World Record: పది వేల మంది విద్యార్థులు- 600 మ్యాథ్స్ ఫార్ములాలు- ప్రపంచ రికార్డు దిశగా చిన్నారుల ప్రయత్నం
Hyderabad News:ఒకరు ఒక మ్యాథ్స్ ఫార్ములా చదివితే చూడముచ్చటగా ఉంటుంది. అదే పది మంది పది ఫార్ములాలు చదివితే వినసొంపుగా ఉంటుంది. పదివేల మంది వందల ఫార్ములాలు చదివితే ప్రపంచ రికార్డు బద్దలవుతుంది.
Sri Chaitanya World Record: సాధారణ విద్యతోపాటు జాతీయ అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న శ్రీ చైతన్య మరో ప్రపంచ రికార్డు సాధించేందుకు సిద్ధమవుతోంది. మ్యాథ్స్‌లో చిన్నారుల ఘనత ప్రపంచానికి చాటి చెప్పేందుకు రెడీ అయింది. దీని కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిచింది.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, UKతో ప్రపంచ రికార్డ్ బ్రేక్ చేసేందుకు సమాయత్తమవుతోంది శ్రీ చైతన్య విద్యాసంస్థ. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ ప్రపంచానికి చాటి చెప్పేందుకు మరోసారి రెడీ అయింది. పది వేల మంది విద్యార్థులతో 600 మ్యాథ్స్ ఫార్ములాలను చెప్పించనుంది. ఇప్పటి వరకు శ్రీ చైతన్య పేరు మీద ఉన్న రికార్డులను తానే చెరిపి కొత్త రికార్డులు నెలకొల్పి సత్తా చాటాలని చూస్తోంది.
ఈ ప్రక్రియ బుధవారం(నవంబర్6)నాడు జరగనుంది. ఉదయం ప్రారంభమయ్యే ప్రక్రియ సాయంత్రం ఐదున్నర గంటల వరకు కొనసాగనుంది. ఈ ఈవెంట్‌కు UKలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు పర్యవేక్షించి రికార్డు పత్రాలు అందజేస్తారు.
శ్రీచైతన్య విద్యా సంస్థలు ఇప్పటి వరకు మూడు ప్రపంచ రికార్డులు సాధించి ఉన్నాయి. 2018లో 2.5–5 సంవత్సరాల వయస్సు గల 100 మంది విద్యార్థులు 100 దేశాల మ్యాప్‌లను పఠించి, భౌగోళిక అవగాహనలో అద్భుతమైన ఫీట్ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 2022లో 601 మంది విద్యార్థులు 118 అంశాలను పఠించి 10 రాష్ట్రాల్లో పరమాణు చిహ్నాలతో కూడిన ఆవర్తన పట్టిక ప్రదర్శించి రెండో రికార్డు సొంతం చేసుకున్నారు. 2023లో 2,033 మంది విద్యార్థులు 100 నిమిషాల్లో 1 నుంచి 100 మాథ్స్‌్ టేబుల్స్ పఠించి ముచ్చటగా మూడో రికార్డు నెలకొల్పారు.
గతంలో సాధించిన విజయాల స్ఫూర్తితో నాల్గోసారి కూడా రికార్డు సాధిస్తామంటున్నాయి శ్రీచైతన్య విద్యా సంస్థలు. 39 ఏళ్ల క్రితం ప్రారంభమైన శ్రీచైతన్య ప్రస్థానంలో అనేక విజయా సాధించింది. ఇప్పుడు గణితంలో చిన్నారుల ప్రతిభా పాటవాలు ప్రపంచ వ్యాప్తం చేయాలని చూస్తోంది.