TS EAMCET: 'ఎంసెట్' పేరు మార్చనున్న ప్రభుత్వం, కొత్త పేరు ఇదే?
తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించే 'TSEAMCET' పేరు మారనుంది. ప్రవేశపరీక్ష పేరును మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పేరును TSEAPCET లేదా TSEACET గా మార్చే అవకాశముంది.
Telangana State EAMCET: తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించే 'TSEAMCET' పేరు మారనుంది. ప్రవేశపరీక్ష పేరును మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పేరును TSEAPCET లేదా TSEACET గా మార్చాలని ప్రభుత్వానికి ప్రతిపాదనాలు అందినట్లు తెలిసింది. 2017 నుంచి ఎంసెట్‌లో మెడికల్ సీట్ల భర్తీని తొలగించి, ఎంబీబీఎస్, ఇతర వైద్యకోర్సులను నీట్ ద్వారా భర్తీ చేస్తోంది. అయినప్పటికీ ఎంసెట్ పేరులో మెడికల్ అనే పదం అలాగే కొనసాగుతోంది. దాన్ని తొలగించాలని ప్రభుత్వ స్థాయిలో చర్చ జరిగింది. మెడికల్ పేరును తొలగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో 'P' అంటే ఫార్మసీ అని అర్థం. బీఫార్మసీ సీట్లను ఎంసెట్ ద్వారానే భర్తీ చేస్తున్నందున 'P' అక్షరాన్ని పొందుపరిచినట్లు సమాచారం. ఈ రెండు పేర్లపై త్వరలోనే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది.
మరోవైపు ఏపీలో ప్రస్తుతం ఏపీఈఏపీసెట్ అనే పేరుతో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గతంలో జారీచేసిన ఎంసెట్ జీవోను సవరించి, కొత్త జీవోను జారీ చేయాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. ఎంసెట్ పేరు మార్పు జీవో త్వరలోనే ఖరారయ్యే అవకాశాలున్నట్టుగా అధికార వర్గాలు తెలిపాయి.
ప్రవేశ పరీక్షపై కసరత్తు..
ఈ ఏడాది నిర్వహించే ఎంసెట్ ప్రవేశ పరీక్షపై కసరత్తు చేస్తోంది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. ఇప్పటికే పరీక్ష షెడ్యూల్ పై ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇంటర్, జేఈఈ వంటి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని… ఎంసెట్ షెడ్యూల్ ను నిర్ణయిస్తుంటారు అధికారులు. అయితే తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కూడా వచ్చేసింది. మార్చి 19వ తేదీతో ఈ ఎగ్జామ్స్ పూర్తి కానున్నాయి. ఇక ఏప్రిల్ మాసంలో జేఈఈ పరీక్షలు ఉండనున్నాయి.
ఏప్రిల్ వరకు ఇంటర్, జేఈఈ పరీక్షలు పూర్తి కానున్న నేపథ్యంలో మే నెలలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. త్వరలోనే అధికారికంగా షెడ్యూల్ ను ప్రకటించనుంది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. ఇక ఇదే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ప్రవేశాల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలను సిద్ధం చేసే పనిలో ఉంది ఉన్నత విద్యా మండలి. ఎంసెట్ ఎగ్జామ్ కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం ఉంది.
ALSO READ:
తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెల్లడి - పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని గిరిజన (ఎస్టీ) గురుకుల జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి 'తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ' 'కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TTWR COE CET) - 2024' నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(ప్రతిభా కళాశాలలు)లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ ఉచిత విద్యతో పాటు, ఉచిత వసతి ఉంటుంది. వీరికి ఐఐటీ, నీట్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియ జనవరి 13న ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 5 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్థులకు జనవరి 18న లెవల్-1 (ఆబ్జెక్టివ్) పరీక్ష, మార్చి 10న లెవల్-2 (డిస్క్రిప్టివ్) పరీక్షలు నిర్వహింనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..