AP SSC Results 2023: రేపే ఏపీలో పదో తరగతి ఫలితాలు, అధికారిక ప్రకటన వచ్చేసింది
AP SSC Results 2023 Date: ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదలపై స్పష్టత వచ్చింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టెన్త్ ఫలితాలను శనివారం విడుదల చేయనున్నారు.
AP 10th Results 2023: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ క్రమంలో ఏపీ టెన్త్ ఫలితాలు విడుదలయ్యే తేదీలు ఇవేనంటూ సోషల్ మీడియాలో కొన్ని తేదీలు ప్రచారం చేశారు. ఏపీలో విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న 10వ తరగతి ఫలితాలు మే 6వ తేదీన విడుదల కానున్నాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం ఉదయం 11 గంటలకు విజయవాడలో ఏపీ పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో శుక్రవారం జరిగిన చర్చల అనంతరం ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ మేరకు టెన్త్ ఫలితాల విడుదల తేదీపై అధికారిక ప్రకటన విడుదలైంది.
వివిధ ఛానల్స్ లోగోలతో ఉండే స్క్రీన్‌షాట్లను పోస్టు చేస్తూ శుక్రవారమే పదోతరగతి ఫలితాలు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర గందరగోళంలో పడిపోతున్నారు. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిందా, ఇది ఫేక్ న్యూస్ ఆ అని తెలుసుకునేందుకు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం నుంచి కాస్త గందరగోళానికి గురయ్యారు. అయితే శనివారం ఏపీ విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదల కానున్నాయని అధికారిక రావడంతో క్లారిటీ వచ్చింది.
ఈ ఏడాది ఏపీ వ్యాప్తంగా 3449 పరీక్ష కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. వీటిలో 682 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా విద్యార్థులుండగా, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్లలో అత్యల్పంగా ఉన్నారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు, మాల్ ప్రాక్టీస్ ను నిరోధించడానికి 156 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 682 సిట్టింగ్ స్క్వాడ్‌లతో పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించారు. అదనంగా 104 పరీక్షా కేంద్రాలలో CCTV కెమెరాలు అమర్చారు.
ఏపీలో 6.5 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాసినట్టు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి ఇటీవల వెల్లడించారు. ఏపీలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరిగాయి. ఆయా తేదీల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. హాల్‌టికెట్ ఆధారంగా విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. అయితే ఈ సారి ఏడు ప్రాంతీయ భాషలలో ఎగ్జామ్స్ రాశారు. విద్యార్థులు రాష్ట్ర భాషా వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ తెలుగు, ఇంగ్లిష్, కన్నడ, తమిళం, హిందీ, ఉర్దూ, ఒడియా భాషల్లో పరీక్షలు రాసే అవకాశం కల్పించారు. ఏప్రిల్ 19 నుంచి 26వరకు స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. మే రెండో వారంలో ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ భావించింది, కానీ వాల్యుయేషన్ అనుకున్న సమయానికి పూర్తి కావడంతో మే 6న టెన్త్ ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు.