Khammam News: దారుణం - చెవిదుద్దులు కొనివ్వలేదని భర్తకు నిప్పంటించిన భార్య, ఎక్కడంటే?
Telangana News: ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. తనకు చెవి దుద్దులు కొనివ్వలేదని ఓ మహిళ తన భర్తపై పెయింట్స్ కెమికల్స్ పోసి నిప్పంటించింది.

Wife Sets Fire To Her Husband in Khammam: ఓ మహిళ తనకు చెవిదుద్దులు కొనివ్వలేదని భర్తకు నిప్పుపెట్టిన ఘటన ఖమ్మం (Khammam) జిల్లాలో సంచలనం కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నిజాంపేటలో షేక్ యాకూబ్ పాషా, సమీనా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తనకు చెవిదుద్దులు కావాలని సమీనా తన భర్తను అడిగింది. అయితే, అతను తన దగ్గర అంత డబ్బు లేదని తర్వాత కొనిస్తానని చెప్పాడు. ఈ విషయమై శనివారం సాయంత్రం ఇద్దరి మధ్య వివాదం తీవ్రమైంది. దీంతో ఆవేశానికి లోనైన సమీనా.. ఇంట్లో ఉన్న పెయింట్లకు సంబంధించిన రసాయనాన్ని భర్త పాషాపై పోసి నిప్పంటించింది. దీంతో పాషా గట్టిగా కేకలు వేస్తూ.. కాపాడాలని బయటకు పరుగులు తీశాడు. వెంటనే గమనించిన స్థానికులు మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పాషా తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. నిందితురాలు సమీనాను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.





















