YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో కీలక పరిణామం - సుప్రీంకోర్టులో వైఎస్ సునీత పిటిషన్!
సుప్రీంకోర్టు ధర్మాసనం పర్యవేక్షణలో వివేకా హత్య కేసు విచారణ జరగాలని వైఎస్ సునీత పిటిషన్ దాఖలు చేశారు. బాధితులు, దర్యాప్తు అధికారులపైనే నిందితులు కేసులు పెడుతున్నారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు
YS Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. సీబీఐ దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని సీరియస్‌గా దర్యాప్తు చేయడం లేదని.. దర్యాప్తు అధికారులపైనే నిందితులు కేసులు పెడుతున్నారని ఈ కేసును సుప్రీంకోర్టు ధర్మానసం పర్యవేక్షించాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె సునీత పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య ప్రత్యక్ష భాగస్వామ్యం ఉన్నట్లుగా అనుమానిస్తున్న వ్యక్తులను సీబీఐ అరెస్టు చేసి జైలుకు తరలించింది. అయితే వివేకా హత్య కేసులో సూత్రధారులు ఎవరు అనేది తేల్చి అరెస్టు చేయడంలో సీబీఐ పురోగతి సాధించలేదు.
రాజకీయ విషయంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసు
2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ వివేకా హత్య జరిగింది. ఆ సమయంలో టీడీపీ అధికారంలో ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ హత్యపై విచారణకు సిట్ ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ కూడా సిట్ దర్యాప్తును ఏర్పాటు చేసింది. అయితే విచారణలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను తేల్చాలని కోరుతూ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవీంద్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వాస్తవాలు వెలుగు చూడాలంటే సీబీఐ విచారణ అవసరమని వారు ఆ పిటిషన్లలో కోరారు. దీంతో ఏపీ హైకోర్టు వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించింది.
దస్తగిరి అప్రూవర్‌గా మారడంతో కీలక పరిణామాలు
వివేకానందరెడ్డి హత్యపై 2021 ఆగస్ట్ 30న దస్తగిరి స్టేట్‌మెంట్ ఇచ్చారు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ను మిగతా నిందితుల లాయర్లకు కోర్టు ఇచ్చింది. కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో దస్తగిరి బడా నేతల పేర్లు ప్రస్తావించారు. సీఆర్‌పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో ఉంది. ఎర్ర గంగిరెడ్డి , సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి కుట్రపన్నినట్లు దస్తగిరి పేర్కొన్నారు. ప్రస్తుతం ఎర్రగంగిరెడ్డి మినహా మిగిలిన వారు జైల్లో ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో సీబీఐ విచారణ ఆగిపోయింది.
ఆగుతూ సాగుతున్న సీబీఐ దర్యాప్తు
సీబీఐ విచారణ జరుగుతున్న సమయంలో అనేక ఘటనలు జరిగాయి. సీబీఐ అధికారులపై ఆరోపణలు చేస్తూ.. సాక్షులు..నిందితులుగా ఉన్నవారు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. సీబీఐ విచారణాధికారి రాంసింగ్‌పై కేసు కూడా నమోదు చేశారు. అదే సమయంలో వైఎస్ సునీతతోపాటు ఆమె భర్తపైనా నిందితుల కుటుంబ సభ్యులు ప్రైవేటు కేసు దాఖలు చేశారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ వైఎస్ సునీతా రెడ్డితోపాటు ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి బావ మరిదిపై కేసు దాఖలు చేసింది. ఇన్ని మలుపులు తిరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు విచారణ జరగాలని వైఎస్ సునీత తాజాగా పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశం అవుతోంది.