TS EAMCET: అభ్యర్థులకు మరో అవకాశం.. టీఎస్ ఎంసెట్ గడువు పెంపు
TS EAMCET Exam: 2021: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & మెడికల్ కామన్ ఎంట్రన్స్ పరీక్షదరఖాస్తు గడువును జూలై 8 వరకు పొడిగించినట్లు తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & మెడికల్ విభాగాల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ పరీక్ష (Telangana State Engineering, Agriculture and Medical Common Entrance Test) - 2021 దరఖాస్తు గడువును జూలై 8 వరకు పొడిగించారు. ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించకుండా 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ వెల్లడించారు. దరఖాస్తుల సవరణలకు జూలై 2వ తేదీ నుంచి 9 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆలస్య రుసుము రూ.250తో జూలై 19 వరకు, రూ.500తో జూలై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రక్రియ జూలై 23న ప్రారంభమై.. 31వ తేదీతో ముగుస్తుందని చెప్పారు. దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలోనే స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. మరిన్ని వివరాల కోసం https://eamcet.tsche.ac.in/ సంప్రదించవచ్చు.
ఇంజనీరింగ్ దరఖాస్తులకు ఎస్సీ, ఎస్టీ మరియు పీహెచ్ అభ్యర్థులు రూ.400, ఇతరులు రూ.800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ & మెడికల్ విభాగంలో ప్రవేశాల దరఖాస్తులకు ఎస్సీ, ఎస్టీ మరియు పీహెచ్ అభ్యర్థులు రూ.400, ఇతరులు రూ.800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. టీఎస్ ఎంసెట్ ప్రవేశ పరీక్షను తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలలో కలిపి మొత్తం 23 పరీక్ష కేంద్రాలలో నిర్వహించనున్నారు. కాగా, కరోనా కారణంగా తెలంగాణలో ఇప్పటికే ఎంసెట్ పరీక్షను పలుమార్లు పొడిగించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో తాజాగా మరోసారి ఎంసెట్ దరఖాస్తు గడువును పొడిగించారు.
టీఎస్ ఎంసెట్ పరీక్ష తేదీలు
ఇంజనీరింగ్ విభాగాలకు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అగ్రికల్చర్ & మెడికల్ విభాగాలకు ఆగస్లు 9, 10 తేదీల్లో మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో పీజీఈసెట్ పరీక్షలను ఆగస్టు 11 నుంచి 14 వరకు.. ఎడ్‌సెట్ పరీక్షలు ఆగస్టు 24, 25 తేదీల్లో నిర్వహించనున్నారు. లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలు సైతం ఆగస్టు 23న జరగనున్నాయి.
ఏపీ ఈఏపీసెట్ కూడా ఆగస్టులోనే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ ఉమ్మడి ప్రవేశ పరీక్షల కోసం నిర్వహించే ఈఏపీసెట్ (AP EAPCET ) - 2021 నోటిఫికేషన్ విడుదల అయింది. దీని ప్రకారం ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా అభ్యర్థులు జూన్ 26 నుంచి జూలై 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుము రూ.500తో ఆగస్టు 5వ తేదీ వరకు, రూ.5,000తో ఆగస్టు 16 వరకు, రూ.10,000తో ఆగస్టు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈఏపీసెట్ పరీక్షలు ఆగస్టు 19 నుంచి 25 వ తేదీ వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు.. రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. మరిన్ని వివరాలను https://apsche.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.