Dussera Holidays: అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
Andhra News: ఏపీలో స్కూళ్లకు అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 13 వరకూ హాలిడేస్ ఉంటాయని మంత్రి లోకేశ్ తెలిపారు. ఒకరోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని చెప్పారు.
Minister Nara Lokesh Announced School Dussera Holidays: ఏపీలోని స్కూళ్లకు అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒక రోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని.. అక్టోబర్ 13 వరకూ సెలవులు ఉంటాయని చెప్పారు. పాఠశాల విద్య బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై ఉండవల్లిలోని నివాసంలో అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. తొలుత పాఠశాలలను లీక్ ప్రూఫ్‌గా మార్చాలని.. ప్రభుత్వ స్కూళ్లల్లో బెంచీలు, మంచి నీరు, టాయ్ లెట్స్ వంటి సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించాలని నిర్దేశించారు.
'ఆ స్కూళ్ల పని తీరు బాగుంది'
పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి.. వాటి ద్వారా ఇంటర్నల్ అస్సెస్మెంట్ చేసే ప్రక్రియను అధ్యయనం చెయ్యాలని లోకేశ్ అధికారులను ఆదేశించారు. అవసరాన్ని బట్టి అదనపు తరగతి గదులపై దృష్టి సారించాలని సూచించారు. తాను ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన శ్రీకాకుళం మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల, అకనంబట్టు హైస్కూళ్ల పని తీరు బాగుందని తెలిపారు. అక్కడి పాఠశాలలో విద్యార్థుల హ్యాండ్ రైటింగ్, పెర్ఫార్మెన్స్ బాగున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా కాపీ బుక్స్, డ్రాయింగ్ బుక్స్‌తో విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్‌మెంట్ చేసే అంశాన్ని పరిశీలించాలని నిర్దేశించారు. శ్రీకాకుళం స్కూలులో కేవలం రూ.50 వేలతో అక్కడి టీచర్లు తరగతి గదులను బాగు చేసుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నాడు-నేడు, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చుచేసినా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు ఎందుకు తగ్గిపోయారు.? లోపం ఎక్కుడుందో తెలుసుకొని సరిదిద్దాలని అధికారులకు సూచించారు.
'అమరావతిలో వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ'
ప్రభుత్వ స్కూళ్ల బలోపేతం, మెరుగైన ఫలితాల కోసం నవంబర్ 14న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్ – టీచర్స్ సమావేశాలు నిర్వహించి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని మంత్రి లోకేశ్ తెలిపారు. ఇందులో ముఖ్యమంత్రి నుంచి వార్డు మెంబర్ వరకు అందరం భాగస్వాములం అవుతామని అన్నారు. స్కూళ్లలో ఫలితాల మెరుగుదలపై ప్రతి క్వార్టర్‌కు సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గ్రంథాలయాల బలోపేతంపై చర్చించారు. కొద్దిపాటి నిధులు వెచ్చిస్తే నిరుద్యోగ యువతకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. త్వరలో అమరావతిలో అత్యాధునిక సదుపాయాలతో వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా లెర్నింగ్ ఎక్సెలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) ప్రోగ్రామ్ పై కెపిఎంజి ప్రతినిధులు నారాయణన్, సౌమ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పాఠశాల విద్య రోడ్ మ్యాప్, 117 జీవో, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై సమావేశంలో చర్చించారు. స్వర్ణాంధ్రలో భాగంగా స్కూల్స్ వారీగా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన అంశంపైనా సమాలోచనలు జరిపారు.
'నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే'
రాష్ట్రంలో వరదల కారణంగా ఉపాధ్యాయ దినోత్సవం జరపలేకపోయామని, నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డేను ఘనంగా నిర్వహించి ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించాలని లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజు, సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.