AP Degree Admissions: నేటి నుంచి ఏపీలో డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు అడ్మిషన్ల ప్రక్రియ నేటి నుంచి షురూ కానుంది. ఆన్‌లైన్ విధానం ద్వారా అడ్మిషన్లు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని డిగ్రీ కాలేజీల్లో పలు కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ నేటి (సెప్టెంబర్ 17) నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సుధీర్ ప్రేమ్ కుమార్ విడుదల చేశారు. రిజిస్టేషన్ ప్రక్రియ ఇవాల్టి నుంచి ఈ నెల 22 వరకు ఉంటుందని ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 23 నుంచి 26వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. సీట్ల కేటాయింపు వివరాలను సెప్టెంబర్ 29న వెల్లడిస్తామని చెప్పారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని వివరించారు.
వీరికి ప్రత్యేకంగా..
దివ్యాంగులు, మాజీ సైనికుద్యోగుల పిల్లలు, ఎన్‌సీసీ, క్రీడా కోటాకు చెందిన విద్యార్థులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించింది. వీరందరికీ విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ, విశాఖపట్నంలోని డా.వీఎస్ కృష్ణా కాలేజీ, తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలలో వెరిఫికేషన్ జరుగుతుందని నోటిఫికేషన్లో తెలిపారు. ప్రత్యేక కేటగిరీ వారికి సెప్టెంబర్ 23, 24 తేదీల్లో వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు.
అకడమిక్ క్యాలెండర్ విడుదల..
ఏపీలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలను అక్టోబర్ 1 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. డిగ్రీ తరగతుల నిర్వహణకు సంబంధించిన ఉమ్మడి అకడమిక్ కేలండర్‌ను సైతం ఇటీవల విడుదల చేసింది. దీని ప్రకారం.. వారానికి 6 రోజులు తరగతులు జరగనున్నాయి. ఏదైనా కారణంతో ఒక రోజు క్లాసులు జరగకపోతే వాటిని రెండో శనివారం, ఆదివారం లేదా ఇతర సెలవు దినాల్లో నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ సారి సరి, బేసి విధానంలో అకడమిక్ క్యాలెండర్‌ను ఖరారు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ (SOP), తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి 1, 3, 5 సెమిస్టర్ల తరగతులు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు 1, 3, 5 సెమిస్టర్ ఇంటర్నల్ పరీక్షలను నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 22న తరగతుల ముగింపు ఉంటుంది. 2022 జనవరి 24 నుంచి సెమిస్టర్ పరీక్షలను ప్రారంభించనున్నారు. ఇక 2022 ఫిబ్రవరి 15 నుంచి 2, 4, 6 సెమిస్టర్ల తరగతులు ప్రారంభమవుతాయి. ఇంటర్నెల్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 4 నుంచి 9 వరకు నిర్వహిస్తారు. వచ్చే ఏడాది మే 28తో తరగతులు ముగుస్తాయి. 2, 4, 6 సెమిస్టర్ పరీక్షలు 2022 జూన్ 1 నుంచి జరుగుతాయి.
Also Read: AP ICET Exam 2021: నేటి నుంచి ఏపీ ఐసెట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
Also Read: IIT Admissions: ఆర్ట్స్, కామర్స్ వాళ్లు కూడా ఐఐటీల్లో చేరవచ్చు.. ఎలా అంటే?