Crime News: ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు, ఇంట్లో వాళ్లను చంపుతానని బెదిరించడంతో యువతి ఆత్మహత్య
ప్రేమించానన్నాడు.. ప్రేమించకుంటే ఇంట్లో వాళ్ల చంపేస్తానంటూ బెదిరించాడు. భయపడిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఏడు రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయింది.
ఏపీలో ప్రేమ పేరుతో వేధింపులకు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన చెన్నం శెట్టి నాగేంద్ర బాబు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనకు ఇష్టం లేదని చెప్పినా ఆమెను బలవంతం చేస్తూ వచ్చాడు.
విషయం తెలుసుకున్న పెద్దలు నాగేంద్రను మందలించారు. అయినా నాగేంద్ర వెనక్కి తగ్గలేదు. ఎవరు ఏం చెప్పినా వినలేదు. ఆమె వెంట పడుతూ వచ్చాడు. విషయం మరింత ముదిరిపోతుందని గ్రహించిన అమ్మాయి తరఫు బంధువులు యువతిని అమ్మమ్మ ఇంటికి పంపించారు.
యువతి వాళ్ల అమ్మమ్మ ఇంటికి వెళ్లిందని గ్రహించిన నాగేంద్రం అక్కడికి కూడా వెళ్లాడు. తను ప్రేమించాలని బలవంతం పెట్టారు. రెండు నెలలు ఆ అమ్మయి అక్కడ ఉన్నప్పటికీ నాగేంద్రం తన వేధింపులు మానుకోలేదు.
అక్కడ తనకు అడిగేవాళ్లు లేరని గ్రహించిన నాగేంద్ర ఫిబ్రవరి ఒకటో తేదీన తన తాతయ్య పత్తి శ్రీను, బావమరిది అనిల్‌తో కలిసి ఆ యువతిని ఎత్తుకెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. గ్రామస్థులు అడ్డుకోవడంతో ఆ ప్రయత్నానికి గండి పడింది.
కుటుంబం పరువు తీయొద్దని, పెళ్లి కావాల్సిన అమ్మాయికి అన్యాయం చేయద్దని యువతి తరపు బంధువులు ఎంత వేడుకున్నా నాగేంద్ర వదల్లేదు. విషయం తెలుసుకున్న తండ్రి వెళ్లి కుమార్తెను సొంతూరు తీసుకొచ్చాడు.
సొంతూరు ఆమె వచ్చిందని తెలుసుకున్న నాగేంద్రబాబు... ఈసారి ఆమె ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చాడు. అడ్డుగా వచ్చిన ఆమె తండ్రిని చితకబాదాడు. తమ్ముణ్ణి కూడా కొట్టాడు. ఎక్కువ చేస్తే చంపేస్తానని బెదిరించాడు.
విషయం మరింత సీరియస్ అవుతుందని గ్రహించిన ఆ యువతి భయాందోళనకు గురైంది. తన వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయన్న మనో వ్యధతో ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని టైంలో ఎలుకల మందు తీసుకొని ఆత్మహత్య చేసుసుకుంది.
ఈ నెల 2వ తేదీ బుధవారం ఎలుకల మందు తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వినుకొండ పట్టణంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. రోజులు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని తేల్చేశారు. అప్పటి నుంచి 7 రోజులపాటు చికిత్స అందిస్తూ వచ్చారు.
చికిత్సకు కోలుకుంటుందని భావించిన ఆ యువతి ఫ్యామిలీకి విషాదమే మిగిలింది. చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం ఉదయం మృతి చెందింది. దీంతో ఆ ఫ్యామిలీ బోరుమంటోంది. ప్రశాంతంగా ఉన్న ఫ్యామిలీని నాగేంద్ర చిన్నాభిన్నం చేశాడని ఆరోపిస్తోంది.
ఈ ఫ్యామిలీని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. కచ్చితంగా నాగేంద్రకు శిక్ష పడేలా చేస్తామన్నారు. ఇతనికే కాదు. ఇలాంటి ఉన్మాద చర్యలు ఎవరు చేసినా కచ్చితంగా కోర్టులో దోషులుగా నిలబెడతామన్నారు పద్మ.