(Source: ECI/ABP News/ABP Majha)
NEET UG - 2024: నీట్ యూజీ దరఖాస్తుల సవరణ ప్రారంభం, వివరాల్లో తప్పులుంటే సరిదిద్దుకోండి - ఈ గడువు వరకు అవకాశం
దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ దరఖాస్తు గడువు ముగియడంతో మార్చి 18న దరఖాస్తుల సవరణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవకాశం కల్పించింది.
NEET (UG) 2024 Application: దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (National Eligibility-cum-Entrance Test) యూజీ పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ గడువు మార్చి 16తో ముగిసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు ముగియడంతో మార్చి 18న దరఖాస్తుల సవరణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించిన విండోను అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులు మార్చి 20న రాత్రి 11.50 గంటల వరకు తప్పులు సవరించుకోవచ్చు.
ఈ ఏడాది నీట్ యూజీ నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఫిబ్రవరి 9న విడుదల చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల నుంచి ఫిబ్రవరి 9 నుంచి మార్చి 16 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నీట్ యూజీ పరీక్షను మే 5న నిర్వహించనున్నట్లు ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో వెల్లడించనున్నారు. నీట్ పరీక్ష మే 5న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరగనుంది.
నీట్(యూజీ) సిలబస్ తగ్గింపు..
నీట్(యూజీ) సిలబస్‌ను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) తగ్గించిన సంగతి తెలిసిందే. విద్యార్థులపై భారం తగ్గించే విధంగా సిలబస్‌లో మార్పులు చేసింది. ఎన్‌ఎంసీ విడుదల చేసిన సిలబస్ ప్రకారం.. ఫిజిక్స్‌లో అధికంగా సిలబస్ తగ్గించారు. కెమిస్ట్రీలోనూ కొన్ని పాఠ్యాంశాలను తగ్గించారు. అయితే బోటనీ, జువాలజీ సబ్జెక్టుల సిలబస్ తగ్గించడం విద్యార్థుల ప్రిపరేషన్‌పై పెద్ద ప్రభావమేమీ చూపదని నిపుణులు అంటున్నారు. ఇది విద్యార్థులకు అనుకూలించే అంశమని చెప్పవచ్చు. అయితే సిలబస్‌ను ఆలస్యంగా విడుదల చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. సిలబస్ తగ్గింపుతో ప్రస్తుత సెకండియర్ విద్యార్థుల కన్నా, ఫస్టియర్ విద్యార్థులకే అధిక ప్రయోజనం అని నిపుణలు అంటున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
నీట్ యూజీ- 2024 వివరాలు..
ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్, ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గత ఐదేళ్లుగా ఈ పరీక్ష రాసేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. గతేడాది మొత్తం 20.38 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 11.45,968 మంది విద్యార్థులు అర్హత సాధించారు.
నీట్ యూజీ పరీక్ష విధానం..
➥ నీట్ ప్రవేశ పరీక్ష పూర్తి ఆఫ్‌లైన్ (పెన్, పేపర్) విధానంలో నిర్వహించబడుతుంది. మూడు గంటల 20 నిముషాల నిడివితో జరిగే ఈ పరీక్షలో ప్రతి సబ్జెక్టు నుండి గరిష్టంగా 45 ప్రశ్నలు చెప్పున మొత్తం 180 ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్నలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ మరియు జూవాలాజీ సబ్జెక్టులకు సంబంధించి ఉంటాయి.
➥ ఒక్కో సబ్జెక్టు నుంచి రెండు సెక్షన్ల (సెక్షన్-ఎ, బి) వారీగా 50 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-ఎ నుంచి 35 ప్రశ్నలు, సెక్షన్-బి నుంచి 15 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-బి లోని 15 ప్రశ్నల్లో 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అభ్యర్థి సమాధానం చేసిన మొదటి 10 ప్రశ్నలను మాత్రమే లెక్కింపు సమయంలో పరిగణలోకి తీసుకుంటారు.
➥ ప్రతి ప్రశ్న మల్టిఫుల్ ఛాయస్ పద్దతిలో నాలుగు ఆప్షనల్ సమాధానాలు కలిగి ఉంటుంది. అందులో ఒక సరైన సమాధానాన్ని గుర్తించవలసి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పు సమాధానం ఇచ్చిన ప్రశ్నకు మైనస్ 1 మార్కు ఇవ్వబడుతుంది.
➥ మొత్తం 720 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 10+2/ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలాజీ) లకు సంబంధించిన సిలబస్ నుండి ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్న పత్రాలు దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 09.02.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.03.2024. (09:00 PM)
➥ నీట్ యూజీ-2023 పరీక్ష తేదీ: 05.05.2024.