First Class Admissions: ఆరేళ్లు నిండితేనే ఒకటో తరగతిలో ప్రవేశాలు - రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం లేఖలు
Central Letter: ఇకపై ఆరేళ్లు నిండితేగానీ ఒకటో తరగతి చదవడానికి అర్హులు కాదు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని అనుసరించి ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన (6+) పిల్లలకే ప్రవేశాలు కల్పించాలి.
![First Class Admissions: ఆరేళ్లు నిండితేనే ఒకటో తరగతిలో ప్రవేశాలు - రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం లేఖలు Government asks all States and UTs to make 6 years minimum age for Class 1 admission First Class Admissions: ఆరేళ్లు నిండితేనే ఒకటో తరగతిలో ప్రవేశాలు - రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం లేఖలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/a93798c1ee849ef67473bf1da25313ed1709019946420522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
First Class Admissions: ఇకపై ఎలాపడితే అలా పిల్లలను పాఠశాలలో చేర్పించడానికి వీల్లేదు. ఆరేళ్లు నిండితేగాని ఒకటో తరగతి చదవడానికి అర్హులు కాదు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాన్ని అనుసరించి ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన (6+) పిల్లలకే ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ గతేడాది అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయానికి సంబంధించిన గతేడాది లేఖలు రాయగా.. తాజాగా మరోసారి లేఖలు పంపింది. వచ్చే విద్యా సంవత్సరం(2024-25) ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం సూచించింది.
చిన్నారుల పునాది దశ విద్యాభ్యాసాన్ని బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ విద్యావిధానం-2020 సిఫార్సు చేయడంతో.. నూతన జాతీయ విద్యావిధానం (NEP - 2020), విద్యాహక్కు చట్టం (RTE Act -2009) పరిధిలోని నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యా శాఖ స్పష్టంచేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై ఆరేళ్లు నిండిన చిన్నారులకే ఒకటో తరగతిలో ప్రవేశాలు లభించనున్నాయి.
కొత్త జాతీయ విద్యా విధానం (NEP) ప్రకారం, పునాది దశలో పిల్లలందరికీ (3 నుంచి 8 సంవత్సరాల మధ్య) ఐదు సంవత్సరాల అభ్యాస అవకాశాలను కలిగి ఉంటుంది. ఇందులో మూడు సంవత్సరాల ప్రీస్కూల్ విద్య(నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ) తర్వాత.. 1, 2 తరగతులు ఉంటాయి. పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా చిన్న వయస్సులో పాఠశాలలకు పంపరాదని సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
మూడేళ్ల వయసులో పిల్లలను పాఠశాలకు పంపడం వల్ల మంచి పునాది పడటంతో ప్రీ-స్కూల్ నుంచి రెండో తరగతి వరకు చిన్నారుల్లో లెర్నింగ్ ప్రక్రియ అలవడుతుందని తెలిపింది. అలాగే.. అంగన్‌వాడీలు, ప్రభుత్వ/ప్రభుత్వ ఎయిడెడ్, ప్రయివేటు, ఎన్జీవో సంస్థల ఆధ్వర్యంలో నడిచే ప్రీస్కూళ్లలో అభ్యసిస్తున్న చిన్నారులందరికీ ఒకటో తరగతిలో చేరడానికి ముందే నాణ్యమైన విద్యను మూడేళ్ల పాటు అందించేందుకు ఈ విధానం దోహదపడుతుందని కేంద్రం ఉద్దేశం. నూతన విద్యా విధానానికి అనుగుణంగా ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న వయసు నిబంధనను సర్దుబాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.
ప్రీ స్కూల్ నుంచి 2వ తరగతి వరకు..
చిన్నారుల పునాది దశ విద్యాభ్యాసాన్ని బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ విద్యావిధానం-2020 సిఫార్సు చేసింది. పునాది దశలో విద్యార్థులకు అయిదేళ్లపాటు అభ్యాస అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. అందులో 3 ఏళ్లు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, తర్వాత 2 ఏళ్లు ప్రాథమిక విద్యలో తొలిదశ అయిన 1, 2వ తరగతులు ఉంటాయి. ప్రీ స్కూల్ నుంచి 2వ తరగతి వరకు పిల్లలకు ఎలాంటి అవాంతరాలు లేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించాలనేడే ఈ విధానం ముఖ్య ఉద్దేశమని కేంద్రం తన లేఖలో పేర్కొంది.
మూడేళ్లపాటు పిల్లలకు..
అలాగే అంగన్‌వాడీలు, ప్రభుత్వ/ ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు, ఎన్‌జీవోలు నిర్వహించే ప్రీ స్కూల్ కేంద్రాల్లో మూడేళ్లపాటు పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఈ లక్ష్యం నెరవేరాలంటే ఒకటో తరగతిలోకి ఆరేళ్లు నిండిన విద్యార్థులకు మాత్రమే పాఠశాలల్లో ప్రవేశం కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ప్రీ స్కూల్ విద్యార్థులకు తగిన విధంగా బోధించే టీచర్లను తయారుచేయడానికి వీలుగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా కోర్సును రూపొందించాలి. ఈ కోర్సును ఎస్‌సీఈఆర్‌టీ, డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‌ల (డైట్) ద్వారా అమల్లోకి తీసుకురావలని’ కేంద్రం సూచించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)