Medical Admissions: నీట్ ఆలిండియా లెవల్ తొలిదశ కౌన్సెలింగ్ తర్వాతే రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహణ!
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ ఏడాది కూడా పాత విధానంలోనే కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ ఏడాది కూడా పాత విధానంలోనే కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్పష్టం చేసింది. నీట్-యూజీలో అర్హత సాధించిన విద్యార్థులకు 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకుగానూ.. ఆలిండియా కోటా సీట్ల భర్తీకి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) తొలిదశ కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాతే.. రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు మొదటి రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నాయి.
ఈ ఏడాది దేశంలోని అన్ని రాష్ట్రాల కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఎంసీసీనే కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రతిపాదించగా.. తెలంగాణ, తమిళనాడుతోపాటు మరికొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ ఏకకాలంలో పూర్తిచేసే నేపథ్యంలోనే ఆలిండియా కోటా సీట్లకు ఎంసీసీ, కన్వీనర్ కోటా సీట్లకు రాష్ట్రాలు ఏకకాలంలో కౌన్సెలింగ్ నిర్వహించేలా ఎన్‌ఎంసీ ప్రతిపాదించగా.. రాష్ట్రాలు దీనికి అంగీకారం తెలిపాయి. తాజాగా ఈ ప్రతిపాదనను ఎంసీసీ విరమించుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆలిండియా కోటా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ సీట్ల భర్తీకి షెడ్యూలును విడుదల చేసింది.
తెలంగాణలోనూ పాతపద్ధతే..
తెలంగాణలోనూ పాతపద్ధతి ప్రకారమే ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎంసీసీ నిర్వహించే మొదటి రౌండ్ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాతే.. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టనుంది. ఆలిండియా కోటా సీట్ల భర్తీకి మొదటి రౌండ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 6 నాటికి పూర్తికానుంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మొదటి రౌండ్ కౌన్సెలింగ్ తేదీలను నిర్ణయించనున్నారు.
దరఖాస్తుల వెల్లువ..
తెలంగాణలోని వైద్య కళాశాలల్లో చేరేందుకు రికార్డు స్థాయిలో నీట్-యూజీలో అర్హత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రం నుంచి అర్హత సాధించిన 44,629 మందిలో 23వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరి ధ్రువపత్రాల పరిశీలనను కాళోజీ విశ్వవిద్యాలయం ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తం 3790 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా వీటిలో ఆలిండియా కోటా 15 శాతం సీట్లు మినహాయిస్తే మిగిలిన 3221 ఎంబీబీఎస్ సీట్లకు, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 50 శాతం కన్వీనర్ కోటా కింద మరో 2325 సీట్లకు కలిపి మొత్తం 5546 సీట్లకు కాళోజీ విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్ నిర్వహించనుంది.
ఖరారుకాని ఫీజులు..
ప్రస్తుత విద్యాసంవత్సరంలోపాటు, వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫీజులను కూడా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఇప్పటివరకు ఖరారు చేయలేదు. ఫీజులు ఖరారుకు సంబంధించి తెలంగాణ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఎంబీబీఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్సులు సహా వివిధ కోర్సులకు ఫీజుల పెంపునకు ప్రైవేటు కళాశాలల నుంచి ప్రతిపాదనలు తీసుకుంది. కాళోజీ యూనివర్సిటీ మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ జారీ చేసేలోపు ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది.
ALSO READ:
జేఎన్‌టీయూ గుడ్ న్యూస్, ఇకపై ఆ కాలేజీల్లోనూ ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలకు ఛాన్స్!
ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలు చేయాలనుకునేవారికి జేఎన్‌టీయూ హైదరాబాద్ శుభవార్త వినిపించింది. ఇకపై జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల్లోనూ విద్యార్థులు పరిశోధనలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలో 170 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలకు అవకాశం కల్పిస్తున్నట్లు జేఎన్‌టీయూహెచ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జేఎన్‌టీయూ అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు, పరిశోధనలను నిర్వహించేందుకుగాను ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial