JEE Advanced Results: నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల వెల్లడి, రిజల్ట్ ఎన్నిగంటలకంటే?
JEE Advanced Results: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్–2024 పరీక్ష ఫలితాలను ఐఐటీ మద్రాస్ జూన్ 9న విడుదలచేయనుంది.
JEE Advanced 2024 Results: దేశంలో ఐఐటీలు సహా ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు మే 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు ఆదివారం(జూన్ 9న) విడుదలకానున్నాయి. ఉదయం 10 గంటలకు ఫలితాలను ఐఐటీ మద్రాస్ విడుదల చేయనుంది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు తమ రూల్ నెంబరు, పుట్టినతేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు ఫైనల్ కీలను కూడా విడుదల చేయనున్నారు.
ఐఐటీలలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 'జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్–2024' పరీక్షను మే 26న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.91 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఎంత మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు అన్న విషయాన్ని మాత్రం ఐఐటీ మద్రాస్ వెల్లడించలేదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 26, తెలంగాణలో 13 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మంది రాసి ఉంటారని అంచనావేస్తున్నారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ - 2024 ఫలితాల కోసం వెబ్‌సైట్..
జేఈఈ అడ్వాన్స్‌డ్ - 2024 పరీక్ష రెస్పాన్స్ షీట్లను ఐఐటీ మద్రాస్ మే 31న విడుదల చేసిన సంగతి తెలిసిందే. జేఈఈ అడ్వాన్స్‌డ్ - 2024కు సంబంధించి పేపర్-1, పేపర్-2 ప్రశ్నపత్రాలను ఇప్పటికే అందుబాటులో ఉంచింది. పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ని జూన్ 2న విడుదల చేసింది. జూన్ 3న సాయంత్రం 5 గంటలకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించారు. తాజాగా జూన్ 9న ఫలితాలను వెల్లడించనున్నారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 పరీక్షకు హాజరైనవారిలో ఈసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే అధికంగా ఉన్నారు. దాదాపు 40 వేల వరకు విద్యార్థులు పరీక్ష రాశారు. జేఈఈ మెయిన్‌ను రెండు సెషన్లు కలిపి 14.10 లక్షల మంది పరీక్షలకు హాజరైన సంగతి తెలిసిందే. వీరిలో క్వాలిఫై కటాఫ్ మార్కులు సాధించిన వారిలో 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పిస్తారు. మొత్తం 2,50,284 మంది అభ్యర్థులు అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించగా.. మొత్తం 1.91 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం అభ్యర్థులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. 2022లో 1.60 లక్షల మంది, 2023లో 1.89 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా.. ఈసారి ఏకంగా 1.91 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఏపీ, తెలంగాణల నుంచి అత్యధిక శాతం మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 45,965 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించగా.. 40 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.
జూన్ 10 నుంచి జోసా కౌన్సెలింగ్..
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి 'జోసా' పేరిట కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు జూన్ 9న వెల్లడికానుండగా.. జూన్ 10 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. జులై 23 వరకు 44 రోజులపాటు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ ద్వారా ఎన్‌ఐటీల్లో దాదాపు 24 వేల సీట్లు, ఐఐటీల్లో 17,385, ట్రిపుల్ ఐటీల్లో మరో 16 వేల సీట్లను భర్తీచేయనున్నారు. ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకుతోపాటు అభ్యర్థులు బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలన్న నిబంధన అమల్లో ఉంది.