JEE Main: జేఈఈ మెయిన్‌లో మరో విద్యార్థికి 300కి 300 మార్కులు!
NTA ప్రకటించిన జేఈఈ మెయిన్ ఆన్సర్ కీ ప్రకారం నెల్లూరు జిల్లాకు చెందిన పి.లోహిత్ ఆదిత్యసాయి 300కి 300 మార్కులు సాధించాడు. ఆయన మొదటి 10 ర్యాంకుల్లో నిలిచే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ సెషన్-2 ఫైనల్ ఆన్సర్ కీని ఏప్రిల్ 24న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఏ వెల్లడించిన తుది ఆన్సర్ కీ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన పి.లోహిత్ ఆదిత్యసాయి 300కి 300 మార్కులు సాధించాడు. ఆయన మొదటి 10 ర్యాంకుల్లో నిలిచే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. లోహిత్.. పాఠశాల విద్య నుంచి ఇంటర్ వరకు నెల్లూరులోని నారాయణ విద్యా సంస్థల్లో చదివాడు. జూన్ 4న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతానని లోహిత్ తెలిపాడు. లోహిత్ కుటుంబం నెల్లూరులోని లక్ష్మీపురంలో నివాసముంటోంది. తండ్రి శ్రీనివాసరావు సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. తల్లి వరలక్ష్మీ గృహిణి.
హైదరాబాద్ విద్యార్థికి కూడా..
ఆన్సర్ కీ ప్రకారం హైదరాబాద్‌కు చెందిన సింగరాజు వెంకట్ కౌండిన్య కూడా 300కి 300 మార్కులు సాధించాడు. ఆయన మొదటి 10 ర్యాంకుల్లో నిలిచే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కౌండిన్య పాఠశాల విద్య నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్‌లోని శ్రీచైతన్య విద్యా సంస్థల్లో చదివాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతానని కౌండిన్య తెలిపాడు.
ఏప్రిల్ 6 నుంచి 13 వరకు బీటెక్ సీట్ల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రాథమిక కీని కొద్దిరోజుల క్రితం వెల్లడించిన ఎన్‌టీఏ దానిపై అభ్యంతరాలను స్వీకరించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 24న రాత్రి తుది కీని వెబ్‌సైట్‌లో ఉంచింది. ప్రాథమిక కీలో ఇచ్చిన జవాబుల్లో మొత్తం 24 ప్రశ్నలకు సమాధానాలను మార్చినట్లు శ్రీచైతన్య ఐఐటీ జాతీయ డీన్ ఎం.ఉమాశంకర్ తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మంది ఈ పరీక్షలు రాశారు. గత జనవరి, తాజా పరీక్షల్లో వచ్చిన స్కోర్‌లో ఉత్తమమైన దాన్ని ఎంచుకొని ర్యాంకులు ఇస్తారు. రాత్రి 10 గంటల వరకు మాత్రం వాటిని ప్రకటించలేదు.
30 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్
జేఈఈ మెయిన్‌లో కనీస కటాఫ్ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హత కల్పిస్తారు. వారు ఏప్రిల్ 30వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు మే 7వ తేదీ తుది గడువు. జూన్ 4వ తేదీన జరిగే పరీక్ష ఫలితాలను జూన్ 18వ తేదీన వెల్లడిస్తారు.
Also Read:
ఐఐఎస్‌ఈఆర్‌లో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ప్రవేశం ఇలా!
దేశంలోని ప్రసిద్ధ సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఆప్టిట్యూడ్ టెస్టులో చూపిన ప్రతిభతో అవకాశం కల్పిస్తారు. ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభావంతులు, కేవీపీవైకి ఎంపికైనవారినీ కోర్సుల్లో చేర్చుకుంటారు. ప్రవేశాలు పొందినవారికి ప్రతి నెలా స్టైపెండ్ ఇస్తారు. దేశంలో తిరుపతి, బరంపురం, భోపాల్, కోల్‌కతా, మొహాలీ, పుణే, తిరువనంతపురంలో ఐఐఎస్‌ఈఆర్ విద్యాసంస్థులు ఉన్నాయి. అభ్యర్థులు మే 25 వరకు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే జేఈఈ అడ్వాన్స్‌డ్ ద్వారా ప్రవేశం పొందువారు జూన్ 25 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..