బైక్‌పై వేగంగా వెళ్లాడని వ్యక్తి దారుణహత్య, 12 ఏళ్ల తరువాత 7 మందికి యావజ్జీవ కారాగార శిక్ష
2010 అక్టోబర్ 18 న రాత్రి జరిగిన హత్య కేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి సి.ఎన్ మూర్తి బుధవారం తీర్పు వెలువరించారు.
- 2010 సం. లో వేముల పోలీస్ స్టేషన్ పరిధిలోని భూమయ్య గారి పల్లిలో వ్యక్తి హత్య
- ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించిన అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.జయలక్ష్మి
- కేసును దర్యాప్తు చేసిన అప్పటి పులివెందుల సి.ఐ, ప్రస్తుత జమ్మలమడుగు డి.ఎస్.పి నాగరాజు
- 7 మంది కి యావజ్జీవ కారాగార శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించిన ఫస్ట్ ఏ.డి.జె కోర్టు
- నేరస్థులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను
అభినందించిన జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ (ఐ.పి.ఎస్)
కడప: కొన్నేళ్ల కిందట వేముల పోలీస్ స్టేషన్ పరిధిలోని భూమయ్యగారిపల్లిలో జరిగిన హత్య కేసులో ఫస్ట్ ఏ.డి.జె కోర్టు 7 మందికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించింది. భూమయ్య గారి పల్లి గ్రామంలో 2010 అక్టోబర్ 18 న రాత్రి హత్యకు గురైన మల్లకుంట్ల మల్లారెడ్డి(35) కేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి సి.ఎన్ మూర్తి బుధవారం తీర్పు వెలువరించారు.
కేసు వివరాలిలా ఉన్నాయి.. అక్టోబర్ 19, 2010 న గంగిరెడ్డి ఓబుల్ రెడ్డి ఫిర్యాదు మేరకు వేముల పోలీసులు క్రైమ్ నెంబర్ 249/2010 U/s 147, 148, 324, 326, 302 r/w 149 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. తమ ఇంటి ముందు నుండి బైక్ పై వేగంగా వెళ్తున్నాడనే నెపంతో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. గొడవ అంతటితో ఆగలేదు. మల్లకుంట్ల మల్లారెడ్డిని ప్రత్యర్ధులు హత్య చేసారు. కేసులో ముద్దాయిలైన ఏ 1 మల్లె రాజా (30 ), ఏ 2 మల్లె బుడ్డ రాజులూ (60), ఏ 3 మల్లె గంగాధర్ (50), ఏ 4 బత్తల వెంకటరమణ(48), ఏ 5 గోగుల నాగరాజు (41), ఏ 6 మల్లె గంగరాజు (55), ఏ 7 మల్లె గంగాధర్ అలియాస్ చంటి (35)లకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
కేసును అప్పటి పులివెందుల సి.ఐ, ప్రస్తుత జమ్మలమడుగు డి.ఎస్.పి నాగరాజు దర్యాప్తు చేశారు. కేసు విచారణలో ప్రాసిక్యూషన్ తరపున అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.జయలక్ష్మి (ప్రస్తుతం విశ్రాంత పబ్లిక్ ప్రాసిక్యూటర్) వాదనలు వినిపించారు. ప్రస్తుత అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖదీరున్ ప్రాసిక్యూషన్ తరపున హాజరయ్యారు. సకాలంలో సాక్షులను ప్రవేశపెట్టడంతో చొరవ తీసుకోవడంతో పాటు సాక్ష్యాధారాలతో నేరస్థులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ (ఐ.పి.ఎస్) ప్రత్యేకంగా అభినందించారు.