CMA After Intermediate: ఇంటర్ తరవాత సీఎమ్‌ఏ కోర్స్ చేయటం మంచిదేనా, ఎలాంటి అవకాశాలుంటాయ్?
ఇంటర్ తరవాత సీఏతో పాటు సీఎమ్‌ఏ కోర్స్‌కి కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కోర్స్ చేసిన వాళ్లు కార్పొరేట్ రంగంలో అడుగు పెట్టొచ్చు.
ఇంటర్ తరవాత సీఎమ్‌ఏ కోర్స్‌తో కార్పొరేట్ రంగంలోకి..
కామర్స్ రంగంలో అవకాశాలకు ఎప్పుడూ కొదవ లేదు. ఎప్పుడైతో నోట్ల రద్దు, జీఎస్‌టీ లాంటి నిర్ణయాలు అమల్లోకి వచ్చాయో అప్పటి నుంచి కామర్స్ నిపుణుల డిమాండ్ బాగా పెరిగింది. ఈ రంగంలో ఆసక్తి ఉన్న వాళ్లు ఇంటర్ తరవాతే ఈ వైపు అడుగులు వేసేందుకు మంచి అవకాశాలున్నాయి. సీఏ తరవాత అంతగా ప్రాచుర్యం పొందిన కోర్స్..కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ-CMA.ఇంటర్‌లో ఏ గ్రూప్ వారైనా సరే, సీఎమ్‌ఏ కోర్సు చేయవచ్చు. ఉద్యోగావకాశాల పరంగా చూస్తే సీఏ తరవాత ఆ స్థాయిలో ఎక్కువగా వినిపించే పేరు CMAనే. ముఖ్యంగా కార్పొరేట్ రంగంలో సీఎమ్‌ఏ కోర్స్ చేసిన వారికి అపార అవకాశాలు లభిస్తున్నాయి.
అకౌంటింగ్ ఫీల్డ్‌లో స్థిరపడేందుకు అవకాశం..
ఈ కోర్స్‌ని గతంలో ICWAగా పిలిచేవారు. ఇప్పుడు కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీగా పేరు మార్చారు. ఇంటర్ పూర్తి చేసినా వాళ్లే కాకుండా డిగ్రీ విద్యార్థులు కూడా ఈ కోర్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అకౌంటింగ్ ఫీల్డ్‌లో స్థిరపడాలనుకునే వాళ్లు ఈ కోర్స్ ఎంపిక చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ చేసిన వాళ్లు కార్పొరేట్ రంగంలోని వివిధ పరిశ్రమల్లో పని చేయొచ్చు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ఈ కోర్స్‌కి సంబంధించిన క్రెడిట్స్‌ను నిర్ణయిస్తుంది. వాల్యుయేషన్, ఫినాన్షియల్ స్టేట్‌మెంట్ అనాలసిస్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ లాంటివి ఈ కోర్స్ సిలబస్‌లో ఉంటాయి. కంపెనీకి అవుతున్న కాస్ట్‌ని అనలైజ్ చేసి దాన్ని తగ్గించుకునే మార్గాలేమిటో చెప్పటమే ఈ కోర్స్ ముఖ్య ఉద్దేశం.
మూడు లెవల్స్‌లో సీఎమ్‌ఏ కోర్సు..
సీఎమ్‌ఏ కోర్స్ పూర్తి చేసిన వాళ్లు..ప్లానింగ్, మానిటరింగ్, మేనేజ్‌మెంట్‌పై ప్రధానంగా దృష్టి సారిస్తారు. కార్పొరేట్ రంగంలో పోటీ పెరగటం వల్ల ప్రస్తుతానికి సీఎమ్‌ఏల అవసరం బాగా పెరిగింది. ఈ కోర్స్‌లో మూడు లెవల్స్ ఉంటాయి. సీఎమ్‌ఏ ఫౌండేషన్ లెవల్, సీఎమ్ఏ ఇంటర్మీడియట్ లెవల్, సీఎమ్‌ఏ ఫైనల్ లెవల్..ఇలా మూడు విభాగాలుగా కోర్స్‌ని విభజించారు. ఈ మూడు లెవల్స్‌లో ఉత్తీర్ణత సాధిస్తేనే సీఎమ్‌ఏగా ధ్రువీకరిస్తారు. ఫౌండేషన్ లెవల్ సీఎమ్‌ఏకి ఏడాదంతా అడ్మిషన్లు ఓపెన్‌గానే ఉంటాయి. జూన్‌లో ఈ పరీక్ష రాయాలనుకునే వాళ్లు, జనవరిలోనే అప్లై చేయాల్సి ఉంటుంది.
మొదటి లెవల్‌లో విద్యార్థులకు బేసిక్స్ నేర్పిస్తారు. కాస్ట్ మేనేజ్‌మెంట్ మెథడ్స్‌లో నైపుణ్యం సాధించాక ఈ కోర్స్ పూర్తైనట్టు లెక్క. ఇందుకు కనీసం 8 నెలలు పడుతుందని అంచనా. తరవాత సీఎమ్‌ఏ ఇంటర్మీడియట్ లెవల్‌లో ఫైనాన్షియల్ అకౌంటింగ్‌లో లోతైన అంశాలుంటాయి. ఈ లెవల్ పూర్తయ్యాక మూడో లెవల్‌లో పూర్తి స్థాయిలో సీఎమ్‌ఏకి కావాల్సిన అన్ని నైపుణ్యాలూ పరీక్షిస్తారు. ఇందులోనూ అర్హత సాధించాక సీఎమ్‌ఏగా సర్టిఫై చేస్తారు.
ఉపాధి అవకాశాలు
సీఎంఏ కోర్స్ పూర్తి చేసిన వాళ్లు మేనేజ్‌మెంట్ కోర్సులను అందించే సంస్థల్లో ప్రొఫెసర్లుగా పని చేయవచ్చు. గవర్నమెంట్ సెక్టార్‌లోనే కాకుండా, ప్రైవేట్ సంస్థల్లోనూ కాస్ట్ కంట్రోలర్, చీఫ్ అకౌంటెంట్, చీఫ్ ఇంటర్నల్ ఆడిటర్‌గా చేరవచ్చు. ఇక క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లోనూ జెన్‌పాక్ట్, ఐటీసీ లాంటి సంస్థలు సీఎమ్‌ఏలను రిక్రూట్ చేసుకుంటున్నాయి.