AP: స్థానికత గుర్తింపులో మార్పు, మరో రెండు జోన్లు ఏర్పాటు - ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీలోని విద్యార్ధుల స్థానికత గుర్తింపుకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్హత స్థాయిని 10వ తరగతి నుంచి 7వ తరగతికి తగ్గిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
➥ 10 బదులు 7వ తరగతిగా విద్యార్హత తగ్గింపు
➥ రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఉత్తర్వులు
ఏపీలోని విద్యార్ధుల స్థానికత గుర్తింపుకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్హత స్థాయిని 10వ తరగతి నుంచి 7వ తరగతికి తగ్గిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడ ఎక్కువ తరగతులు చదివారన్నది ఆధారంగా చేసుకుని దీన్ని నిర్ధారిస్తున్నారు. దాని ప్రకారమే ఉద్యోగ నియామకాలు, ఉన్నత విద్యలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడటం, ఉన్నత విద్య కోసం బయట ప్రాంతాలకు విద్యార్థులు వెళ్లడం వల్ల స్థానికులే అయినప్పటికీ చాలామంది స్థానికేతరులుగా గుర్తింపు పొందాల్సి వస్తోంది. దీన్ని అధిగమించేందుకు 10వ తరగతి నుంచి 7వ తరగతి వరకు విద్యార్హత స్థాయిని తగ్గించడం వల్ల ఎక్కువ మంది స్థానికుల కోటా పరిధిలోకి చేరుతారు. ఆ ప్రకారం వారికి ఉద్యోగ, ఉన్నత విద్య ప్రవేశాల్లో అవకాశాలు లభిస్తాయి.
మరో రెండు జోన్లు..
రాష్ట్రంలో జోన్ల వ్యవస్థలోనూ మార్పులు తీసుకొస్తూ మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం జోన్-1 కింద ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలున్నాయి. జోన్-2లో ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు, జోన్-3 కింద గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, జోన్-4 కింద చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలున్నాయి. రెండు జోన్లను అదనంగా పెంచడం వల్ల కొత్త జిల్లాలు జోనల్ వ్యవస్థలోకి వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లు ఉన్నాయి. ఒక జోన్ కింద ఉమ్మడి ఆరు జిల్లాలు, మరో జోన్ కింద ఉమ్మడి ఏడు జిల్లాలు ఉన్నాయి. వీటికి అదనంగా మరో రెండు మల్టీ జోన్లు రానున్నాయి. దీనివల్ల ప్రాంతీయ కార్యాలయాలు అదనంగా వస్తాయి. స్థానికతకు సంబంధించిన విద్యార్హతల తగ్గింపు, జోన్ల పెంపుపై మంత్రిమండలి నిర్ణయాన్ని రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది. రాష్ట్రపతి ఉత్తర్వులు 610 జీఓ ఆధారంగా చర్యలు తీసుకుంటున్నందున ప్రతిపాదిత కొత్తమార్పులకు అక్కడే ఆమోదం లభించాల్సి ఉంటుంది. అయితే ఇది లాంఛనప్రాయమే.
ఇవి కూడా..
ఏపీ మంత్రివర్గం ప్రభుత్వ సర్వీసులకు లోకల్ కేడర్స్ అండ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ డ్రాఫ్ట్ ఆర్డర్-2023కూ ఆమోదించింది. డిస్ట్రిక్ట్ కేడర్‌గా టీచర్లు, జూనియర్ అసిస్టెంట్లు, వారి సమానస్థాయి ఉద్యోగులు ఉంటారు. జోనల్ కేడర్‌గా జూనియర్ అసిస్టెంట్లు, ఆపైన ఉన్నవారు.. మల్టీజోన్ పరిధిలో సెకండ్ లెవల్ గెజిటెడ్ అధికారులు, డిప్యూటీ కలెక్టర్ స్థాయివారు, స్టేట్ లెవల్ కేడర్ ఉద్యోగులంతా మల్టీ జోనల్ పరిధిలోకి వస్తారు. అయితే ఏపీ సెక్రటేరియట్, హెచ్‌వోడీలు, రాష్ట్రస్థాయి సంస్థలు, కేపిటల్ ఏరియాలో పోలీసు కమిషనరేట్‌ను మినహాయింపునిచ్చారు. దీనివల్ల 95 శాతం పోస్టులు స్థానికులకే లభించే అవకాశం ఉంటుంది.
ALSO READ:
ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూలు విడుదల, చివరితేది ఎప్పుడంటే?
ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు వెల్లడించింది. జూనియర్ కాలేజీలు నవంబర్ 1 నుంచి 30 వరకు విద్యార్థుల నుంచి ఫీజులు స్వీకరించాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. నవంబరు 30 వరకు ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా ఫీజు చెల్లించే అవకాశం ఉందని బోర్డు తెలిపింది. కళాశాలల ప్రిన్సిపల్స్ డిసెంబరు 1లోగా ఫీజును ఇంటర్ బోర్డుఖాతాకు పంపాలని తెలిపింది. ఇక రూ.1000 ఆలస్యరుసుముతో డిసెంబరు 1 నుంచి 15 వరకు పరీక్ష చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. ఇక మొదటి ఏడాది లేదా రెండో ఏడాది ప్రాక్టికల్స్ పరీక్షలు రాసేవారు రూ.250 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..