CA Course After 12th: ఇంటర్ తరవాత సీఏ చేసిన వాళ్లకు ఏయే అవకాశాలుంటాయంటే
కామర్స్ రంగంలో స్థిరపడాలనుకునే వాళ్లు ఇంటర్ తరవాత సీఏ చేయొచ్చు. సీఏ పూర్తి చేసిన వాళ్లు మంచి ప్యాకేజీలు పొందే అవకాశముంటుంది.
సీఏ కోర్సుపై పెరుగుతున్న ఆసక్తి
ఒకప్పుడు సీఏ అంటే చాలా మంది వెనకడుగేసేవారు. "ఇంత కష్టమైన సబ్జెక్ట్ మన వల్ల కాదులే" అని లైట్ తీసుకునే వాళ్లు. కానీ ఇప్పుడిప్పుడే
ఆలోచన మారుతోంది. గతంలో డిగ్రీ పూర్తయ్యాకే సీఏ కోర్సు చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఇంటర్ పూర్తయ్యాక కూడా సీఏలో జాయిన్ అయ్యే వెసులుబాటు రావటం వల్ల ఫినాన్స్‌పై ఆసక్తి ఉన్న వాళ్లు ఈ కోర్స్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్‌లో ఏ గ్రూప్ చేసిన వారైనా సరే, సీఏలో చేరవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది విద్యార్థులు కాస్త ముందుగానే ప్లాన్ చేసుకుని సీఏ వైపు అడుగులు వేస్తున్నారు. ఇంటర్‌లో MEC, CEC గ్రూప్‌లు చేస్తూనే సీఏను కూడా చదువుతున్నారు. ఇలా పారలెల్‌గా చదవటం వల్ల సీఏలోని బేసిక్స్‌పై పట్టు పెరుగుతోంది. సో సీఏ చేయాలనుకునే వాళ్లు ఇంటర్‌లో సీఈసీ గ్రూప్ లేకపోయినా, తరవాత సీఏ కోర్స్ చేయవచ్చు.
సీఏ అంటే ఏంటి..? ఏం చేస్తారు..?
సీఏ అంటే ఛార్టెర్డ్ అకౌంటెంట్. ఓ కంపెనీకి ఆర్థిక సలహాలు ఇవ్వటం, ఆడిటింగ్ నిర్వహించటం, ఫినాన్షియల్ మేనేజ్‌మెంట్ చేయటం లాంటివి చేస్తుంటారు సీఏలు. ప్రభుత్వ సంస్థల్లోనైనా, ప్రైవేట్ కంపెనీల్లోనైనా సీఏ తప్పనిసరి. కొందరు వ్యక్తిగతంగానూ సీఏలను నియమించుకుని, మనీ మేనేజ్‌మెంట్ కోసం సలహాలు తీసుకుంటారు.
దశలవారీగా కోర్స్..
ఇంటర్మీడియట్ లేదా 12th క్లాస్ పూర్తి చేసిన వాళ్లు ఎవరైనా సరే మొదట సీఏ ఫౌండేషన్ కోర్స్‌కి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. నాలుగు నెలల తరవాత ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయాలి. గతంలో దీని బదులు సీపీటీ పరీక్ష నిర్వహించేవారు. ఇప్పుడు ఫౌండేషన్ టెస్ట్ పెడుతున్నారు. ఇందులో 50% మార్కులు మల్టిపుల్ చాయిల్ క్వశ్చన్స్ కాగా, మరో 50% మార్కులకు డిస్క్రిప్టివ్‌గా ఉంటుంది. సీఏ ఫౌండేషన్ పరీక్ష నాలుగు పేపర్లుగా నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ 100 మార్కుల చొప్పున మొత్తం 400 మార్కులకు టెస్ట్ పెడతారు. రోజుకో పేపర్ చొప్పున నాలుగు రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తారు.పేపర్-1, పేపర్-2 పరీక్షలు డిస్క్రిప్టివ్ పద్ధతిలో, పేపర్-3, పేపర్-4 పరీక్షలు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటాయి. సీఏ ఫౌండేషన్ పరీక్షలు ఏటా మే, నవంబర్‌లో కండక్ట్ చేస్తారు. సీఏ ఫౌండేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్‌లో కనీసం 40 శాతం మార్కులు సాధించాల్సిందే. అలాగే నాలుగు పేపర్లు కలిపి 400 మార్కులకుగాను 50 శాతం మార్కులు అంటే 200 మార్కులు రావాలి.
సీఏ ఫౌండేషన్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు సీఏ ఇంటర్మీడియట్ కోర్స్ చేసేందుకు అర్హత సాధిస్తారు. ఇందులో మళ్లీ రెండు గ్రూపులుంటాయి. గ్రూప్-1లో నాలుగు పేపర్లు, గ్రూప్-2లో నాలుగు పేపర్లుంటాయి. అంటే మొత్తం 8 పేపర్లు రాయాలన్నమాట. అయితే వీటిని ఒకేసారి పూర్తి చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ఆర్నెల్ల తేడాతో రెండు గ్రూప్‌లనూ క్లియర్ చేసుకునేందుకు వీలుంటుంది. సీఏ ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందాల్సి ఉంటుంది. ఆడిట్ సంస్థలో మూడేళ్ల పాటు శిక్షణ తీసుకోవాలి. వీరికి రూ.7 వేల వరకూ స్టైఫండ్ లభిస్తుంది. సీఏ ఫైనల్‌లోనూ 8 పేపర్లుంటాయి. వీటిని కూడా ఏకకాలంలో కాకుండా రెండు సార్లు రాసే వీలుంటుంది. ప్రతిపేపర్‌లో కనీసం 40% మార్కులు వస్తేనే అర్హత సాధించినట్టు లెక్క.
సీఏ కోర్స్‌లో టాప్ కాలేజీలు
1. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ స్టడీస్ బెంగళూరు
2. యెశాస్ అకాడమీ, బెంగళూరు
3. ట్రియంఫంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్
4. సీఎమ్‌ఎస్ ఫర్ సీఏ, హైదరాబాద్
5. అరిహంత్ ఇన్‌స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్, అహ్మదాబాద్
ఉపాధి అవకాశాలు
ట్యాక్సేషన్, అకౌంటింగ్, డేటా అనాలసిస్ లాంటి విభాగాల్లో సీఏ చేసిన వారికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. జీఎస్‌టీ తరవాత ఈ అవకాశాలు ఇంకా పెరిగాయి. పరిశ్రమల లావాదేవీలు పెరగటం వల్ల సీఏలకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. విదేశాల్లోనూ సీఏలకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఫైనాన్స్ కంట్రోలర్స్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, ఫైనాన్స్,అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్స్, వాల్యూయర్‌లుగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. రూ. 6-7 లక్షల ప్యాకేజీతో మొదలై రూ. 30 లక్షల వరకూ పెరిగే అవకాశాలుంటాయి.