SBI Scholarship 2021: కోవిడ్ బాధిత విద్యార్థులకు ఎస్‌బీఐ స్కాలర్‌షిప్.. ఏడాదికి రూ.38,500 సాయం..
కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారి చదువుకు తోడ్పాటు అందించేందుకు SBI ముందుకొచ్చింది. అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ.29,500 నుంచి రూ.38,500 వరకు రివార్డు అందించనున్నట్లు పేర్కొంది.
కోవిడ్ మహమ్మారి కారణంగా గత ఏడాదిన్నర కాలంలో వేలాది మంది మరణించారు. దీంతో వారి పిల్లల చదువు, భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. తల్లిదండ్రులను కోల్పోవడంతో నిరాశ్రయులయ్యారు. ఇలాంటి వారికి చేయూత అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సిద్ధమైంది. విద్యార్థులకు ఎస్‌బీఐ జనరల్ సురక్ష సపోర్ట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ (SBI General Suraksha Support Scholarship Program) 2021 పేరుతో ఆర్థిక తోడ్పాటు అందించనున్నట్లు ప్రకటించింది. ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా విద్యార్థులకు ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపింది. అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ.29,500 నుంచి రూ.38,500 వరకు రివార్డు అందించనున్నట్లు పేర్కొంది.
కోవిడ్ కారణంగా తల్లి లేదా తండ్రిని (లేదా ఇద్దరినీ) కోల్పోయిన వారి పిల్లలకు ఈ స్కాలర్‌షిప్ వర్తిస్తుందని ఎస్‌బీఐ వెల్లడించింది. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఏడాదికి రూ.29,500.. గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు రూ.38,500 అందించనుంది. 9 నుంచి 12వ తరగతి (ఇంటర్) విద్యార్థులతో పాటు గ్రాడ్యుయేషన్ చదివే వారికి ఈ ప్రోగ్రాం వర్తించనుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు అక్టోబర్ 31వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: పీజీ చదివే వారి కోసం యూజీసీ స్కాలర్‌షిప్‌లు.. నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోండి..
ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
1. భారతీయ విద్యార్థులై ఉండాలి.
2. 2020 జనవరి నుంచి కోవిడ్ కారణంగా కుటుంబాన్ని పోషించే వ్యక్తి (తల్లి లేదా తండ్రి) ఉపాధి కోల్పోయినా లేదా.. చనిపోయిన వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
3. 9 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు.. గ్రాడ్యుయేషన్ (జనరల్ అండ్ ప్రొఫెషనల్) కోర్సులు చదివేవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
4. కుటుంబ వార్షికాదాయం రూ.6,00,000కి మించకూడదు.
5. ఎస్‌బీఐ జనరల్, బడ్డీ4స్టడీలలో ఉద్యోగం చేసేవారి పిల్లలు ఈ పథకానికి అనర్హులు.
Also Read: విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్స్.. వచ్చే నెలతో ముగియనున్న గడువు..
ఎంపిక చేస్తారిలా..
అభ్యర్థుల అకడమిక్ మెరిట్, ఆర్థిక నేపథ్యం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరికి టెలిఫోనిక్ విధానంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ సహా మరిన్ని వివరాల కోసం https://www.buddy4study.com/scholarships వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
Also Read: విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు..హెచ్‌డీఎఫ్‌సీ కోవిడ్ క్రైసెస్ సపోర్ట్..