Telangana: అండర్ వేర్ లో మూడున్నర కిలోల బంగారం, పంతంగి టోల్ ప్లాజా వద్ద ముగ్గురు నిందితుల అరెస్ట్
Telangana: యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు పంతంగి టోల్ ప్లాజా వద్ద మూడున్నర కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. అక్రమంగా బంగారం తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Telangana: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు మూడున్నర కిలోల బగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అలాగే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పంతంగి టోల్ గేట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ కారులో సుల్తానా, షరీప్, జావేద్ లు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు. అందరినీ ఆపినట్లుగానే వీరిని కూడా ఆపి తనిఖీలు చేయగా.. షరీఫ్ అండర్ వేర్ లో బంగారం ఉండటాన్ని పోలీసులు గమనించారు. వారిని విచారించగా మొత్తం మూడున్నర కిలోల బంగారం బయట పడింది. అయితే దుబాయ్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టులో ఫ్లైట్ దిగి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో వాహనాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వస్తున్న కార్లను చౌటుప్పల్ మండలం పంతంగి వద్ద ఆపి తనిఖీ చేయగా నిందితులు అనుమానాస్పదంగా కనిపించారు. అనుమానం వచ్చి తనిఖీలు చేయగా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవలే శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పేస్టు..
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అసోం నుంచి హైదరాబాద్ కు వచ్చిన విమానంలో అక్రమంగా బంగారం రవాణా చేస్తున్నారని కస్టమ్స్ అధికారులకు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించారు. విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో లాండ్ అవ్వగానే సోదాలు చేయగా ఓ వ్యక్తి సీటు కింద పాకెట్‌లో పేస్ట్ రూపంలో ఉన్న 472.8 గ్రాముల బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ బంగారం ధర రూ. 23.33 లక్షలు అని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు కట్టుదిట్టమైన తనిఖీలు చేస్తున్నా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. నిత్యం బంగారం పట్టుబడుతున్న వార్తలు వెలుగుచూస్తున్నాయి. ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు తనిఖీల్లో భారీగా బంగారం స్వాధీనం చేసుకుంటున్నారు. ఎక్కువగా అరబ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అధికారులు అంటున్నారు.
సూట్ కేస్ రైలింగ్ లో బంగారం
నవంబర్ 27న దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు 410 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ పసిడి విలువ రూ.20.30 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పౌడర్ టిన్, సూట్ కేస్ రైలింగ్ లో బంగారాన్ని తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
బంగారం తరలిస్తున్న ముగ్గురు మహిళల అరెస్ట్
శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో నవంబర్ 22న బంగారం, విదేశీ కరెన్సీ పట్టుబడింది. బంగారం, విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తూ పలువురు అధికారులకు చిక్కుతున్నారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. యూఏఈ, యుఎస్ కరెన్సీని తరలిస్తున్న ఇద్దరు మహిళలను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 11.49 లక్షల విలువైన యూఏఈ కరెన్సీ, యుఎస్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన మరో మహిళ దగ్గర రూ. 17.69 లక్షలు విలువ చేసే బంగారం బిస్కెట్లను ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.