బీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో పెంచిన ఎస్టీ రిజర్వేషన్లు, ఉత్తర్వులు జారీ!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పెంచిన ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేయనుంది. బీఈడీ, బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల ప్రవేశాల్లో అమలు చేయనున్నట్లు ఈమేరకు రెండు జీవోలను విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పెంచిన ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేయనుంది. బీఈడీ, బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల ప్రవేశాల్లో అమలు చేయనున్నట్లు ఈమేరకు రెండు జీవోలను విడుదల చేసింది. వృత్తిపరమైన ఈ కోర్సుల్లో ఎస్టీలకు గతంలో ప్రభుత్వం 6 శాతం నుంచి 10 శాతంకు పెంచిన రిజర్వేషన్లను అమలు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం ఈమేరకు ఈ కోర్సుల్లో రిజర్వేషన్ పెంపు అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎస్టీ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
ఇకపై అన్ని విద్యా కోర్సుల్లో ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఎస్టీల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ సర్కారు గత ఏడాది ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం తీసుకునే సమయానికి గత ఏడాది కొన్ని కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. దాంతో మిగిలిన కోర్సుల అడ్మిషన్లలో ఈ 10 శాతం రిజర్వేషన్లను అమలు పరిచారు. ఈ ఏడాది ఇంజినీరింగ్, లా, పీజీ, బీఈడీ వంటి పలు వృత్తి విద్యా కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియను ఇప్పటికే చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయా సెట్ల నోటిఫికేషన్లను జారీ చేశారు. ఈ నేపథ్యంలో బీఈడీ, బీపీఈడీ వంటి కోర్సుల్లో ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లను వర్తింపజేయాలని విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన కోర్సులకు కూడా ఈ రిజర్వేషన్ అమలుచేయనున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో ఈ ఏడాది నుంచి 54 శాతం సీట్లను రిజర్వేషన్ కోటా అభ్యర్థులకు కేటాయించనున్నారు. మిగిలిన 46 శాతం సీట్లను జనరల్ కోటాలో భర్తీ చేయనున్నారు. రిజర్వేషన్ కోటాలో 29 శాతం బీసీలకు, 15 శాతం ఎస్సీలకు, 10 శాతం సీట్లను ఎస్టీ అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. మరో 10 శాతం రిజర్వేషన్‌ను ఈడబ్ల్యూఎ్‌సకు అమలు పరుస్తున్నారు. అయితే.. ఈ వర్గాలకు కేటాయించే సీట్లను సూపర్ న్యూమరరీ పద్ధతిలో ఆ మేరకు పెంచారు.
Also Read:
విద్యార్థులకు యూజీసీ గుడ్ న్యూస్, విదేశాల్లో మాదిరి చదువుకుంటూనే పార్ట్ టైమ్ జాబ్స్!
విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్థులు ఒక వైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. వారి తల్లిదండ్రులు ఎంత ధనికులైనా అక్కడి విద్యార్థులకు ఇలా పార్ట్ టైం జాబ్ చేయడం అనేది వారి కరిక్యులమ్లో ఓ భాగంగా ఉంటుంది. దీనివల్ల వారికి సంపాదన విలువ తెలియడమే గాక.. ఇండిపెండెంట్గా ఉండే స్వభావం అలవాటవుతుందని అక్కడి విద్యాసంస్థలు భావిస్తుంటాయి. ఇప్పుడు మనదేశంలోనూ ఇదే విధానాన్ని అమలు చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కార్యచరణ సిద్ధం చేస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ రద్దు! జీవో జారీ చేసిన ప్రభుత్వం!
తెలంగాణ ఎంసెట్‌లో ఈసారి నుంచి ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ విద్యాశాఖ బుధవారం (ఏప్రిల్ 19) ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంకు కేటాయించనున్నారు. ఇప్పటివరకు ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్‌లోని భాషేతర సబ్జెక్టులకు... అంటే 600 మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయించేవారు. ఇక నుంచి ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండానే ఎంసెట్‌లో స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. జేఈఈ మెయిన్, నీట్‌లలోనూ ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఎత్తివేశారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..