Scholarship Programs: అమ్మాయిల చదువులకు 'కోటక్' ఆసరా, 'కన్యా స్కాలర్‌షిప్'తో ఆర్థిక భరోసా
Kotak Kanya Scholarship: దేశంలో ఆర్థికంగా వెనుకబడిన బాలికల చదువుకు కోటక్ మహీంద్రా గ్రూప్ ఆధ్వర్యంలోని కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కన్యా స్కాలర్‌షిప్స్ అందిస్తోంది.
Kotak Kanya Scholarship 2024-25: దేశంలో వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన బాలికలకు ఉన్నత విద్యలో తోడ్పాటు అందించేందుకు కోటక్ మహీంద్ర సంస్థ చేయూతనిస్తోంది. 'కోటక్ కన్యా స్కాలర్‌షిప్' పేరుతో కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఈ ఉపకారవేతనాలను అందిస్తోంది. మహిళా విద్యార్థులను శక్తివంతం చేయడం, వారిని ఉన్నత విద్యను అభ్యసించడానికి తోడ్పాటు అందించడం ఈ స్కాలర్‌షిప్ యొక్క ప్రధాన లక్ష్యం.
ఎవరు అర్హులు..?
ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ (5 సంవత్సరాలు), బీఫార్మసీ, బీఎస్సీ వంటి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసించే విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితోపాటు నర్సింగ్, ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్/బీఎస్-రిసెర్చ్, ఐసర్, ఐఐఎస్సీ (బెంగళూరు) లేదా ఇతర ప్రొఫెషనల్ కోర్సులు (డిజైన్, ఆర్కిటెక్చర్, మొదలైనవి) చదివే విద్యా్ర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల వార్షిక ఆదాయం రూ.6 లక్షలలోపు ఉండాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. కళాశాల ప్రవేశ ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి. కోటక్ సంస్థ ఉద్యోగుల పిల్లలు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
స్కాలర్‌షిప్ ఎంత..?
ఈ స్కాలర్‌షిప్ కింద ఎంపికైన విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, ఇంటర్నెట్, ల్యాప్‌టాప్, పుస్తకాలు, స్టేషనరీ ఖర్చుల కింద సంవత్సరానికి రూ.1.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు.
కావాల్సిన డాక్యుమెంట్లు..
➥ ఇంటర్ మార్కుల మెమో
➥తల్లిదండ్రులు/సంరక్షల ఆదాయ ధ్రువీకరణ
➥ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్
➥ కళాశాల ఫీజు వివరాలు
➥ విద్యార్థుల బోనఫైడ్ సర్టిఫికేట్, కళాశాల లెటర్
➥ కళాశాలలో సీటు కేటాయింపు ధ్రువీకరణ లెటర్
➥ కళాశాల ప్రవేశ పరీక్ష స్కోరుకార్డు
➥ ఆధార్ కార్డు
➥ బ్యాంకు పాస్‌బుక్
➥ పాస్‌పోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్
➥ డెజెబిలిటీ సర్టిఫికేట్ (అవసరమైనవారికి)
➥ పేరెంట్ డెత్ సర్టిఫికేట్ (సింగిల్ పేరెంట్/అనాదలు)
➥ ఇంటికి సంబంధించిన ఫొటోగ్రాఫ్
దరఖాస్తు ఇలా..
➥ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మొదట buddy4study.com వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
➥ అక్కడ హోంపేజీలో Kotak Kanya Scholarship 2024-25 లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ స్కాలర్‌షిప్ వివరాల తర్వాత కింది భాగంలో కనిపించే ‘Apply Now’ బటన్ మీద క్లిక్ చేయాలి.
➥ ‘Online Application Form Page’ పేజీలో తమ రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలతో లాగిన్ అవ్వాలి.
➥ మొదటిసారి దరఖాస్తు చేసుకునేవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈమెయిల్, ఫోన్ నెంబరు, జీమెయిల్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
➥ రిజిస్ట్రేషన్ పూర్తికాగానే.. ‘Kotak Kanya Scholarship 2024-25’ దరఖాస్తు పేజీలోకి వెళ్లాలి.
➥ దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ‘Start Application’ బటన్ మీద క్లిక్ చేయాలి.
➥ స్కాలర్‌షిప్ అప్లికేషన్ ఫామ్‌లో అవసరమైన వివరాలన్నీ నమోదుచేయాలి.
➥ అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
➥ ‘Terms and Conditions’ అన్ని ఆమోదించి ‘Preview’ బటన్ మీద క్లిక్ చేయాలి.
➥ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.