Mains 2021 Results: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా.. 8 మందికి వంద పర్సంటైల్..
జేఈఈ మెయిన్ సెషన్ 3 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు విజయఢంకా మోగించారు. దేశవ్యాప్తంగా 17 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధిస్తే.. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన వారు 8 మంది ఉన్నారు.
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు విజయఢంకా మోగించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్ 3 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 17 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధిస్తే.. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు 8 మంది ఉన్నారు. వీరిలో నలుగురు తెలంగాణ, నలుగురు ఏపీకి చెందిన వారుగా ఉన్నారు.
100 పర్సంటైల్ సాధించిన వారిలో కరణం లోకేష్ (ఆంధ్రప్రదేశ్), దుగ్గినేని వెంకట ఫణీష్ (ఆంధ్రప్రదేశ్), పాసాల వీర శివ (ఆంధ్రప్రదేశ్), కంచనపల్లి రాహుల్ నాయుడు (ఆంధ్రప్రదేశ్), పోలు లక్ష్మీ సాయి లోకేష్ రెడ్డి (తెలంగాణ), మాదుర్ ఆదర్శ్ రెడ్డి (తెలంగాణ), వెలవలి కార్తికేయ సాయి వైదిక్ (తెలంగాణ), జోష్యుల వెంకట ఆదిత్య (తెలంగాణ) ఉన్నారు.
బాలికల విభాగంలో టాప్ 10 స్థానాల్లో ఐదుగురు తెలుగు అమ్మాయిలు ఉండటం విశేషం. తెలంగాణకు చెందిన కొమ్మ శరణ్య, పల్లె భావన, గసడ శ్రీ లక్ష్మి, అంచ ప్రణవిలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మనస్వితా రెడ్డి టాప్ 10లో చోటు దక్కించుకున్నారు.
జేఈఈ మెయిన్ సెషన్ 3 ఫలితాలు శుక్రవారం రాత్రి విడుదలయ్యాయి. ఈ పరీక్షలను జూలై 20, 22, 25, 27 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షలకు 7.09 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. అంతకుముందు నిర్వహించిన జేఈఈ మొదటి విడత పరీక్షల్లో ఒక్క విద్యార్థి కూడా 100 పర్సంటైల్ సాధించలేదు. ఇక రెండో విడతలో మొత్తం 13 మంది 100 పర్సంటైల్ సాధించగా.. వీరిలో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉన్నారు. మూడో విడతలో మాత్రం రికార్డు స్థాయిలో 8 మంది ఉన్నారు.
జేఈఈ మెయిన్ సెషన్ 3 ఫలితాలను jeemain.nta.nic.in, ntaresults.nic.in, nta.ac.in వెబ్ సైట్ల ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేయాలి. స్కోర్ కార్డులో అభ్యర్థి సాధించిన మొత్తం మార్కులు, అభ్యర్థి పేరు, పేరెంట్స్ పేరు, అప్లికేషన్ నంబర్, రోల్ నంబర్, కేటగిరీతో పాటు సబ్జెక్టుల వారీగా ఎన్టీఏ స్కోరు ఉంటాయి.
ఆగస్టు 26, 27 తేదీల్లో నాలుగో సెషన్..
జేఈఈ మెయిన్ పరీక్షల నాలుగో సెషన్ ఈ నెల 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జరగనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను అక్టోబర్ 3న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. పూర్తి స్థాయిలో కోవిడ్ ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ.. పరీక్ష నిర్వహిస్తామని ఆయన ట్వీట్ చేశారు. కాగా, గతంలో నిర్ణయించిన తేదీ ప్రకారం ఈ పరీక్ష జూలై 3న జరగాల్సి ఉంది. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పరీక్ష వాయిదా పడింది.
JEE (Advanced) 2021 examination for admission in #IITs will be held on the 3rd October, 2021. The examination will be conducted adhering to all Covid-protocols.@DG_NTA @PIBHRD @EduMinOfIndia @IITKgp @PMOIndia
— Dharmendra Pradhan (@dpradhanbjp) July 26, 2021
ఐఐటీ ఖరగ్‌పూర్ ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహించనుంది. జేఈఈ మెయిన్ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా రెండున్నర లక్షల మందికి అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తుంది. జేఈఈ పరీక్షలకు సంబంధించిన మరింత సమాచారం కోసం www.nta.ac.in, jeemain.nta.nic.in వెబ్‌సైట్లను సంప్రదించవచ్చు.