Anantapuram News: భార్య కళ్లెదుటే భర్త దారుణ హత్య - గుండెపోటుతో భార్య మృతి, ఎక్కడంటే?
Andhrapradesh News: భార్య కళ్లెదుటే తన భర్తను గొంతు కోసి హతమార్చడం చూసిన ఓ మహిళ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

Wife Died With Heart Attack After Her Husband Murder In Anantapuram: తన కళ్ల ముందే భర్తను దారుణంగా హతమార్చడం చూసిన ఓ మహిళ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతపురం (Anantapuram) జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. నగరంలోని జేఎన్టీయూ (JNTU) సమీపంలో మూర్తి రావు గోఖలే (59), ఆయన భార్య శోభ (56) నివసిస్తున్నారు. మూర్తి రావు ఉద్యోగం ఇప్పిస్తానని గతంలో తన మేనల్లుడు ఆదిత్య దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఈ విషయంలో ఆదివారం రాత్రి ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఆదిత్య కత్తితో మూర్తిరావును గొంతు కోసి హతమార్చాడు. కళ్ల ముందే భర్తను దారుణంగా చంపడంతో శోభ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజు దంపతుల మృతితో తీవ్ర విషాదం నెలకొంది. బంధువుల రోదనలు మిన్నంటాయి.





















