Pharmacy Commission: ఫార్మసీ కౌన్సిల్ స్థానంలో 'నేషనల్ ఫార్మసీ కమిషన్', ముసాయిదా బిల్లు విడుదల చేసిన కేంద్రం
NFC Bill 2023: దేశంలో ఫార్మసీ విద్య నియంత్రణ కోసం కొత్తగా జాతీయ ఫార్మసీ కమిషన్(National Pharmacy Commission) ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
NFC Bill 2023: దేశంలో ఫార్మసీ విద్య నియంత్రణ కోసం కొత్తగా జాతీయ ఫార్మసీ కమిషన్(National Pharmacy Commission) ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫార్మసీ యాక్ట్(Pharmacy Act)-1948ని రద్దుచేసి.. 'ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా' స్థానంలో జాతీయ ఫార్మసీ కమిషన్(NFC)ను ఏర్పాటుచేయనుంది. దేశంలో ఫార్మసీ విద్య ప్రమాణాలను పెంచడంతోపాటు.. అత్యంత నాణ్యమైన ఫార్మసీ నిపుణులు లభ్యమయ్యేలా చూడటం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.
నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్-2019 తరహాలోనే కేంద్ర ప్రభుత్వం... జాతీయ ఫార్మా కమిషన్ బిల్లు-2023ని రూపొందించింది. వైద్య ఆరోగ్య విద్యను నియంత్రించే సంస్థలను సంస్కరించి దేశంలో నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ఈ బిల్లుపై డిసెంబరు 12 వరకు సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఈమెయిల్: hrhcell-mohfw@nic.in లేదా ఈమెయిల్: publiccommentsahs@gmail.com ద్వారా పంపవచ్చు.
కొత్తగా ఏర్పడబోయే జాతీయ ఫార్మసీ కమిషన్‌లో ఒక ఛైర్‌పర్సన్‌తోపాటు, 13 మంది ఎక్స్-అఫీషియో సభ్యులు, 14 మంది తాత్కాలిక సభ్యులు ఉంటారు. ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా ఈ కమిషన్ ఏర్పాటు కానుంది. దేశంలో ఫార్మసీ విద్యా సంస్థలను క్రమం తప్పకుండా పరిశీలించి పారదర్శకంగా వాటి పనితీరును కమిషన్ అంచనా వేస్తుంది. ఫార్మసీ సేవల్లో నైతిక ప్రమాణాలను పెంపొందిస్తారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం పటిష్ట వ్యవస్థను నెలకొల్పుతుంది. జాతీయ ఫార్మసీ కమిషన్ కింద.. ఫార్మసీ ఎడ్యుకేషన్ బోర్డ్, ఫార్మసీ అసెస్‌మెంట్ & రేటింగ్ బోర్డు, ఫార్మసీ ఎథిక్స్ అండ్ రిజిస్ట్రేషన్ బోర్డ్ అనే మూడు బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఏడాదిలోపు రాష్ట్రప్రభుత్వాలు ఫార్మసీ విద్యకు సంబధించి జాతీయ ఫార్మసీ కమిషన్ కింద పనిచేయాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా అందరికీ సమాన స్థాయిలో వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి జాతీయ ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవడం కోసం ఈ మార్పు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఆధునిక పరిశోధనల దిశగా ఫార్మసీ వృత్తి నిపుణులను ప్రోత్సహించేందుకు ఈ కొత్త బిల్లు బాటలు వేస్తుందని పేర్కొంది. న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయంతో కమిషన్‌ను ఏర్పాటు చేయాలని బిల్లు ప్రతిపాదించింది. ఇది స్తబ్దుగా ఉన్న ఫార్మసీ విద్యకు పునరుజ్జీవనాన్ని అందించి, దాని స్థాయిని పెంచుతుందని కేంద్రం భావిస్తోంది.
నేషనల్ రిజిస్టర్ లేదా స్టేట్ రిజిస్టర్‌లో నమోదు చేసుకోవడానికి, ఫార్మసీ ప్రొఫెషనల్‌గా ప్రాక్టీస్ చేయడానికి అవసరమైన లైసెన్స్ మంజూరుకు ఫార్మసీ కమిషన్ బాధ్యత వహిస్తోంది. ఫార్మసీ అసెస్‌మెంట్ & రేటింగ్ బోర్డు నుండి ముందస్తు అనుమతి లేకుండా కొత్త ఫార్మసీ సంస్థలు లేదా కోర్సులను ఏర్పాటు చేయడాన్ని బిల్లు నిషేధిస్తుంది. ఈ బోర్డు ఫార్మసీ సంస్థలను మూల్యాంకనం చేసి, రేటింగ్ ఇస్తుంది. వెబ్‌సైట్‌లో అసెస్‌మెంట్ డాక్యుమెంట్‌లను అందుబాటులో ఉంచుతుంది. కనీస ప్రమాణాలను పాటించకపోతే హెచ్చరికలు చేయడం, జరిమానాలు విధించడం, అడ్మిషన్ల సస్పెన్షన్ లేదా అఫీలియేషన్ రద్దు వంటి చర్యలకు చేపడుతుంది.
ఫార్మసీ ఎథిక్స్ & రిజిస్ట్రేషన్ బోర్డ్.. పారదర్శకతకు భరోసానిస్తూ, ఫార్మసీ నిపుణుల వివరాలను కలిగి ఉన్న నేషనల్ ఫార్మసీ రిజిస్టర్ (NPR) బాధ్యతలను నిర్వర్తిస్తోంది. విద్యా ప్రమాణాలు, సౌకర్యాలు, మూల్యాంకనాలు, శిక్షణ, పరిశోధన, ట్యూషన్ ఫీజులను నిర్ణయించడం కమిషన్ బాధ్యత. ఇది ఫార్మసీ ఫ్యాకల్టీ మరియు క్లినికల్ సౌకర్యాల కోసం ప్రమాణాలను ఏర్పరుస్తుంది, ఏకరీతి అడ్మిషన్ మెకానిజంను అమలు చేస్తుంది. ఫార్మసీ విద్య, శిక్షణ విధానాలను కూడా కమిషన్ నియంత్రిస్తుంది.