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, పీజీఈ సెట్‌కు సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించిన పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
Tealangana CETs Schedule: తెలంగాణలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూలు జనవరి 25న విడుదలైంది. ఎంసెట్‌తోపాటు ఈసెట్, లాసెట్, పీజీసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, పీజీఈ సెట్‌కు సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించిన పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. టీఎస్ ఎంసెట్ పేరును 'టీఎస్ ఈఏపీసెట్'గా మారుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 6 ఈసెట్, మే 9 నుంచి 13 వరకు ఈఏపీసెట్ (ఎంసెట్) పరీక్ష నిర్వహించనున్నారు. ఇక మే 23న ఎడ్‌సెట్, జూన్ 3న లాసెట్, జూన్ 4,5 తేదీల్లో ఐసెట్, జూన్ 6 నుంచి 8 వరకు పీజీఈసెట్, జూన్ 10 నుంచి 13 వరకు పీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఇతర వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్‌ను సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారు.
పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ మే 9 నుంచి 11 వరకు ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించున్నారు. మే 12, 13 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మాసీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో టీఎస్ ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
➥ టీఎస్ ఈసెట్ ప్రవేశ పరీక్షను మే 6న నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో పరీక్ష జరగనుంది.
➥ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఉద్దేశించిన టీఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష మే 23న జరగనుంది. నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహించనుంది.
➥ రాష్ట్రంలోని లా కాలేజీల్లో 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'టీఎస్ లా సెట్ 2024 పరీక్షను జూన్ 3న నిర్వహించనున్నారు. అదే విధంగా పీజీ లా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ టెస్టును కూడా అదేరోజు నిర్వహించనున్నారు. లాసెట్, పీజీ ఎల్‌సెట్‌లను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.
➥ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన 'టీఎస్ ఐసెట్' ప్రవేశ పరీక్షను జూన్ 4, 5 తేదీల్లో నిర్వహించనున్నారు. కాకతీయ యూనివర్సిటీ నిర్వహణలో ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్టు జరగనుంది.
➥ ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఉద్దేశించిన టీఎస్ పీజీఈసెట్ పరీక్ష జూన్ 6 నుంచి 8 వరకు నిర్వహించనున్నారు. హైదరాబాద్ జేఎన్టీయూ పరీక్ష నిర్వహించనుంది.
➥ బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'టీఎస్ పీఈసెట్' పరీక్షను జూన్ 10 నుంచి 13 మధ్య నిర్వహించనున్నారు. శాతవాహన యూనివర్సిటీ పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టింది.
ఇంటర్, జేఈఈ వంటి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఉన్నత విద్యామండలి ఎంసెట్ (ఈఏఫీసెట్) షెడ్యూలును ఖరారుచేసింది. తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కూడా వచ్చేసింది. మార్చి 19వ తేదీతో ఈ ఎగ్జామ్స్ పూర్తి కానున్నాయి. ఏప్రిల్ వరకు ఇంటర్, జేఈఈ పరీక్షలు పూర్తి కానున్న నేపథ్యంలో మే నెలలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక ఇదే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ప్రవేశాల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలను సిద్ధం చేసింది ఉన్నత విద్యా మండలి. ఈ మేరకు ఈఏపీసెట్ షెడ్యూలును ప్రకటించింది. మే 9 నుంచి 11 వరకు ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించున్నారు. మే 12, 13 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మాసీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇక ఏప్రిల్ మాసంలో జేఈఈ పరీక్షలు ఉండనున్నాయి. ఎంసెట్ ఎగ్జామ్ కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం ఉంది.