JEE Advanced: విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్, మూడేళ్ల వరకు జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసే అవకాశం
JEE Advanced 2025: జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రయత్నాల సంఖ్య ఈ ఏడాది నుంచి రెండు నుంచి మూడుకు పెరిగింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒక అభ్యర్థి వరుసగా మూడు సార్లు JEE అడ్వాన్స్‌డ్‌ని ప్రయత్నించవచ్చు.
![JEE Advanced: విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్, మూడేళ్ల వరకు జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసే అవకాశం Number of attempts for JEE Advanced 2025 increased to 3 check complete details here JEE Advanced: విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్, మూడేళ్ల వరకు జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసే అవకాశం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/06/7d1518da638379ad4334b13a0e85aac31730879422752522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
JEE Advanced 2025 Attempts: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు ఉన్న అవకాశాన్ని కేంద్రం మరో ఏడాది పెంచింది. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలుగా వెలుగొందుతున్న ఐఐటీల్లో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఇప్పటివరకు వరుసగా రెండు సంవత్సరాలు మాత్రమే రాసే అవకాశం ఉంది. అయితే ఇకపై 3 సంవత్సరాలు పరీక్ష రాసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని జేఈఈ అడ్వాన్స్‌డ్- 2025 నిర్వహణ బాధ్యత చేపట్టిన ఐఐటీ కాన్పుర్ మంగళవారం(నవంబరు 5) తెలిపింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు 2000 అక్టోబరు 1 లేదా ఆ తర్వాత జన్మించిన వారు మాత్రమే అర్హులని స్పష్టంచేసింది. తాజా నిర్ణయంతో 2022-23 విద్యాసంవత్సరంలో ఇంటర్ పాసైన విద్యార్థులు కూడా ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హత లభించినట్లయింది. అయితే సిలబస్‌లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని ఐఐటీ కాన్పుర్ వెల్లడించింది.
వీరికి మినహాయింపు..
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5 సంవత్సరాల వరకు మినహాయింపు ఇచ్చారు. ఈ కేటగిరీ కింద 1995 అక్టోబరు 1 లేదా ఆ తర్వాత పుట్టినవారు కూడా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్‌లో కనీస స్కోర్ సాధించిన 2.50 లక్షల మందికి అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయడానికి అవకాశం కల్పిస్తున్నారు. అయితే జేఈఈ అడ్వాన్స్‌డ్-2025 పరీక్ష తేదీని ఐఐటీ కాన్పుర్ ఇంకా ప్రకటించలేదు. సాధారణంగా మే మూడు లేదా నాలుగో వారంలో పరీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు. దీని ప్రకారం ఈసారి కూడా మే 18 లేదా 25 తేదీల్లో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో పాల్గొన్న వారికి నేరుగా సీట్లు..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌తో సంబంధం లేకుండా అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో పాల్గొన్న విద్యార్థులకు ఐఐటీ కాన్పుర్‌లో నేరుగా బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. మ్యాథమెటిక్స్, ఇన్‌ఫర్మాటిక్స్ ఒలింపియాడ్‌లో పాల్గొన్న వారికి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్(సీఎస్‌ఈ)లో 6 సీట్లు కేటాయిస్తామని ఐఐటీ కాన్పుర్ పేర్కొంది. కెమిస్ట్రీ, ఎకనామిక్స్ సైన్సెస్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, బయలాజికల్ సైన్సెస్ & బయో ఇంజినీరింగ్ విభాగాల్లోనూ సీట్లు కేటాయిస్తామని తెలిపింది. ఈ సీట్లకు మార్చి మొదటి వారంలో దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు ప్రకటించింది. 'జోసా' కౌన్సెలింగ్ కంటే ముందుగానే ఈ ప్రవేశాలను పూర్తిచేయనున్నారు. అయితే నేరుగా కల్పించే ప్రవేశాల్లో.. ఇప్పటికే ఉన్న సీట్ల నుంచే ఒలింపియాడ్ విద్యార్థులకు కేటాయిస్తారా? లేదా సూపర్ న్యూమరరీ కింద అదనపు సీట్లు మంజూరు చేస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
ఈడబ్ల్యూఎస్, ఓబీసీ విద్యార్థుల దరఖాస్తుకు కొత్త చిక్కు..
వరుస వివాదాలతో ఒకవైపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పనితీరుపై విమర్శలు వస్తున్నా.. ఇప్పటికీ ఇష్టారాజ్యంగానే వ్యవహరిస్తోంది. ఇప్పటివరకూ జేఈఈ మెయిన్ పరీక్షలు రాసే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ-నాన్ క్రీమిలేయర్(NCL), ఈడబ్ల్యూఎస్ (EWS) విద్యార్థులు తమకు రిజర్వేషన్ వర్తిస్తుందని డిక్లరేషన్ ఫాంపై టిక్ పెట్టి దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన ఉండేది. అయితే ఈసారి ఆ నిబంధనల్లో మార్పులు చేశారు. దరఖాస్తు సమయంలోనే సంబంధిత సర్టిఫికెట్ వివరాలను పేర్కొనాలని ఎన్‌టీఏ స్పష్టంచేసింది. దీంతో ఇప్పటికిప్పుడు వాటిని ఎక్కడ తీసుకురావాలని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎస్సీ, ఎస్టీ ధ్రువపత్రాలకు కాలపరిమితి లేనందున, అవి ఒకసారి తీసుకుంటే ఎన్నేళ్లయినా ఉపయోగపడతాయి. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ-ఎన్‌సీఎల్ సర్టిఫికెట్లను కుటుంబ వార్షికాదాయం ప్రకారం జారీచేస్తారు. కుటుంబ ఆదాయం మారే అవకాశం ఉన్నందున.. అవి ఒక ఏడాదికి మాత్రమే చెల్లుబాటు అవుతాయి. వాస్తవానికి ఆ కోటా కింద ర్యాంకు పొందాలన్నా.. సీటు తీసుకోవాలన్నా ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. మరి ఇప్పుడు తీసుకుంటే మళ్లీ ఏప్రిల్ 1 తర్వాత తీసుకోవాల్సి వస్తుంది కదా? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎన్‌టీఏకు ఫిర్యాదులు వస్తున్నాయి.
జేఈఈ మెయిన్ దరఖాస్తుకు నవంబరు 22 వరకు అవకాశం..
జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు నవంబరు 22తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్‌టీఏ నిర్ణయంలో మార్పులు ఏమైనా ఉంటాయేమోనని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఆయా విద్యార్థులు ధ్రువపత్రాలకు దరఖాస్తు చేసి నంబరు తీసుకొని సిద్ధంగా ఉండాలని, కొద్ది రోజుల తర్వాత జేఈఈకి దరఖాస్తు చేయాలని కళాశాలలు, శిక్షణ సంస్థల నిర్వాహకులు సూచిస్తున్నారు. రెసిడెన్షియల్ కళాశాలల్లో చదువుతున్న వారికి కళాశాలల ప్రతినిధులే దరఖాస్తు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)