Tirupati Crime: కత్తులు, తుపాకీలతో బెదిరించి నగల దుకాణంలో చోరీ, ఓ దొంగను చితకబాదిన స్థానికులు
Robbery at Jewellery Shop: సినిమా సీన్ తరహాలో తిరుపతి జిల్లాలో కొందరు యువకులు నగల దుకాణంలో చోరీకి యత్నించారు. స్థానికులు తెగువ చూపించడంతో ఓ నిందితుడు దొరికాడు.
Yerpedu mandal, Tirupati district: తిరుపతి : సినిమా సీన్ తరహాలో తిరుపతి జిల్లాలో కొందరు యువకులు నగల దుకాణంలో చోరీకి యత్నించారు. కత్తులు, తుపాకులతో బెదిరించే ప్రయత్నం చేసినా.. స్థానికులు తెగువ చూపించడంతో ఓ నిందితుడు దొరికాడు. కానీ మరో ఇద్దరు దొంగలు చోరీ చేసిన నగలతో చాకచక్యంగా తప్పించుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
స్థానికుల కథనం ప్రకారం..
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం, పాపా నాయుడుపేటలోని వైఎస్ఆర్ పార్టీ నేతకు చెందిన బంగారం దుకాణంలో కొందరు దొంగలు చొరబడ్డారు. రేణిగుంట జ్యోతినగర్ కు చేందిన ఓ యువకుడు మరో ఇద్దరు యువకులతో కలిసి నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్ లో వచ్చాడు. కత్తులు, తుపాకులతో బెదిరింపులకు పాల్పడి.. బంగారు దుకాణంలోని నగలు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు. షాపులో ఉండేవాళ్ళు గట్టిగా అరవడంతో స్థానికులు దుకాణం వద్దకు చేరుకుని ఒక దొంగను చాకచక్యంగా పట్టుకున్నారు. మరో ఇద్దరు దొంగలు స్ధానికుల నుండి తప్పించుకుని పరారయ్యారు.
స్థానికుల ఫిర్యాదు మేరకు ఏర్పేడు, గాజులమండ్యం పోలీసులు జ్యువెలరీ షాప్ వద్దకు చేరుకుని పరిశీలించారు. నగల దుకాణంలో ఎంత బంగారం చోరీకి గురి అయింది అనే విషయం పోలీసులు విచారణలో తేలియాల్సి ఉంది.. మరో ఇద్దరు దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులు చితకబాది ఓ దొంగను పోలీసులకు అప్పగించారు. ఈ చోరి వెనుక ఎవరు ఉన్నారనే విషయం పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.