సీపీగెట్ 'పీజీ' ప్రవేశాలకు అర్హతల సడలింపు! ఆ కోర్సులకు 'కెమిస్ట్రీ తప్పనిసరి' నిబంధన ఎత్తివేత!
ఆరు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు డిగ్రీలో కెమిస్ట్రీ ఉండాలన్న నిబంధనను సీపీగెట్ అధికారులు తాజాగా ఎత్తేశారు. ఈ మేరకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులు ప్రవేశాలు పొందవచ్చు.
తెలంగాణలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సీపీగెట్ నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అయితే అడ్మిషన్ల నిబంధనలను ఏటా సడలిస్తున్న అధికారులు తాజాగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు డిగ్రీలో కెమిస్ట్రీ ఉండాలన్న నిబంధనను సీపీగెట్ అధికారులు తాజాగా ఎత్తేశారు. ఈ మేరకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులు ప్రవేశాలు పొందవచ్చు.
మైక్రోబయాలజీ, జెనెటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్, ఎన్విరాన్‌మెంట్ సైన్స్, బయో కెమిస్ట్రీ, న్యూట్రిషన్, డైటెటిక్స్ ప్రోగ్రామ్ కోర్సుల్లో ప్రవేశానికి కెమిస్ట్రీని చదివి ఉండాలన్న నిబంధనను తొలగించారు. ఈ నిర్ణయంతో బీఎస్సీ బీజెడ్‌సీ, మైక్రోబయాలజీ, బయాలజీ, జువాలజీ వంటి కాంబినేషన్‌తో డిగ్రీ పూర్తిచేసిన వారు పైన పేర్కొన్న ఆరు సబ్జెక్టుల్లో చేరవచ్చు.
తాజాగా డిగ్రీలో ఏ కోర్సు తీసుకున్న వారైనా ఎంకామ్‌లో ప్రవేశాలు పొందవచ్చు. ఎంకాం ఎంట్రెన్స్‌లో ప్రతిభ సాధించాల్సి ఉంటుంది. వచ్చే విద్యాసంవత్సరంలో వివిధ యూనివర్సిటీల్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. కొత్తగా నిజాం కళాశాలలో పీజీ స్థాయిలో ఫెర్మెంటేషన్ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టగా, నల్లగొండలోని మహాత్మాగాంధీ వర్సిటీలో ఎంఏ హిస్టరీ, ఎంఏ టూరిజం, ఎంఏ సైకాలజీ కోర్సులను ప్రవేశపెట్టారు.
సీపీగెట్ -2023 నోటిఫికేషన్ విడుదల..
రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి పీజీ ప్రవేశాలకు సంబంధించిన ‘పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్) -2023’ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి మే 1న విడుదల చేసిన సంగతి తెలిసిందే. సీపీగెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 12 నుంచి ప్రారంభంకావాల్సి ఉన్నప్పటికీ.. సాంకేతిక కారణాల వల్ల వాయిదాపడింది. మే 13న దరఖాస్తు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విద్యార్థుల నుంచి జూన్ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇక రూ.500 ఆలస్య రుసుముతో జూన్ 18 వరకు, రూ.2వేల ఆలస్య రుసుముతో జూన్ 20 వరకు ఫీజు చెల్లించవచ్చు. జూన్ చివరివారంలో సీపీగెట్ పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం osmania.ac.in, cpget.tsche.ac.in, ouadmissions.com వెబ్‌సైట్లలో సంప్రదించవచ్చు. దాదాపు 300 కాలేజీల్లో అడ్మిషన్ల కోసం దాదాపు 45 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. సీపీగెట్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. దాదాపు 50 సబ్జెక్టులకు జూన్ చివరి వారంలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.
సీపీగెట్-2023 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆనర్స్ కోర్సు, ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి!
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా బీఎస్సీ ఆనర్స్ కోర్సు అందుబాటులోకి రానుంది. 2023-24 విద్యాసంవత్సరం నుంచే 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో పాటు మరికొన్ని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ కోర్సులో ప్రవేశాలు పొందిన విద్యార్థులు మూడేళ్ల తర్వాత కూడా ఆపేయవచ్చు. మూడేళ్ల తర్వాత నిలిపివేసిన విద్యార్థులకు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఇస్తారు. నాలుగేళ్లు పూర్తి చేసిన వారికి మాత్రం బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆనర్స్ డిగ్రీ ఇస్తారు. రెండేళ్ల క్రితం తొలిసారిగా పొలిటికల్ సైన్స్, ఆర్థికశాస్త్రంలో బీఏ ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టారు. నిజాం కళాశాల, కోఠి మహిళా కళాశాల, బేగంపేట మహిళా, సిటీ కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. తాజాగా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్‌కు కూడా ఆనర్స్‌ను విస్తరించారు.