(Source: ECI/ABP News/ABP Majha)
UGC NET 2024: యూజీసీ నెట్, సీఎస్‌ఐఆర్ నెట్ పరీక్షల షెడ్యూలు ఖరారు, ఇతర పరీక్షల తేదీలు ఇలా
NTA Examination Calendar: జులై నెల నుంచి ప్రారంభంకానున్న పరీక్షల క్యాలెండర్‌ను ఎన్టీఏ విడుదల చేసింది. ఇందులో యూజీసీ నెట్, సీఎస్‌ఐఆర్ నెట్, ఎన్‌సెట్, ఆయుష్ పీజీ పరీక్షల తేదీలను వెల్లడించింది.
NTA Examination Calendar for upcoming Examinations: పేపర్ లీక్ వార్తల నేపథ్యంలో ఇటీవల రద్దయిన యూజీసీ నెట్ (UGC NET)- 2024 జూన్ సెషన్ పరీక్షల కొత్త షెడ్యూలును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. ఈ మేరకు జూన్ 28న రాత్రి ఎన్టీఏ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 మధ్య యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (CSIR-UGC NET)- 2024 పరీక్షను జులై 25 నుంచి 27 వరకు, ఎన్‌సెట్ (NCET) పరీక్షను జులై 10న నిర్వహించనున్నట్లు తెలిపింది. అంతకుముందు నిర్వహించిన పెన్ను, పేపర్‌కు బదులుగా ఈ సారి కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ పరీక్ష (AIAPGET) 2024ను షెడ్యూలు ప్రకారమే జులై 6న నిర్వహించనున్నారు.
దేశవ్యాప్తంగా జూన్ 18న 317 నగరాల్లోని 1,205 సెంటర్లలో యూజీసీ నెట్ (UGC NET) పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేపర్, పెన్ (OMR) విధానంలో నిర్వహించింది. పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 11.21 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 6.35 లక్షల మంది మహిళలు, 4.85 లక్షల మంది పురుషులు ఉన్నారు. ఇక థర్డ్ జెండర్ అభ్యర్థులు 59 మంది ఉన్నారు. ఈ పరీక్షకు మొత్తం 9.08 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.
యూజీసీ నెట్ పరీక్ష విజయవంతంగా ముగిసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. రెండు షిఫ్ట్‌ల్లో నిర్వహించిన పరీక్షలో అక్రమాలు జరిగాయని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేసే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ICCCC) ఆధ్వర్యంలోని జాతీయ సైబర్ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం (నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్- NCTAU) యూజీసీకి నివేదిక ఇచ్చింది. దీంతో పరీక్షల్లో పారదర్శకత, విశ్వసనీయత కాపాడుకోవడం కోసమే పరీక్ష రద్దు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించింది. యూజీసీ నెట్‌లో అర్హత సాధించినవారు జూనియర్ రిసెర్చ్ ఫెల్లోషిప్‌కు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత, పీహెచ్‌డీ ప్రవేశాలను కల్పిస్తారు.
యూజీసీ నెట్ పేపర్ లీక్ వార్తల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్-2024 పరీక్షను కూడా యూజీసీ వాయిదావేసింది. అంతకుముందు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. దేశవ్యాప్తంగా జూన్ 25, 26, 27 తేదీల్లో సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే వాయిదాపడింది. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్ పరిధిలోని రిసెర్చ్ సెంటర్లలో, యూనివర్సిటీలలో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా జేఆర్‌ఎఫ్ అర్హత పొందితే యూనివర్సిటీలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధిస్తారు. తాజాగా 'నెట్' పరీక్షల కొత్త షెడ్యూలుతోపాటు ఇతర పరీక్షల షెడ్యూలును ఎన్టీఏ విడుదల చేసింది.
ALSO READ:
➥ ఎస్సీ గురుకులాల్లో బ్యాక్‌లాగ్ ప్రవేశాలు - దరఖాస్తు, స్కూల్ ట్రాన్స్‌ఫర్లకు అవకాశం