Scholarship: ఇంటర్ పాసైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, దరఖాస్తుకు డిసెంబరు 31 వరకు గడువు
ఇంటర్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు 'నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్'కు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్ అక్టోబరు 6న ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణలో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులై... ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు 'నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్'కు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్ అక్టోబరు 6న ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబరు 31 వరకు గడువు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇంటర్ మార్కుల్లో టాప్-20 పర్సంటైల్‌లో నిలిచిన 53,107 మంది ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆయన పేర్కొన్నారు. కొత్త విద్యార్థులతోపాటు గతంలో స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన వారు కూడా రెన్యువల్ కోసం డిసెంబరు 31లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు..
తెలంగాణలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. ప్రవేశాలు పొందడానికి అక్టోబరు 9 వరకు అవకాశం కల్పించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ అక్టబరు 3న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ కాలేజీల్లో ప్రవేశాలకు విద్యార్థులు రూ.1000 ఆలస్యరుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ కళాశాలల్లో ఎలాంటి రుసుము లేకుండా ప్రవేశాలు పొందవచ్చు.
ఫస్టియర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్..
తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలకు బోర్డు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటి వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. కొత్త విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ అమలు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. విద్యాసంవత్సరం చివరిలో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ పరీక్షకు 20 మార్కులు కేటాయించనున్నారు. దీంతో ఇప్పటివరకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఇంగ్లిష్ థియరీ పరీక్షను గతంలో మాదిరిగా 100 మార్కులకు కాకుండా, 80 మార్కులకు నిర్వహించనున్నారు. థియరీలో మార్కులు తగ్గినందున ఆ సబ్జెక్టులో కొన్ని పాఠాలను తొలగిస్తూ సిలబస్‌ను తగ్గించారు.
మూసపద్ధతిలో ఇంగ్లిష్‌లో పరీక్షలు నిర్వహించడం కాకుండా, ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్ నిర్వహించి, విద్యాసంవత్సరం చివరిలో ప్రయోగ పరీక్షలను నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇంటర్మీడియట్ బోర్డు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇంటర్మీడియట్ ఫస్టియర్ కోసం ప్రత్యేక సిలబస్‌ను రూపొందించి, ఆ సిలబస్‌కు అనుగుణంగా విద్యాసంవత్సరం పొడవునా విద్యార్థులతో ప్రాక్టికల్స్‌ను చేయించడం అన్నది ఈ కొత్త విధానంలో ప్రధానాంశం.
ప్రాక్టికల్స్ కోసం ప్రత్యేకంగా 90 పేజీలతో కూడిన ‘ఏ హ్యాండ్‌బుక్ ఆఫ్ కమ్యూనికేటివ్ ఇంగ్లిష్-1’ పేరిట ప్రత్యేక సిలబస్‌తో ఇంటర్మీడియట్ బోర్డు కొత్త పుస్తకాన్ని రూపొందించింది. ఆ పుస్తకాలు ముద్రణను పూర్తిచేసుకొని జూనియర్ కళాశాలలకు చేరాయి. ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ సెకండియర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టులకు, వొకేషనల్ కోర్సులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు.
జూనియర్ కళాశాలలకు దసరా సెలవులు..
తెలంగాణలోని జూనియర్ కళాశాలలకు దసరా సెలవులను ఇంటర్మీడియట్ బోర్డు అక్టోబరు 6న ప్రకటించింది. ఈసారి ఇంటర్ కాలేజీలకు వారంపాటు సెలవులు రానున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 19 నుంచి 25 వరకు జూనియర్ కళాశాలలకు సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపింది. తిరిగి అక్టోబరు 26న కళాశాలలు పునఃప్రారంభమవుతాయని చెప్పింది. సెలవురోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని బోర్డు హెచ్చరించింది.